టీ20 ప్రపంచకప్-2024లో భాగంగా భారత్-బంగ్లాదేశ్ జట్ల మధ్య న్యూయార్క్‌లోని నసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగిన సన్నాహక మ్యాచ్‌లో నాటకీయ పరిణామం చోటు చేసుకుంది. భారత్ ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో కెప్టెన్ రోహిత్ శర్మ వద్దకు అభిమాని ఒకరు మైదానంలోకి పరుగెత్తుకెళ్లాడు. అతను రోహిత్‌ను హత్తుకోవడం, భద్రతా సిబ్బంది వెంటనే స్పందించి అభిమానిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఈ సంఘటన రోహిత్ శర్మను కాస్త కంగారు పెట్టింది, కానీ అభిమాని విషయంలో కఠినంగా వ్యవహరించొద్దని ఆయన పోలీసులకు సూచించాడు. న్యూయార్క్‌లో కొత్తగా నిర్మించిన స్టేడియంలో భారత్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన ఈ వార్మప్ మ్యాచ్‌లో భారత్ 60 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్, 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 182 పరుగులు సాధించింది. రిషబ్ పంత్ 53 పరుగులు, హార్దిక్ పాండ్యా అజేయంగా 40 పరుగులు చేశారు. లక్ష్య ఛేదనలో బంగ్లా బ్యాటర్లు విఫలమవడంతో 122 పరుగులకే పరిమితమయ్యారు. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్, శివమ్ దూబే, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, హార్ధిక్ పాండ్యా, అక్షర్ పటేల్ ప్రతిభ కనబర్చారు. ఈ విజయంతో టీమిండియా జూన్ 5న ఐర్లాండ్‌తో మొదటి మ్యాచ్ ఆడేందుకు సిద్ధమవుతోంది.