వైఎస్సార్ కాంగ్రెస్ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడును అమరావతిని కాకుండా విశాఖను ఆంధ్రప్రదేశ్ రాజధానిగా పరిశీలించాలని అభ్యర్థించారు. “అమరావతిని వదిలేయమని తాము చెప్పడంలేదు. అమరావతిని ఓ గొప్ప నగరంగా తీర్చిదిద్దుతూనే, రాజధానికి కావాల్సిన అన్ని వనరులు కలిగిన విశాఖను రాజధానిగా పరిశీలిస్తే బాగుంటుంది” అని అన్నారు. అమర్నాథ్ మాట్లాడుతూ, “ప్రజలకు అడిగిన దానికంటే ఎక్కువే చేసాం. వారి కోసం అన్ని రకాల వసతులు కల్పించాం. అన్నీ వారి ఇంటి వద్దే అందించాం. అయినా ప్రజలకు మా నుంచి ఏం తక్కువైందో అర్థం కావడం లేదు. తప్పకుండా ఎక్కడ లోపాలు జరిగాయో సమీక్ష చేసుకుని మళ్లీ అధికారంలోకి వచ్చే ప్రయత్నం చేస్తాం. కొత్తగా ఏర్పడిన ప్రభుత్వాన్ని రేపటికి రేపే హామీలన్నీ నెరవేర్చాలని అడగం. వారికి కావాల్సిన సమయం ఇస్తాం. కానీ వారు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే మాత్రం ప్రతిపక్ష హోదాలో ఉండి ప్రశ్నించి తీరతాం” అని తెలిపారు.