Thursday, December 19, 2024
Homenewsఅయోధ్య రాముడి విగ్రహం వెనుక దాగి ఉన్న కన్నీటి కథ!

అయోధ్య రాముడి విగ్రహం వెనుక దాగి ఉన్న కన్నీటి కథ!

By

ఐశ్వర్య రాజ్

అయోధ్యలో కొలువై ఉన్న బాలరాముడి మనోహర రూపాన్ని చూసి ఆనందంతో పరవశించిపోయే వారు కోట్లాది మంది. ఆ బాలరాముడి మనోహర రూపాన్ని దర్శించుకోవటం కోసం భారీగా ఖర్చు చేసి మరి అయోధ్యకు వెళ్లేందుకు కోట్లాది మంది సిద్ధమవుతున్నారు. ఇలాంటి సమయంలోనే.. ఈ బాల రాముడి విగ్రహాన్ని తయారు చేసేందుకు ఉపయోగించిన శిల వెనుక ఒక కన్నీటి గాథ ఉంది. అది అనూహ్యంగా బయటకు వచ్చింది. ఈ రియల్ స్టోరీ గురించి తెలిస్తే ఎవ్వరికీ నోట మాట రాని పరిస్థితి.

కర్ణాటక రాష్ట్రంలోని ఒక రైతు పొలం నుంచి తీసిన రాయితో ఈ విగ్రహాన్ని రూపొందించడం తెలిసిందే. అయితే.. పొలంలో రాయిని బయటకు తీసే క్రమంలో.. ఆ పని చేసేందుకు  ఒప్పుకున్న ఒక కాంట్రాక్టర్ అప్పుల పాలైన చేదు నిజం తెలిస్తే అందరూ అయ్యో అని అనుకుంటారు. బాలరాముడి విగ్రహాన్ని చెక్కిన శిల్పి అరుణ్ యోగిరాజ్ ను అందరూ ప్రశంసిస్తున్నారు. కానీ.. ఆయన ఉపయోగించిన శిల ఎక్కడిది? దానిని బయటకు తీసిన వ్యక్తి ఎవరు? ఆయన గురించిన వివరాలు, ఆయన పరిస్థితి ఏమిటి? అన్న ప్రశ్నకు సమాధానం దొరికితే షాకింగ్ నిజం బయటకు వస్తుంది.

వివరాల్లోకి వెళితే కర్ణాటక రాష్ట్రం మైసూర్ జిల్లా హెచ్ డీ కోట తాలూకా బుజ్జేగౌడనపురలోని ఒక పొలంలో బయటపడిన ఈ రాయి.. ఈ రోజు కోట్లాది మందికి కన్నుల పండుగా మారింది. తన పొలంలోని రాయిని గుర్తించిన రైతు.. దాన్ని బయటకు తీసే కాంట్రాక్టును శ్రీనివాస్ అనే వ్యక్తికి ఇచ్చాడు. కాంట్రాక్టు లో భాగంగా ఆ రాయిని బయటకు తీశారు. రాయిని బయటకు తీసిన కార్మికులకు ఇవ్వాల్సింది ఇచ్చేసిన తర్వాత సదరు కాంట్రాక్టరుకు రూ.25 వేలుమాత్రమే మిగిలింది. ఇక్కడే అనుకోని ట్విస్టు తెర మీదకు వచ్చింది. తమ అనుమతి లేకుండా పొలాన్ని తవ్వి.. రాతిని బయటకు తీశారంటూ కర్ణాటక రాష్ట్ర గనులు, భూగర్భ శాఖ అధికారులు సదరు కాంట్రాక్టర్ కు నోటీసులు జారీ చేశారు. తక్షణం రూ.80వేలు కట్టాలని లేకుంటే క్రిమినల్ కేసు నమోదు చేస్తామని వార్నింగ్ కాంట్రాక్టర్ కు ఇచ్చారు. దీంతో భయపడిపోయిన ఆ కాంట్రాక్టర్ శ్రీనివాస్ చేతిలో ఉన్న రూ.25వేలకు అదనంగా రూ.55 వేలు అవసరమయ్యాయి. అతని చేతిలో డబ్బులు లేకపోవటంతో.. అతని భార్య తాళిని తాకట్టు పెట్టి మరీ జరిమానా కట్టేశారు.

కాంట్రాక్టర్ శ్రీనివాస్ కు ఎనిమిది నెలల క్రితమే పెళ్లైంది. అయితే.. అధికారుల హెచ్చరికల నేపథ్యంలో ఏం చేయాలో తోచక భార్య తాళిని తాకట్టు పెట్టి.. జరిమానాను కట్టేశారు. ఈ రాయిని అయోధ్యలో బాలరాముడి విగ్రహం కోసం ఎంపిక చేసుకుంటారని ఆయనకు తెలియదు. అయితే.. అయోధ్యలో బాలరాముడి విగ్రహానికి అవసరమైన అరుదైన రాతి కోసం అన్వేషిస్తున్న వారికి.. శ్రీనివాస్ బయటకు తీసిన రాయి చాలా అరుదైన మేలు రకానికి చెందిన విషయాన్ని గుర్తించి.. దాన్ని అయోధ్యకు తరలించి.. బాల రాముడి విగ్రహాన్ని రూపొందించారు.

కాగా ఈ విషయం గురించి అయోధ్య రామ జన్మ భూమి ట్రస్ట్ వాళ్ళు స్పందించి.. కాంట్రాక్టర్ శ్రీనివాస్ కి అండగా నిలబడి, అన్ని విధాలా ఆదుకోవాలని కోరుకుందాం.

RELATED NEWS
- Advertisment -spot_img

LATEST NEWS