BY
చీరాల ఇజ్రాయేల్ యాదవ్
హైదరాబాద్, (వర్డ్ ఆఫ్ ఇండియా):
ధరణిలోని సమస్యల పరిష్కారానికై రేవంత్ సర్కారు సిద్ధమైంది. దీని కోసం కొత్తగా సబ్ కమిటీని ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ కమిటీలో ఐదుగురు సభ్యులుండగా నల్సార్ విశ్వవిద్యాలయానికి చెందిన స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ గా ఉన్న భూ చట్టాల నిపుణులు సునీల్ కుమార్, మాజీ ఐఏయస్ అధికారి రేమండ్ పీటర్, విశ్రాంత భూ పరిపాలన ప్రధాన కమిషనర్, మెంబర్ కన్వీనర్ మరియు భూ పరిపాలన ప్రధాన కమిషనర్ అయిన నవీన్ మిట్టల్, కాంగ్రెస్ కిసాన్ సెల్ అధ్యక్షుడు ఎం. కోదండ రెడ్డితో కమిటీనీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ధరణీతో ముడిపడిన అన్ని అంశాలనూ క్షేత్ర స్థాయిలో పరిశీలించి పరిష్కారం దిశగా ముందుకు వెళ్లనున్నది.
అయితే రేమండ్ పీటర్ భూ పరిపాలనా ప్రధాన కమీషనర్ గా ఉన్నప్పుడే “మా భూమి” ద్వారా ప్రజలందరికీ రికార్డులు అందుబాటులో ఉండే విధంగా చేసి 18 నెలలో భూముల సర్వే చేస్తానని అప్పటి ప్రభుత్వానికి చెప్పినా, వీఆర్వోలు ఉన్నపుడే వారికి ట్యాబులు ఇచ్చి డిజిటల్ లైజేషన్ ప్రక్రియ ద్వారా భూ రికార్డుల నవీణీకరణ కార్యక్రమం ప్రారంభించారు. చివరికి డిజిటల్ లైజేషన్ చేసిన ఆ డేటా ఆధారంగా రైతుబంధును ప్రారంబించి ఆ డేటాను ఆధారం చేసుకొని “తెలంగాణా భూమి హక్కులు పట్టాదార్ పాస్ పుస్తకం చట్టం 2020” ను అమలులోకి తెచ్చారు. ఇలా ధరణి ద్వారా మండల కేంద్రం లోనే రిజిస్ట్రేషన్ల ప్రక్రియను ప్రారంభించారు. రిజిస్ట్రేషన్ చేసుకున్న వెంటనే అమ్మిన వ్యక్తి ఖాతా నుండి కొనుగోలు దారు పేర భూమి బదిలీ కావడం 15 రోజులలో పాస్ బుక్ లభ్దిదారుని ఇంటికి వెళ్ళడం ప్రారంభమయ్యాయి.
అయినా దీని పై అధిక విమర్శలే వచ్చాయి. ఏ చిన్న తప్పు దొర్లినా స్థానికంగా రికార్డులపై అవగాహన ఉన్న తహశీల్దారుకు కూడా సరిదిద్దే అధికారం లేకపోవటం, సర్వాధికారాలు కలెక్టరు చేతికివ్వటం వల్ల ఎంతో మంది తహశీల్దారు కార్యాలయం కూడా చూడని వ్యక్తులు కలెక్టరు కార్యాలయాల చుట్టూ తిరగటం మొదలయ్యింది. భూ రికార్డులకు ప్రామాణిక రికార్డులయిన ఖాస్రా, సేత్వార్ రికార్డులతో ప్రమేయం లేకుండా ధరణిలో ఉన్న డేటాను ఆధారం చేసుకుని రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కొనసాగుతుండడం వల్ల రైతుల్లో ఆందోళన నెలకొన్నది. కొన్ని సమస్యలు తహశీల్దారు, ఆర్డీవో స్థాయిలో పరిష్కారమయ్యేవి కూడా కలెక్టరు, సీసీఎల్ఏ కార్యాలయానికి వెళ్ళాల్సి రావడం మూలాన ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చిందనే భావన ప్రజల్లో బలంగా ఉంది. చాలా మట్టుకు వేరే గత్యంతరం లేక ఎన్నో కేసులకు కోర్టులనాశ్ర యించాల్సిన అవసరం ఏర్పడ్డది.
ధరణితో చిన్న విషయాలు మినహాయిస్తే ప్రజలు ఎంతో ఇబ్బంది పడ్డారనే అంశంపై కాంగ్రెస్ పార్టీ మొదటి నుండి తన వాణి వినిపించినా ఇప్పుడు అధికారంలోకి రాగానే ధరణిని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ద్వారా రెవెన్యూ లో అనేక మార్పులను తీసుకురావాలని, వాటి ద్వారా సేవలు సులభతరం చేస్తూనే రికార్డుల భద్రతపైనా దృష్టి సారించింది. ధరణి ద్వారా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, కౌలు రైతులను గుర్తించడానికి వీలుగా ఎలాంటి చర్యలు అవసరం? గతంలో పహాణీలో ఉన్న అనుభవదారుని కాలమ్ తీసేసిన విషయమై పరిశీలన చేయడం, మండల స్థాయిలోనే అన్ని సమస్యలు పరిష్కారమయ్యే దిశగా అడుగులు పడనున్నాయి. వీటితో పాటు రికార్డులతో ముడిపడిన సమస్యలకై రెవెన్యూ ట్రిబ్యునల్ల ఏర్పాటు, సాదా బైనామాల క్రమబద్దీకరణ, అసైన్డ్ భూములపై వారికి సర్వాధికారాలు ఇవ్వడం, వివాదాల్లేని భూములకు టైటిల్ గ్యారంటీ చట్టాన్ని తీసుకొచ్చే అంశాల అధ్యయనానికి ఈ కమెటీ ఇచ్చే అంశాలపైనే భూ రికార్డుల నిర్వహణా భవితవ్యం ఆధారపడి ఉంది.
అంతే కాక ప్రధానంగా నిషేధిత భూముల జాబితా పై కూడా ప్రత్యేక దృష్టిసారించింది. రిజిస్ట్రేషన్ యాక్ట్ ప్రకారం విక్రయించడానికి వీల్లేని భూములను సెక్షను 22(ఏ) ద్వారా ఆ భూములన్నిటినీ ప్రొహిబిషన్ ఆర్డర్ బుక్ – పిఓబి (POB) జాబితాలో ఉండే వేల కోట్ల విలువ చేసే భూమి మాయమయ్యిందని, తమకు బాగా కావాల్సిన వారి కొరకు ఆ భూములను ప్రొహిబిషన్ నుండి తొలగించారనే విమర్శలు ఊపందుకున్నాయి. హైదరాబాద్ కు సమీపంలో గల జిల్లాల అధికారుల పనితీరుపై బలమైన ఆరోపణలు వచ్చాయి.ఈ నేపథ్యంలో ఈ కమిటీ సిషేదిత జాబితా నుంచి కనుమరుగైన భూముల వివరాల సేకరణ పైనా ప్రత్యేక దృష్టి సారించింది.