బీఆర్ఎస్ శాసనసభా పక్ష నేతగా కేసీఆర్ ఎన్నిక
– BY చీరాల ఇజ్రేయేల్ యాదవ్
(వర్డ్ ఆఫ్ ఇండియా)
బీఆర్ఎస్ శాసనసభా పక్ష నేతగా ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఎన్నికయ్యారు. కే. కేశవరావు అధ్యక్షతన బీఆర్ఎస్ నూతన ఎమ్మెల్యేలు తెలంగాణ భవన్‌లో ఈరోజు సమావేశమై ఈ మేరకు తీర్మానం చేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీఆర్ఎస్ 39 స్థానాలు గెలిచి ప్రతిపక్షంలో నిలిచింది. అయితే శస్త్రచికిత్స కారణంగా గులాబీ అధినేత కేసీఆర్ ఈ సమావేశానికి హాజరు కాలేదు. మిగతా ఎమ్మెల్యేలు పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ఈ సమావేశానికి హాజరయ్యారు. మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి శాసనసభా పక్ష నేతగా కేసీఆర్ పేరు ప్రతిపాదించగా మాజీమంత్రులు శ్రీనివాస్ యాదవ్, కడియం శ్రీహారిలు బలపరచారు. దీంతో మిగతా ఎమ్మెల్యేలంతా తీర్మానాన్ని ఆమోదించారు. శాసనసభాపక్షం మిగతా కమిటీ ఎంపిక బాధ్యతలను కేసీఆర్‌కే అప్పగిస్తున్నట్లు ఏకగ్రీవంగా తీర్మానించారు. అనంతరం బీఆర్ఎస్ శాసనసభ్యులంతా అసెంబ్లీకి వెళ్లారు. అటు కేసీఆర్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నందున.. ఎమ్మెల్యే కేటీఆర్ అటు బీఆర్ఎస్ఎల్పీ భేటీకి.. ఇటు అసెంబ్లీకి హాజరుకాలేదు. వ్యక్తిగత కారణాలతో ఎమ్మెల్యేలు ముఠా గోపాల్, పద్మారావులు కూడా ఈ సమావేశానికి డుమ్మా కొట్టారు.
మరోవైపు తెలంగాణ రాష్ట్ర మూడో అసెంబ్లీ మొదటి సమావేశాలు ఈరోజు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా పార్టీ విధివిధానాలు, అభ్యర్థుల ప్రవర్తనా నియమావళి, అసెంబ్లీల అనుసరించాల్సిన వ్యూహాలతోపాటు తదితర అంశాలపై చర్చించారు. అసెంబ్లీ సమావేశాలకు ముందు.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించారు.