BY Correspondent
కెవిన్ & మైక్.. ఇన్‌స్టాగ్రామ్ సహవ్యవస్థాపకులు. దాన్ని మెటా సంస్థ కొనుగోలు చేసింది. జాన్ కౌమ్, బ్రియాన్ ఆక్టన్ వాట్సప్ సృష్టించారు. పావెల్ దుర్వోవ్ టెలిగ్రామ్‌కు యజమాని. ఇలాంటి టెక్ దిగ్గజాల లిస్ట్‌లోకి చేరాడు ఓ 26 ఏళ్ల భారత కుర్రాడు. అతడే అసోం రాష్ట్రానికి చెందిన కిషన్ బగారియా. అతను క్రియేట్ చేసిన మెసేజ్ యాప్‌ను అమెరికాకు చెందిన ఓ టాప్ కంపెనీ $50 మిలియన్(దాదాపు రూ.416 కోట్లు) పెట్టి కొనుగోలు చేసింది. దీంతో కిషన్ పేరు ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.
ఇంతకీ ఎవరు ఈ కిషన్ బగారియా?
అస్సాంలోని డిబ్రూగఢ్ పరిధిలోని చారియాలీ ప్రాంతానికి చెందిన వ్యాపారవేత్త మహేంద్ర బగారియా, నమితా బగారియాల కుమారుడే కిషన్. చిన్నప్పట్నుంచి ఏదైనా వినూత్నంగా చేయాలని కిషన్ తపించిపోయేవాడట. కిషన్.. ఎనిమిదో తరగతి వరకు స్థానిక డాన్ బాస్కో స్కూల్లో చదివాడు. 9,10వ తరగతులు అగ్రసేన్ అకాడమీలో పూర్తిచేశాడు. ఏదైనా టెక్ కంపెనీ పెట్టాలని చిన్నప్పటునుంచే కిషన్ తాపత్రయ పడేవాడట. 12 ఏళ్లకే విండోస్ అనే చిన్నయాప్ కనిపెట్టాడు. గట్టిగా చెప్పాలంటే కిషన్ ఎప్పుడూ కాలేజీకి వెళ్లలేదు. ఇంటర్నెటే తనకు గురువు అయ్యింది. అక్కడనుంచే తన స్కిల్స్‌కు సాన బెట్టుకున్నాడు. ఆ క్రమంలోనే టెక్నాలజీకి మరింత దగ్గర ఉండాలని.. ఇంకా తన నైపుణ్యాన్ని మెరుగుపరుచుకోవాలని భావించి ఈ ఏడాది జనవరిలో శాన్‌ఫ్రాన్సిస్కోలో దిగాడు. అక్కడే టెక్ట్స్.కామ్ అనే ఓ సరికొత్త యాప్ డెవలెప్ చేసి చరిత్ర సృష్టించాడు. ఆ యాప్ తనకు కోట్లు తెచ్చిపెడుతుందని కిషన్ కలలో కూడా ఊహించలేదు.
టెక్ట్స్.కామ్ యాప్ కథేంటి.. ఎలా పనిచేస్తుంది?
– టెక్ట్స్.కామ్ యాప్ ఆలోచన కిషన్ బగారియాకు 2020 సంవత్సరంలోనే మొదలైంది. అప్పట్నుంచే ఈ ప్రాజెక్ట్ మొదలెట్టాడు. ప్రస్తుతం చాలా మెసేజ్ యాప్స్ అందుబాటులో ఉన్నాయి. వీటన్నిటికి కలిపి ఒకే వేదిక ఎందుకు ఉండకూడదనే ఆలోచన నుంచే ఈ టెక్ట్స్.కామ్ రూపకల్పన జరిగిందని కిషన్ చెబుతున్నాడు. మొదట్లో తన ఆలోచనను కిషన్.. స్నేహితులతో పంచుకున్నాడు. వారంతా ప్రోత్సహించడంతో ఒక ప్రొటోటైప్ యాప్ తయారు చేశాడు. దానికి మంచి రెస్పాన్స్ రావడంతో.. టెక్ట్స్.యాప్ రూపొందించి వార్తల్లోకెక్కాడు కిషన్ బగారియా. టెక్ట్స్.కామ్ నుంచి ఇన్‌స్టా, ట్విట్టర్, మెసెంజర్, వాట్సాప్ వంటి యాప్స్‌లో ఉన్న కాంటాక్స్‌తో మెసేజ్ చేసుకోవచ్చు. అంటే ఇదొక ఆల్ ఇన్ వన్ మెసేజింగ్ యాప్ అన్నమాట. ఈ కాన్సెప్ట్ యూత్‌కి బాగా నచ్చడంతో టెక్ట్స్.కామ్… మస్త్ సక్సెస్ అయ్యింది.
టెక్ట్స్.కామ్ సూపర్ ట్రెండింగ్ అవ్వడంతో అమెరికా టెక్ దిగ్గజం ‘ఆటోమేటిక్’ సంస్థ.. కిషన్‌తో రూ.416 కోట్ల డీల్ చేసుకుని కొనుగోలు చేసింది. దీంతో కిషన్ బగారియా ఒక్కసారిగా కోటిశ్వరుడయ్యాడు. అటు.. ఆటోమేటిక్ సంస్థ అధినేత మరెవరో కాదు. వర్డ్ ప్రెస్.కామ్, టంబ్లర్ వంటి ప్రముఖ సంస్థల వ్యవస్థాపకుడు మాట్ ముల్లెన్‌వెగ్. ఆయన టెక్ట్స్.కామ్ యాప్ బాధ్యతలు కూడా కిషన్‌కే అప్పజెప్పడం కొసమెరుపు.
నా కష్టానికి ఫలితం ఇది: కిషన్ బగారియా
బుధవారం స్వగ్రామానికి చేరుకున్న కిషన్ బగారియా తన ఆనందాన్ని కుటుంబంతో పంచుకున్నాడు. తన కష్టం.. తల్లిదండ్రుల ప్రోత్సాహం.. దేవుడి ఆశీర్వాదం వల్లే తనకు ఇంతటి విజయం దక్కిందని హర్షం వ్యక్తం చేశాడు. ‘ఆటోమేటిక్’ సంస్థతో ఈ డీల్ దక్కడానికి మూడు నెలల పాటు చర్చలు సాగాయని వెల్లడించాడు. ఇక టెక్ట్స్.కామ్ యాప్‌ను మరింత డెవలప్ చేయడమే తన ముందున్న లక్ష్యమని చెప్పుకొచ్చాడు.
కాగా.. గతంలో ట్విట్టర్‌లో బగ్స్ కనిపెట్టినందుకు ఆ సంస్థ కిషన్‌కు.. $7700 డాలర్లు చెల్లించింది. మరోవైపు.. తన సోదరుడు క్రిప్టో మార్కెంటిగ్‌లో పనిచేస్తూ.. యాప్స్ క్రియేట్ చేస్తున్నాడు. బగారియా సోదరులు ఇలా టెక్ రంగంలో దూసుకుపోవడంతో గ్రామస్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక తల్లిదండ్రులైతే ఆనందంలో మునిగి తేలుతున్నారు. ఇంకా లైఫ్‌లో ఎన్నో యాప్స్ క్రియేట్ చేసి మరింత సక్సెస్ అవ్వాలని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.
https://x.com/KishanBagaria/status/1716778351400985073?t=UBDVG3ptmIl3q0-S2YAm6Q&s=08
మొత్తానికి 26 ఏళ్లకే రూ.416 కోట్లు సంపాదించి భారత యువతకు కిషన్ బగారియా స్పూర్తిగా నిలిచాడు. నచ్చిన పని చేస్తూ.. ఎన్ని కష్టాలొచ్చినా తట్టుకుని నిలబడితే.. వయసుతో సంబంధం లేకుండా సక్సెస్ రుచి చూడొచ్చని నిరూపించాడు. టెక్ రంగంలో కిషన్ ఉన్నత శిఖరాలు అధిరోహించి.. భారత్ పేరు ప్రపంచ పటంలో సగర్వంగా నిలబెట్టాలని ఆకాంక్షిద్దాం.