ఉరుకుల పరుకుల గజిబిజి జీవితం. ఉద్యోగ వేటలో సంసార సాగరంలో ఈదుతున్న జనం. సరైన విశ్రాంతి లేని ఇలాంటి పరిస్థితుల్లో నిద్ర ఓ వరంలా అనిపిస్తుంటుంది కదా!. గ్యాప్ దొరికితే చాలు ఓ పవర్ నాప్ ఏసేద్దాం అని ట్రై చేస్తుంటాం. అలా తినగానే పడుకుంటూ (Sleep After Eating) ఉంటాం.. కానీ ఆ నిద్ర అనర్థాలకు దారితీస్తోందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.
మధ్యాహ్నం తినగానే పడుకుంటే..
కొందరు మధ్యాహ్నం తినగానే కాసేపు పడుకుంటూ ఉంటారు. దీన్ని పవర్ నాప్ (Power Nap) అంటారు. ముఖ్యంగా గృహిణులు ఇలా ఎక్కువ చేస్తుంటారు. ఉదయం నుంచి పనులు చేస్తూ అలసట పొందిన శరీరానికి కాసేపు విశ్రాంతినిద్దాం అని అలా పడుకుంటారు. ఓ పావుగంట నుంచి అర్ధగంట వరకు ఇలా నిద్రపోతే మంచితే కానీ.. అలానే పూర్తి నిద్రలోకి జారుకున్నారో అనారోగ్యాలు తప్పవని నిపుణుల మాట.
మరి ఎంత సమయం నిద్రపోవాలి..
మధ్యాహ్నం 1 నుంచి 3 గంటల మధ్య నిద్రకు ఉపక్రమిస్తే మేలు. చిన్నపిల్లలు, వృద్ధులు, అనారోగ్యంతో ఉన్నవాళ్లైతే 90 నిమిషాలకంటే ఎక్కువ పడుకోకూడదు. అదే సాధారణ ఆరోగ్యవంతులు 15-30 నిమిషాలు నిద్రిస్తే చాలు. అంతకు మించితే ఆరోగ్యం చెడిపోతుంది.
ఎలాంటి అనారోగ్య సమస్యలొస్తాయి..
తినగానే ఎక్కువ సేపు పడుకుంటే ఊబకాయం వచ్చే అవకాశముంది. ఎందుకంటే పగటి పూట నిద్రపోయే వాళ్లకు రాత్రి నిద్రపట్టదు. ఆ సమయంలో ఆకలితో ఏదో ఒకటి తింటూ ఉంటారు. దానివల్ల బరువు పెరుగుతుంటారు. ఫలితంగా శరీరంలో కొవ్వు పేరుకుపోయి రక్తపోటు సమస్యలొస్తాయి.
ఇంకా రాత్రిపూట సరిగా పడుకోకపోవడం వలన నిద్రలేమి వస్తుంది. సాధారణ వ్యక్తులతో పోల్చితే ఈ అలవాటు ఉన్నవారికి హార్ట్ ఎటాక్ వచ్చే ప్రమాదం 20శాతం అధికం. ఇలాంటి వారికి పక్షవాతం వచ్చే అవకాశం 25 శాతం ఎక్కువగా ఉంటుంది. డయాబెటిస్, ఆందోళన, గుండె జబ్బులు ఎటాక్ చేసే ఛాన్స్ ఉంది.
ఏ జాగ్రత్తలు తీసుకోవాలి..
ఈ సమస్యలు దరిచేరకుండా ఉండాలంటే.. భోజనం తీసుకునే సమయం నిద్రించే సమయానికి మధ్య 3 గంటల గ్యాప్ ఉండేలా చూసుకోవాలి. దీని వల్ల జీర్ణప్రక్రియ మందగించకుండా ఉంటుంది. తద్వారా అజీర్తి, గుండెలో మంట, నిద్రలేమి సమస్యలను నివారించవచ్చు. రాత్రి 7.30 నుంచి 8 గంటలలోపు భోజనం తినేసి.. 10 గంటల్లోగా పడుకుంటే ఆరోగ్యం. రాత్రి సరైన నిద్ర శరీరానికి అందితే పగటి పూట నిద్ర రాదు. పగటి నిద్ర తగ్గించుకుంటే మంచిది. చిన్న పవర్ న్యాప్ ఫర్లేదు.. కానీ గాఢ నిద్రలోకి జారుకోవద్దు సుమా!.
READ LATEST TELUGU NEWS: లక్షద్వీప్‌లకు ఈజీగా వెళ్లి రావొచ్చు!