Thursday, October 17, 2024
HomeతెలుగుజాతీయంUnderwater Metro : అండర్‌వాటర్ మెట్రో ప్రారంభం.. విద్యార్థులతో మోడీ ప్రయాణం

Underwater Metro : అండర్‌వాటర్ మెట్రో ప్రారంభం.. విద్యార్థులతో మోడీ ప్రయాణం

భారతదేశంలో తొలి అండర్ వాటర్ మెట్రో టన్నెల్‌(Underwater Metro)ను ప్రధాని నరేంద్ర మోడీ బుధవారం ప్రారంభించారు. పశ్చిమబెంగాల్ రాజధాని కోల్‌కతాలో నిర్మించిన ఈ మార్గంలో విద్యార్థులతో కలిసి ప్రధాని ప్రయాణించారు.

దేశంలో మొట్టమొదటి మెట్రో సేవలు 1984లో ప్రారంభమైంది కోల్‌కతా మహానగరంలోనే. ఆ ప్రాంతమే మళ్లీ మరో అద్భుతానికి వేదికైంది. తాజాగా నీటి అడుగున మెట్రోరైలును పరుగులు పెట్టించి సరికొత్త రికార్డును సృష్టించింది. ఈ మెట్రో రూట్‌ను ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడీ (PM Narendra Modi) ఎస్‌ప్లనేడ్ నుంచి హావ్‌డా మైదాన్ స్టేషన్ వరకు స్టూడెంట్స్‌తో కలిసి ప్రయాణం చేశారు.

హుగ్లీ నది దిగువన దాదాపు రూ. 120 కోట్ల వ్యయంతో కోల్‌కతా ఈస్ట్-వెస్ట్ మెట్రో పరిధిలో ఈ సొరంగ రైలు మార్గాన్ని నిర్మించారు. ఇది కోల్‌కతాలోని రెండు జంటనగరాలైన సాల్ట్ లేక్, హౌరాలను కలుపుతోంది. ఈ రూట్ మొత్తం 16.6 కిలోమీటర్లు ఉంటుంది. ఇందులో 10.8 కిలోమీటర్లు భూగర్భంలో మెట్రో రైలు దూసుకెళ్తుంది. ఎస్‌ప్లనేడ్ నుంచి హావ్‌డా మైదాన్ స్టేషన్‌ల మధ్యన గల 4.8 కిలోమీటర్ల లైనులో 520 మీటర్ల పొడవైన అండర్ వాటర్ మెట్రో టన్నెల్ రూపొందించారు. 45 సెకన్లపాటు నది నీటి గుండా ఈ మెట్రో రైలులో ప్రయాణించవచ్చు. ఇది కోల్‌కతా నగరవాసులకు సరికొత్త అనుభూతిని అందించనుంది.

ఇక దేశంలోనే ఒక నది కింది నిర్మించిన అతిపెద్ద టన్నెల్‌గా ఈ మార్గం చరిత్ర సృష్టించింది. భారత్‌లో అత్యంత లోతులో నిర్మించిన మెట్రో స్టేషన్‌గా ఈ మార్గంలో నిర్మించిన హౌరా మెట్రో స్టేషన్‌ రికార్డు క్రియేట్ చేసింది.

2009 ఫిబ్రవరిలోనే ఈ ఈస్ట్-వెస్ట్ మెట్రో కారిడార్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. నీటి అడుగున మెట్రో మార్గానికి 2017లోనే పనులు మొదలెట్టారు. ప్రముఖ బ్రిటన్‌ కంపెనీల సహకారంతో ఎలాంటి ప్రకృతి విపత్తులైనా తట్టుకునేలా ఈ మెట్రో మార్గాన్ని నిర్మించారు. కాగా.. సీల్దా నుంచి హావ్‌డాకు రోడ్డు మార్గంలో వెళ్లాలంటే గరిష్ఠంగా 1 గంట 30 నిమిషాలు పడుతోంది. ఈ అండర్ వాటర్ మెట్రో మార్గం అందుబాటలోకి రావడంతో కేవలం 40 నిమిషాలే పట్టే అవకాశముంది.

ఈ సందర్భంగా అండర్ వాటర్ మెట్రో టన్నెల్‌లో ప్రయాణించిన ప్రధాని మోడీ.. మెట్రో స్టాఫ్‌తో కలిసి మాట్లాడారు. వాళ్ల సేవలను అభినందించారు. ప్రధాని మోడీ వెంట పశ్చిమ బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు సుకాంత మజుందార్, ఎమ్మెల్యే సువేందు అధికారి ఉన్నారు. అండర్ వాటర్ మెట్రో ట్రైన్ విశేషాలను అధికారులు ప్రధానికి వివరించారు. ఈ రూట్‌లో రోజుకు దాదాపు 7 లక్షల మంది మెట్రోలో ప్రయాణం చేస్తారని అంచనా వేస్తున్నారు. గురువారం నుంచి అండర్ వాటర్ టన్నెల్‌కు ప్రయాణికులను అనుమతిస్తామని కోల్‌కతా మెట్రో సీపీఆర్వో కౌశిక్ మిత్రా ప్రకటించారు.

ఆయనను చూసేందుకు తరలివచ్చిన ప్రజలకు అభివాదం చేస్తూ ప్రధాని మోడీ వారిని ఉత్సాహపరిచారు. మోడీ మెట్రో స్టేషన్‌కు వస్తున్నారని తెలియడంతో ఆ ప్రాంతమంతా జనాలతో కిక్కిరిసిపోయింది. ప్రధానిని చూడగానే అభిమానులు మోడీ.. మోడీ అని అరుస్తూ.. జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేశారు.

READ LATEST TELUGU NEWS : సీఎం జగన్‌కు భారీ ఓటమి.. ప్రశాంత్ కిషోర్ హాట్ కామెంట్స్

RELATED NEWS
- Advertisment -spot_img

LATEST NEWS