Maha Shivratri 2024: విశ్వాన్ని నడిపించే ఆ పరమేశ్వరుడు శివలింగంగా ఆవిర్భవించిన రోజే మహాశివరాత్రి. పార్వతి దేవీని శంకరుడు వివాహామాడింది కూడా ఈ పవిత్రమైన రోజునే. క్షీరసాగర మథనంలో జనించిన గరళాన్ని విశ్వరక్షణ కోసం తన కంఠలో దాచుకుని.. గరళకంఠుడిగా మారింది కూడా ఈ పర్వదినానే అందుకే శివరాత్రి హిందువులకు ప్రత్యేకం.
శివరాత్రి ఎప్పుడు చేసుకోవాలి?
పురాణాల ప్రకారం ఇలాంటి మహాపవిత్రమైన మహాశివరాత్రిని మాఘ మాసం బహుళ చతుర్దశినాడు జరుపుకుంటారు. క్యాలెండర్ ప్రకారం 2024లో మార్చి 8న మహాశివరాత్రి వచ్చింది. ఆరోజు రాత్రి 8.13 గంటల వరకు త్రయోదశి ఉంటుంది. ఆ తర్వాత నుంచి చతుర్దశి మొదలై మార్చి 9న సాయంత్రం 6.17 గంటలకు ముగుస్తుంది. శివరాత్రి రోజున లింగోద్భవ సమయానికి చతుర్దశి ఘడియలు సమీపించడం ప్రధాన ఘట్టం. అందుకే మహాశివరాత్రిని మార్చి 8న జరుపుకోవాలని పండితులు స్పష్టం చేశారు.
హిందువులు జరుపుకునే పండుగల్లో శివరాత్రి ప్రధానమైంది. శివుడిని నిష్టగా పూజిస్తే పాపాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. అందుకే ఉపవాస దీక్ష చేస్తారు. రాత్రంతా జాగారం చేస్తూ ఆ పరమశివుడిని ధ్యానిస్తారు. మరి ఈ క్రమంలో మహాశివరాత్రి నాడు చేయాల్సినవి.. చేయకూడనివి కొన్ని నియమాలు ఉంటాయి. అవేంటంటే..
ఏం చేయాలంటే..
సూర్యోదయానికి 2 గంటల ముందే అంటే బ్రహ్మ ముహుర్తంలో నిద్రలేవాలి. ధ్యానం చేయాలి. అనంతరం తలస్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించాలి. కుదిరితే తెలుపు రంగు వస్త్రాలు వేసుకోండి. ఉపవాసం చేయాలనుకునేవారు నిర్ణయం తీసుకుని పూజకు ఉపక్రమించాలి.
శివలింగానికి పచ్చిపాలు, నెయ్యి, పెరుగు, తేనే వీటిలో దేనితోనైనా అభిషేకం చేయాలి. చివరగా నీటితో తప్పకుండా అభిషేకం చేస్తేనే సంపూర్ణ ఫలితం. అయితే అభిషేకాలకు శంఖాన్ని వాడకూడదు. బిల్వపత్రాలు, దతుర పువ్వులు, పండ్లు, చందనం శంకరుడికి సమర్పించాలి. ఇలా చేస్తూ రాత్రి జాగరణ సమయంలో రుద్రాక్ష మాల, విభూతి ధారణతో శివనామస్మరణ చేయాలి.
ఇవి అస్సలు చేయకూడదు..
నూనె, ఉప్పు, బార్లీ, మినుములు, మొక్కజొన్న, వేరుశనగ, శనగ, రాజ్మా, పెసలు, గోధుమలు, బియ్యం, పప్పు ధాన్యాలు, సుగంధ ద్రవ్యాల వంటి ఆహారపదార్థాలకు దూరముండండి. మాంసం, ఉల్లి, వెల్లుల్లిని తినకూడదు. మందు, పొగాకు సేవించకూడదు. శివలింగానికి కొబ్బరి నీళ్లను అర్పించకూడదు. కేతకి పువ్వుల దరిచేరకూడదు. తులసి ఆకులు, కుంకుమ పరమేశ్వరుడికి సమర్పించకండి. గోగుపూలతో సేవచేయడం మంచిది. నలుపు రంగు దుస్తులు ధరించకండి. పూజకు స్టీల్ పాత్రలు వాడకండి. వెండి, ఇత్తడి, రాగి గిన్నెలకు ప్రాధాన్యత ఇవ్వండి. లింగం చుట్టూ ప్రదక్షిణలు కూడా పూర్తిగా చేయకండి.
ఉపవాసం ఎందుకు చేస్తారు?
శివరాత్రి (Shivaratri) పర్వదినాన ఉపవాస దీక్ష చేయడం ఓ ఆరోగ్య రహస్యం కూడా ఉంది. మాఘమాసం వరకు మన జీర్ణక్రియ వ్యవస్థ మందగించి ఉంటుంది. శీతకాలం, వేసవి కలిసే సమయంలో వచ్చే శివరాత్రి నాడు ఉపవాసం చేస్తే ఆరోగ్యానికి మంచిది. వాతావరణంలో జరిగే మార్పులకు అనుగుణంగా శరీరం సిద్ధమవుతుందని నిపుణుల మాట.
ఈ జాగ్రత్తలు అవసరం
మహాశివరాత్రి నాడు ఉపవాసం ఉండే భక్తులు చాలా నిష్ఠతో ఉండాలి. రాత్రి నక్షత్ర దర్శనం తర్వాతే ఉపవాసం విరమించుకోవాలి. ఉపవాసం తర్వాత కూడా సాత్విక ఆహారం తీసుకోవాలి. ఉపవాస సమయంలో ప్రశాంతంగా ఉండాలి. ఎవరితోనూ గొడవలు పెట్టుకోకూడదు. బూతులు మాట్లాడకూడదు. ఓ నమః శివాయ అనే మంత్రాన్ని మనసులో జపిస్తూ ఉండాలి. శివపంచాక్షరిని తల్చుకుంటూ మదిలో శివుని నిలుపుకుంటే ఆ బోళాశంకరుడి అనుగ్రహం లభిస్తుంది.
READ LATEST TELUGU NEWS : అయోధ్య రాముడి విగ్రహం వెనక కన్నీటి గాథ