Monday, December 23, 2024
HomeWomen's Day : ఆమె ఓ సూపర్ ఉమెన్.. అలా దూసుకెళ్లనివ్వండి

Women’s Day : ఆమె ఓ సూపర్ ఉమెన్.. అలా దూసుకెళ్లనివ్వండి

International Women’s Day :

వినాస్త్రీయ జననం నాస్తి..
వినాస్త్రీయ గమనం నాస్తి..
వినాస్త్రీయ జీవం నాస్తి..
వినాస్త్రీయ సృష్టియే నవ నాస్తి..

స్త్రీ లేకపోతే జననం లేదు..
స్త్రీ లేకపోతే గమనం లేదు..
స్త్రీ లేకపోతే సృష్టిలో జీవం లేదు..
స్త్రీ లేకపోతే అసలు సృష్టే లేదు.. అంటూ స్త్రీలకు ఉన్నత స్థానమిచ్చింది మన సమాజం. ప్రేమతో నడిచే ఈ ప్రపంచంలో ఆ మమకారానికి ప్రతిబింబంగా నిలబడే వ్యక్తి స్త్రీ. రెండు చేతులతో సృష్టిని నడిపించే మహాశక్తి మహిళ. సమస్యల ఒడిదుడుకుల్లో శాంత మూర్తి.. బాధ్యతల సుడిగుండంలో సహస్ర హస్త చక్రధారి. తల్లిగా, చెల్లిగా, భార్యగా, స్నేహితురాలిగా ప్రతిరోజూ ఎన్నో పాత్రలు పోషిస్తూ కుటుంబాన్ని చక్కదిద్దే దిక్సూచి. అలాంటి మహిళా శక్తిని చాటిచెప్పుకునే క్రమంలో ప్రతిఏటా మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం (International Women’s Day) జరుపుకుంటారు.

మార్చి 8నే ఎందుకు?

1908లో న్యూయార్క్ నగర వీధులు మహిళా కార్మికులతో నిండిపోయాయి. వేలాది మంది స్త్రీలు తమ హక్కుల సాధన కోసం రోడ్డెక్కారు. మహిళా హక్కుల ఉద్యమనేత క్లారా జెట్కిన్ సారథ్యంలో వీరోచితంగా పోరాడారు.

మహిళలకు ఓటు హక్కు కల్పించడం, ఎక్కువ పని గంటలు, తక్కువ వేతనాలు, పనివేళల్లో కఠిన పరిస్థితులకు వ్యతిరేకంగా నినదిస్తూ వనితలు నిరసన గళమెత్తారు. ఈ పోరాటానికి గుర్తుగా 1909 ఫిబ్రవరి 28న అమెరికాలో తొలిసారి మహిళా దినోత్సవాన్ని నిర్వహించారు. సోషలిస్టు పార్టీ ఆఫ్ అమెరికా ఈ ప్రకటన చేసింది.

మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో 1917 ప్రాంతంలో రష్యా మహిళలు శాంతి పోరాటం చేశారు. వారి ఒత్తిడితో రష్యా చక్రవర్తి నికోలస్ తన పదవికి రాజీనామా చేశాడు. ఈ పోరాట ఫలితంగా స్త్రీలకు ఓటుహక్కు లభించింది. ఈ క్రమంలో శాంతి ఉద్యమ మహిళా కార్యకర్తలకు మద్దతుగా యూరోప్ వనితలు సైతం మార్చి 8న ర్యాలీలు తీశారు. ఈ పోరాటాలను దృష్టిలో ఉంచుకుని 1975లో ఐక్యరాజ్య సమితి మార్చి 8వ తేదీని అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా ప్రకటించింది.

2024 థీమ్ ఏంటి?

సమాజంలో మహిళల పాత్ర, లింగ సమానత్వం, స్త్రీలపై వేధింపులు, మహిళలకు సమాన హక్కులు (women empowerment) వంటి అంశాలపై అవగాహన కల్పించడమే అంతర్జాతీయ మహిళ దినోత్సవం ముఖ్య ఉద్దేశం. ప్రతి ఏడాదీ ఈ వేడుకను ఓ ప్రత్యేక థీమ్‌తో నిర్వహించుకుంటారు. అయితే ఈ సంవత్సరం ‘ ఇన్‌స్పైర్ ఇన్‌క్లూజన్ ‘ అనే థీమ్‌తో మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు.

పలు రంగాల్లో స్త్రీల ప్రాతినిధ్యం

కాలానుగుణంగా మారుతున్న పరిస్థితులు.. అరచేతిలో అవకాశాలను అందిపుచ్చుకునే నైపుణ్యాలు ఈ ఆధునిక సమాజం సొంతం. ఈ క్రమంలో ఆఫీసులు, వ్యాపారాలు, రాజకీయం, ఆరోగ్య వంటి రంగాల్లో గతకొన్నేళ్లుగా మహిళల ప్రాతినిధ్యం పెరుగుతూ వస్తోంది.

– కార్మిక శక్తి సర్వే ప్రకారం 2017-18లో 23.3 %గా ఉన్న మహిళా శ్రామిక శక్తి భాగస్వామ్య రేటు 2020-21లో 32.5%కి పెరిగింది.

– సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథ్స్ (STEM) కోర్సుల ప్రవేశాల్లో మహిళలు మగవారిని మించిపోయారు. 2020-21 విద్యాసంవత్సరంలో 29 లక్షల మంది అమ్మాయిలు ఈ చదువులకు అప్లై చేసుకున్నారు. ఇది అబ్బాయిల సంఖ్య కంటే ఎక్కువ.

– లోక్‌సభలో 1999లో మహిళా నేతల సంఖ్య 49. వారు 2019 ఏడాది వరకు 78 అయ్యారు. రాజ్యసభలోనూ అంతే. 2012 నుంచి 2021 సంవత్సరాల్లో వారి ప్రాతినిధ్యం 9.8% నుంచి 12.4 %కి చేరుకుంది.

– జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే లెక్కల ప్రకారం దాదాపు 18% మహిళలు తక్కువ బాడీ మాస్ ఇండెక్స్ ( BMI )తో ఉన్నారు. 2015-16లో ఇది 22.9%గా ఉంది. పురుషులతో పోలీస్తే మహిళల్లో ఊబకాయం ఎక్కువగా ఉంది. భారత్‌లో 24% మంది అధిక బరువుతో ఇబ్బందిపడుతున్నారు.

– పోషకాహారలోపం, రక్తహీనత సమస్యలు మహిళలను తీవ్రంగా వేధిస్తున్నాయి. గర్భిణిలు ఐరన్ లోపంతో సతమతమవుతున్నారు. 15 నుంచి 49 ఏళ్ల వయసువారిలో 57.2% మంది రక్తహీనతతో బాధపడుతున్నారు.

ఏదీ ఏమైనప్పటికీ ఏ సమాజమైతే మహిళకు ఉన్నత స్థానం కల్పిస్తుందో.. ఆ సమాజం అభివృద్ధి పథంలో దూసుకెళ్తుందన్నది కాదనలేని వాస్తవం. అలాంటి వాతావరణం అన్ని రంగాల్లో కల్పించాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. పురుషునికన్నా గొప్పగా పనిచేస్తున్నా.. వారిపై ఇంకా చులకన భావం ఎందుకు? ఆమెను ఓ మనిషిగా చూసే కోణం పెంచుకోవాలి. స్త్రీ రూపాన్ని కాకుండా.. ఆమె వ్యక్తిత్వ స్వరూపాన్ని గౌరవించే దిశగా పయనం సాగాలి. నవభారత నిర్మాణంలో స్త్రీ ఔన్నత్యాన్ని తెలిపే అంశాలపై పాఠశాల దశనుంచే చైతన్యం పెంచాలి. స్త్రీల మీద జరిగే దాడుల్లో సత్వర న్యాయం జరిగేలా చర్యలు చేపట్టాలి. మహిళకు సమున్నత ప్రాతినిధ్యం ఇచ్చే పరిస్థితులు ఇంకా మారాలి.. ఇలాంటి బాటలో ప్రయాణిస్తూ.. మహిళలను గౌరవిస్తూ వారి ఆలోచనలకు ఆశయాలకు అవకాశాలను అందిస్తూ ముందుకు వెళితే ఇలాంటి మహిళా దినోత్సవాల లక్ష్యం నెరవేరుతున్నట్లే. అలాంటి అవకాశాలు అందిపుచ్చుకుంటూ భువి నుంచి దివికి దూసుకెళుతున్న ఆమె ఎప్పటికీ ఓ సూపర్ ఉమెనే.. ఆమెను అలా దూసుకెళ్లనివ్వండి.

READ LATEST TELUGU NEWS : ఊబకాయం ఎందుకు వస్తుందో తెలుసా.. ఇదీ ఓ కారణమే

RELATED NEWS
- Advertisment -spot_img

LATEST NEWS