అధికార వైఎస్సార్‌సీపీపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్. షర్మిల(YS Sharmila) మరోసారి విమర్శల దాడికి దిగారు. ఏకంగా రూ.600 కోట్లతో ‘సిద్ధం’ సభలను నిర్వహిస్తున్నారని ఆమె ఆరోపించారు. ఒక్కో ‘సిద్ధం’ సభకు రూ.90 కోట్లు వైసీపీ వెచ్చిస్తోందని షర్మిల అన్నారు. ‘సిద్ధం’ సభల పేరిట ప్రభుత్వ ఆదాయాన్ని వైసీపీ దోచుకుంటోందని మండిపడ్డారు.
సిద్ధం సభలకోసం వినియోగిస్తున్న ధనం ఎవరి సొమ్ము అని వైఎస్. షర్మిల ప్రశ్నించారు. విజయవాడలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గల ‘ఆంధ్రరత్నా భవన్’లో ఆమె మీడియాతో మాట్లాడారు. ఇక తాను ఏ నియోజకవర్గంలో పోటీ చేయాలనేదానిపై పార్టీలో అంతర్గతంగా చర్చ జరిగిందని షర్మిల చెప్పారు. అన్ని అంశాలను పరిశీలిస్తున్నామని ఆమె వెల్లడించారు.
కేంద్రంలో పదేళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ ఇచ్చిన హామీ ప్రకారం ఇప్పటివరకు 20 కోట్ల ఉద్యోగాలు రావాలని వైఎస్. షర్మిల ప్రస్తావించారు. ఉద్యోగాల భర్తీ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఆమె ధ్వజమెత్తారు. గత ఎన్నికల ప్రచారంలో 2.30లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని జగన్ హామీ ఇచ్చారని, ఆ వాగ్దానం ఏమైందని షర్మిల(YS Sharmila) ప్రశ్నించారు.
మరోవైపు ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ, రాజకీయ పార్టీలు ఓటర్లను ఆకట్టుకోవడానికి వివిధ రకాల యత్నాలు చేస్తున్నాయి. తాజాగా, విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో వైఎస్‌ఆర్సీపీ తన వాలంటీర్లకు స్మార్ట్‌వాచ్‌లను పంపిణీ చేసినట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి.
మొత్తం 22 డివిజన్లలో ఉన్న వెయ్యి మందికి పైగా వాలంటీర్లకు ఒక్కొక్కరికి రూ.2వేల విలువచేసే స్మార్ట్‌వాచ్‌లు అందజేసినట్టు తెలుస్తోంది. వీటన్నింటి విలువ రూ.20లక్షలకు పైగా ఉంటుందని అంచనా. వార్డు సచివాలయాల పరిధిలోని సమస్యలపై చర్చించడం కోసం ఈ సమావేశాలు ఏర్పాటు చేసినట్లు చెబుతున్నప్పటికీ, షేక్ ఆసీఫ్‌ను గెలిపించేందుకు వాలంటీర్లు కృషి చేయాలని వారికి సూచించినట్లు లోగుట్టు.
ప్రభుత్వ ఖజానా నుంచి గౌరవ వేతనం, పారితోషికాలు తీసుకుంటున్న వాలంటీర్లు ఒక రాజకీయ పార్టీ తరఫున ప్రచారం నిర్వహించడం చట్ట విరుద్ధమని ఓవైపు ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. తమ విధుల్లో భాగంగా ఓటర్లను ప్రభావితం చేయగలిగే అవకాశమున్న గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులు, రిసోర్స్‌పర్సన్‌లు, యానిమేటర్లకు సైతం కానుకలు పంపిణీ చేస్తున్నట్లు సమాచారం.
ఈ పరిణామాలపై ఎన్నికల సంఘం స్పందన ఎలా ఉంటుందో వేచిచూడాలి. అధికారులు సత్వరమే చర్యలు తీసుకుని రాజకీయ పార్టీల ఓటు వేట యత్నాలను అడ్డుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
READ LATEST TELUGU NEWS: పొత్తుతో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు లాభమా… నష్టమా ?