వాళ్లంతా దేశం కోసం పోరాడిన సైనికులు. భారతదేశ సేవలో 17 నుంచి 20 ఏళ్లు సర్వీసు చేసి పదవీవిరమణ పొందిన జవాన్లు. అలాంటి మాజీ సైనికుల(EX Army)కు ఉద్యోగాల అంశంలో తెలంగాణ రాష్ట్రంలో తీవ్ర అన్యాయం జరుగుతోందని వారంతా రోడ్డెక్కారు.
మాజీ సైనికులకు గ్రూప్-4 ఉద్యోగాల విషయంలో మరణ శాసనంగా మారిన జీవో నంబర్ 55ను వెంటనే సవరించాలని వారు తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం ఇందిరాపార్కు వద్ద ధర్నాచౌక్‌లో టీఎస్‌పీఎస్సీ(TSPSC) విధానాలకు వ్యతిరేకంగా మాజీ సైనికులు ధర్నా చేపట్టారు.
ఈ నిరసన కార్యక్రమంలో జీవో నంబర్ 317, 46 బాధితులలాగా జీవో నంబర్ 55 బాధితులను కూడా చర్చలకు ఆహ్వానించాలని మాజీ సైనికులు(EX Army) ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
2022 ఏప్రిల్‌లో తెచ్చిన జీవో నంబర్ 55 వల్ల టీఎస్‌పీఎస్సీ(TSPSC) గ్రూప్-4 ఉద్యోగాల్లో క్వాలిఫై మార్కులు 30 శాతం నుంచి 40 శాతానికి పెంచారని ఆవేదన వ్యక్తం చేశారు. దాదాపు 20 ఏళ్లు దేశసేవకు జీవితాన్ని అంకితం చేసిన తమకు ఇలాంటి అన్యాయం జరుగడం సమంజసమేనా అని మాజీ సైనికులు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రోస్టర్ పాయింట్ 13, 37 ప్రకారం తెలంగాణ రాష్ట్ర గ్రూప్- సీ, డీ పోస్టుల్లో మాజీ సైనికులకు 2 శాతం రిజర్వేషన్ మాత్రమే ఉందని వెల్లడించారు. కానీ కర్ణాటక, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్‌లలో 10-12 శాతం రిజర్వేషన్ అమలులో ఉందని పేర్కొన్నారు.
పోలీసు నియమాకాలతో సహా తెలంగాణ ప్రభుత్వం నిర్వహించే అన్ని ఉద్యోగ భర్తీల్లో ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ కేటగిరీలతో సమానంగా మాజీ సైనికుల(EX Army)కు అర్హత మార్కులుండేవన్నారు. గతంలో ఉన్నమాదిరే 30శాతం క్వాలిఫైయింగ్ మార్కుల విధానాన్ని తీసుకురావాలని వారు డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో మాజీ సైనికులు సురేందర్ రెడ్డి, రవికుమార్, శుషు కుమార్, మల్లారెడ్డి, నరేందర్, ఆంజనేయులు, వేణుగోపాల్ రెడ్డి, బి. సంజీవ్ కుమార్, సుజిత్, నిరంజన్ రెడ్డిలు పాల్గొన్నారు. వెంటనే ప్రభుత్వం జీవో నంబర్ 55పై ప్రకటన చేయాలని కోరారు.
READ LATEST TELUGU NEWS : 11వేల పోస్టులతో మెగా డీఎస్సీ నోటిఫికేషన్