దేశంలో సార్వత్రిక ఎన్నికల సమరానికి తెరలేవడంతో ప్రధాని నరేంద్ర మోడీ దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో సుడిగాలి పర్యటన(Modi National Campaign)లు, రోడ్ షోలు, బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు.
ఈ క్రమంలోనే బీజేపీ తరఫున అన్నీ తానై దేశవ్యాప్తంగా ఎన్నికల ప్రచారాన్ని భుజాలపైన వేసుకున్నారు. అయితే తాజాగా ప్రధాని మోడీపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు అందింది. ఎన్నికల ప్రచారానికి ప్రభుత్వాన్ని వినియోగించుకున్నారన్న ఆరోపణలతో తృణముల్ కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ సాకేత్ గోఖలే తాజాగా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు.
అంతే కాకుండా ఈ సందర్భంగా గతంలో 1975 లో ఇందిరాగాంధీని ఎన్నికల్లో పోటీ చేయకుండా కోర్టు అనర్హులుగా ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. ఇంతకీ ఏం జరిగిందంటే?
ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం.. ఆంధ్రప్రదేశ్‌లో (Modi National Campaign)పర్యటించారు. ఈ సందర్భంగానే బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో నిర్వహించిన ప్రజాగళం సభలో పాల్గొని ప్రసంగించారు.
అయితే ఈ సభకు బీజేపీ తరఫున హాజరయ్యేందుకు ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన హెలికాప్టర్ జెడ్‌పీ 5236లో మోడీ సభాస్థలికి చేరుకున్నారని సాకేత్ గోఖలే ఈసీకి సోమవారం చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు.
బీజేపీ ఎన్నికల ప్రచారానికి ప్రధాని మోడీ భారత వైమానిక దళానికి చెందిన హెలికాప్టర్‌ను ఉపయోగించి.. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌ను ఉల్లంఘించారని సాకేత్ గోఖలే వెల్లడించారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్‌కు సాకేత్ గోఖలే లేఖ రాశారు.
ఎన్నికల కమిషన్ నియమాలను ఉల్లంఘించి ప్రభుత్వ వాహనాలను పార్టీల ఎన్నికల ప్రచారానికి ఉపయోగించారని సాకేత్ గోఖలే తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ క్రమంలోనే ట్విటర్‌లో ఒక పోస్ట్ పెట్టారు.
ప్రభుత్వ యంత్రాంగాన్ని ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి.. ఎన్నికల ప్రచారానికి ఉపయోగించి 1975 లో ఇందిరాగాంధీ అనర్హతకు గురైన విషయాన్ని సాకేత్ గోఖలే గుర్తు చేశారు. 1975 లో అప్పటి ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలోని రాయ్‌బరేలీ జిల్లా కలెక్టర్ యశ్‌పాల్ కపూర్‌ను.. అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ఎన్నికల ప్రచారానికి వాడుకున్నారని అలహాబాద్ హైకోర్టు తేల్చింది. ఎన్నికల సంఘం నియమాలను ఇందిరాంధీ ఉల్లంఘించారని.. దీంతో ఆమెను 6 ఏళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం విధించింది.
ఒకవేళ హెలికాప్టర్‌ను ఉపయోగించుకునేందుకు బీజేపీ డబ్బులు చెల్లించినప్పటికీ.. వైమానిక దళానికి చెందిన హెలికాప్టర్‌ను ఉపయోగించడం ఏ ప్రాతిపదికన అవసరమో స్పష్టం చేయాలని ఈసీని గోఖలే ప్రశ్నించారు.
ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలపై కఠినంగా వ్యవహరిస్తామని ఎన్నికల ప్రకటన సందర్భంగా ఈసీ పేర్కొందని.. ఎన్నికల ప్రచారానికి ఐఏఎఫ్ హెలికాప్టర్‌ను ఉపయోగించినందుకు ప్రధాని మోడీపై ఈసీ విచారణ చేపడుతుందో లేక ఏదైనా చర్య తీసుకుంటుందో చూద్దామని సాకేత్ గోఖలే పేర్కొన్నారు.
ఈ క్రమంలోనే ఎన్నికల సమయంలో.. ప్రచారానికి అధికారిక వాహనాల వినియోగంపై పూర్తిగా నిషేధం ఉంటుందని ఎన్నికల సంఘం మార్గదర్శకాలు చెబుతున్నాయని గోఖలే తన లేఖలో ప్రస్తావించారు. ఈ నేపథ్యంలోనే ఎన్నికల సభ (Modi National Campaign) కోసం ప్రధాని.. ఎయిర్‌ఫోర్స్ హెలికాప్టర్‌ను ఉపయోగించడం అనేది ఈసీ మార్గదర్శకాలను ఉల్లంఘించడమేనని తెలిపారు.