Friday, December 20, 2024
Homenewsభయపడుతున్నారా.. సార్!?.. సీఎం జగన్‌పై ఏపీ పీసీసీ చీఫ్ వైయస్. షర్మిల ఫైర్

భయపడుతున్నారా.. సార్!?.. సీఎం జగన్‌పై ఏపీ పీసీసీ చీఫ్ వైయస్. షర్మిల ఫైర్

ఏపీ పీసీసీ చీఫ్‌గా వైయస్. షర్మిల.. వైసీపీ ప్రభుత్వంపై ఫుల్ ఫైర్

ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. గతంలో జగనన్న వదిలిన బాణంగా జనాల్లోకి దూసుకొచ్చిన వైయస్ షర్మిల.. అన్న వైయస్. జగన్ ఓదార్పు యాత్రకు కొండంత బలంగా నిలిచారు. ఆ సమయంలో జైలులో ఉన్న వైయస్. జగన్.. నేడు ఏపీకి సీఎం అయ్యారు. అప్పుడు కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పోరాడిన వైయస్. షర్మిల ఇప్పుడు అదే కాంగ్రెస్ పార్టీ నుంచి పీసీసీ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించి.. సీఎం జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజల్లోకి వెళ్తున్నారు.

ఈరోజు వైయస్ షర్మిల ఏపీ పీసీసీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టారు. ఈ క్రమంలో విజయవాడలో షర్మిలా కాన్వాయ్‌ను ఏపీ పోలీసులు అడ్డుకున్నారు. దీంతో బెజవాడలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఎనికేపాడు వద్ద షర్మిల కాన్వాయ్‌ను పోలీసులు దారి మళ్లించడంతో కాంగ్రెస్ నేతలు రోడ్డు మీద బైఠాయించి నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వాన్ని ఉద్దేశించి వైయస్. షర్మిల సంచలన వ్యాఖ్యలు చేయడం చర్చానీయాంశమైంది. ప్రభుత్వం .. కాంగ్రెస్ పార్టీని చూసి భయపడుతోందని అందుకే తన కాన్వాయ్‌ను అడ్డుకున్నారని ఆమె ఆరోపించారు. భయపడుతున్నారా.. సార్!!? అంటూ షర్మిల ప్రశ్నించిన తీరు వైరల్ అవుతోంది.

అటు బాధ్యతల స్వీకరణ అనంతరం టీడీపీ, వైసీపీల పనితీరుపై ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల విరుచుకుపడ్డారు. పదేళ్లలో మాజీ సీఎం చంద్రబాబు, సీఎం జగన్ ఏపీని అప్పుల ఊబిలో ముంచేశారని విమర్శించారు. అమరావతి పేరుతో చంద్రబాబు గ్రాఫిక్స్ చూపించారని ఎద్దేవా చేశారు. మూడు రాజధానుల మాటేమోగానీ.. అసలు ఒక్క రాజధాని కట్టడానికి కూడా ఏపీ ప్రభుత్వ ఖజానాలో నిధులు లేవని ఆరోపించారు. టీడీపీ, వైసీపీ రెండూ పార్టీలు దొందు దొందేనని.. వాటికి బీజేపీతో దోస్తీ ఎందుకని ప్రశ్నించారు. బీజేపీ మత విద్వేషాల మంటలో చలికాచుకునే పార్టీ అని తీవ్ర ఆరోపణలు చేశారు. సీఎం జగన్ రూ.3 కోట్ల అప్పులు చేశారని.. ప్రత్యేక హోదా తీసుకురావడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఆరోపించారు. ప్రజల ఆశయాలు నెరవేరాలంటే వైయస్సార్ బిడ్డతో చేతులు కలపాలని ఈ సందర్భంగా కోరారు. ఇక ఏపీలో కాంగ్రెస్‌కు పూర్వవైభవం తీసుకొస్తానని వైయస్. షర్మిల ధీమా వ్యక్తం చేశారు.

RELATED NEWS
- Advertisment -spot_img

LATEST NEWS