Daggubati Purandeswari : ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల వేడి రాజుకుంటోంది. ఈ నేపథ్యంలో పార్టీలు క్యాడర్ బలోపేతానికి మరింత కృషి చేస్తున్నాయి. ఓవైపు టీడీపీ, జనసేన, వైసీపీ టిక్కెట్ల లొల్లిలో మునిగిపోతుంటే రాష్ట్రంలో బీజేపీ పరిస్థితి మరోలా మారుతోంది. అందుకు కారణం ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి వైఖరేనని గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరిని ఆ పదవి నుంచి తొలగించనున్నట్లు సమాచారం. ఇందుకోసం ఇప్పటికే రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఆమె తెలుగుదేశం పార్టీపై ప్రేమ వలకబొయ్యడమే అందుకు ప్రధానకారణమని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
దివగంత ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారకరామ రావు కూతురైన పురందేశ్వరి కాంగ్రెస్‌లో చేరి రెండుసార్లు ఎంపీగా సేవలందించారు. మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న సమయంలో యూపీఏ ప్రభుత్వంలో మంత్రిగా కూడా ఆమె పనిచేశారు. అయితే కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్‌లో ఓడిపోవడంతో రాజకీయ భవిష్యత్తు కోసం పురందేశ్వరి బీజేపీలో చేరారు.
ఏపీలో బీజేపీ క్యాడర్ పెంచుతూ ప్రజల్లో పార్టీపై భరోసా కల్పిస్తారనే ఉద్దేశంపై అధిష్ఠానం పురందేశ్వరికి రాష్ట్ర అధ్యక్షురాలు హోదా కట్టబెట్టింది. అయితే ఆమె ఆ కుర్చీలో కూర్చున్నప్పటి నుంచి బీజేపీ, టీడీపీల మధ్య సాన్నిహిత్యం పెంచడానికే కృషి చేస్తున్నరని వాదనలు వినిపిస్తున్నాయి. తండ్రి పెట్టిన పార్టీ.. బావ నారా చంద్రబాబు నడిపిస్తున్న టీడీపీ ఎదుగుదలకు ఆమె పాటుపడుతోందని ఆరోపణలొస్తున్నాయి.
తాజాగా జరిగిన సంఘటనలు ఈ రూమర్లకు బలం చేకూరేలా ఉన్నాయి. బీజేపీని బలోపేతం చేయడానికి ప్రయత్నించకపోగా.. టీడీపీకి సాయం చేసేలా.. పురందేశ్వరి నిర్ణయాలు తీసుకుంటుదట. ఏపీలో అధికార వైసీపీ నుంచి టిక్కెట్లు దక్కని కొందరు నేతలు బీజేపీలో చేరుతామని ఆమెను ఆశ్రయించారట. అయితే బీజేపీకి రాష్ట్రంలో భవిష్యత్తు లేదని.. టీడీపీలో చేరితో నేతలకు అంతా బాగుంటుందని పురందేశ్వరి సలహాలిస్తున్నట్లు సమాచారం.
ఈ ఆరోపణలపై బీజేపీ అధిష్ఠానం వద్ద ఆధారాలు కూడా ఉన్నాయని లోగుట్టు. కొద్దిరోజుల్లోనే ఏపీ బీజేపీ చీఫ్ పదవి నుంచి దగ్గుబాటి పురందేశ్వరిని తొలగించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయట. ఇప్పటికే దీనిపై ఆమెకు సమాచారం కూడా అందించారని.. త్వరలోనే అధికారికంగా ప్రకటన రావొచ్చని విశ్వసనీయ వర్గాల మాట.
READ ALSO: నన్ను చూసి భయపడుతున్నారా?.. సీఎం జగన్‌కు చెల్లి షర్మిల కౌంటర్