Friday, November 22, 2024
Homenewsబీఆర్ఎస్‌కు షాక్! కాంగ్రెస్‌లోకి నలుగురు ఎమ్మెల్యేలు..!?

బీఆర్ఎస్‌కు షాక్! కాంగ్రెస్‌లోకి నలుగురు ఎమ్మెల్యేలు..!?

సీఎం రేవంత్ రెడ్డితో కాంగ్రెస్ ఎమ్మెల్యేల భేటీ.. జెండా మార్చేస్తారా?

By

ఐశ్వర్యా రాజ్

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ షాక్ తగిలి ఎలా అధికారాన్ని కోల్పోయిందో అందరికీ తెలిసిందే!. శ్రుతిమించిన నియంతృత్వ పోకడలకు ఫలితం అని కొందరంటే.. నేల విడిచి చేసిన సాముకు ప్రతిఫలం అని మరికొందరు వ్యాఖ్యానించారు. ఆ సంగతి అలా ఉంటే… తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. వారంతా ఇప్పుడు కాంగ్రెస్‌లో చేరుతున్నారనే వార్తలు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన మొదటి విదేశీ పర్యటన ముగించుకుని హైదరాబాద్ వచ్చిన తరువాత నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆయనతో భేటీ అయ్యారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని రేవంత్ రెడ్డి ఇంట్లోనే.. ఈ నలుగురు ఎమ్మెల్యేలు ఆయనతో సమావేశమయ్యారు. దీంతో ఈ విషయం తెలంగాణ రాజకీయల్లో తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఫలితంగా… రకరకాల ఊహాగానాలు తెరపైకి వస్తున్నాయి. లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఈ పరిణామం బీఆర్ఎస్‌‍కు గట్టిదెబ్బ అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

అయితే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన బీఆర్ఎస్ నేతల్లో.. నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి, పఠాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు ఉన్నారు. ఈ రూమర్లపై స్పందించిన బీఆర్ఎస్ నేతలు నియోజకవర్గంలోని సమస్యలు, అభివృద్ధిపై చర్చించేందుకే సీఎంను మర్యాదపూర్వకంగా కలిసినట్లు స్పష్టం చేశారు. ఏదిఏమైనప్పటికీ త్వరలో వీరంతా హస్తం గూటికి చేరబోతున్నారనే చర్చ తెలంగాణ రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. పైగా… రాబోయే లోక్‌సభ ఎన్నికలపై బీఆర్ఎస్ పార్టీలో సమీక్షలు జరుగుతున్న సమయంలోనే.. సీఎంతో ఎమ్మెల్యేల భేటీ బీఆర్‌ఎస్‌కు పెద్ద షాకే అని పరిశీలకుల మాట. ఇక ఈ “మర్యాదపూర్వక భేటీ” ఆంతర్యం ఏంటో తెలియాలంటే ఇంకొంత సమయం వేచి చూడాల్సిందే.

కాగా… విదేశీ పర్యటన వేళ బీఆర్ఎస్ పార్టీపై రేవంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్‌ను వంద మీటర్ల లోతులో పాతిపెడతామని.. సీఎం రేవంత్ హాట్ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. అటు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా.. తాము తలుచుకుంటే గులాబీ పార్టీని 14 ముక్కలు చేయగలమని.. తమతో సుమారు 30 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారంటూ హెచ్చరించే ప్రయత్నం చేశారు. ఈ ముచ్చట తెరపైకి వచ్చిన వారం రోజుల్లోనే బీఆర్ఎస్‌కు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు టీపీసీసీ చీఫ్, సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అవ్వడం రాజకీయవర్గాల్లో ప్రాముఖ్యత సంతరించుకుంది. కాగా.. 2018 ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలను మాజీ సీఎం కేసీఆర్.. గంపగుత్తగా గులాబీ గూటీకి లాగేసుకున్న ముచ్చట అందరికీ తెలిసిన సంగతే.

RELATED NEWS
- Advertisment -spot_img

LATEST NEWS