Thursday, December 19, 2024
Homenewsఎన్టీఆర్‌కు భారతరత్న ఇక కష్టమేనా..!?

ఎన్టీఆర్‌కు భారతరత్న ఇక కష్టమేనా..!?

 

By

ఐశ్వర్య రాజ్

నందమూరి తారకరామ రావు.. పరిచయం అవసరం లేని మహోన్నతుడు. తెలుగువాడు గర్వంగా చెప్పుకునే పేరు ఎన్టీఆర్, పౌరాణిక పాత్రలకు మారు పేరు.. రాముడు, కృష్ణుడు, వెంకటేశ్వరుడు అంటే ఆయనే అనేలా తెలుగు ప్రజల గుండెల్లో నిలిచిపోయిన దేవుడు ఎన్టీఆర్. చరిత్రాత్మక పాత్రలతో పాటు జానపదాలకు ఎన్టీఆర్ జీవం పోశారు. రాజు అంటే ఇలా ఉండాలి అని జనాలు అనుకునేలా అలాంటి పాత్రల్లో పరకాయ ప్రవేశం చేసి ప్రేక్షకుల హృదయాల్లో నటసార్వభౌముడిగా ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. సాంఘిక చిత్రాలలోపాటు.. ఎన్టీఆర్ చేసినన్ని వైవిద్య భరితమైన పాత్రలు ఎవరూ చేయలేదంటే అతిశయోక్తికాదు. దుర్యోధనుడు, రావణాసురుడు వంటి  ప్రతినాయక పాత్రలతో రంగస్థలాన్ని రక్తికట్టించారు. కేవలం నటుడిగానే కాకుండా.. దర్శకుడిగా తన ముద్ర వేశారు.

నిర్మాతగా కూడా పలు సందేశాత్మక చిత్రాలను తీశారు. వర్తమాన సమస్యలకు సైతం తనదైన శైలిలో పరిష్కారాలను ఆయన సినిమాల్లో చూపించారు. రామకృష్ణ స్టూడియో అధినేతగా ఆయన కొనసాగారు. ఎగ్జిబిటర్ గా ఉంటూ తెలుగు సినీ పరిశ్రమలో మొత్తం కనిపించారు. అన్నింటా ప్రతిభ చూపించారు. ఇది సినీ నేపధ్యం నుంచి చూసినపుడు ఎన్టీయార్ ఘనత. అందుకు గానూ అప్పట్లో ఆయనకు కేవలం పద్మశ్రీ అవార్డు మాత్రమే దక్కింది. ఇక రాజకీయాల్లో చూసుకుంటే అనితర సాధ్యమైన రికార్డు ఆయన సొంతం చేసుకున్నారు. అది గిన్నీస్ రికార్డు కూడా. పార్టీ పెట్టిన తొమ్మిది నెలలలోనే ఎన్టీయార్ అధికారంలోకి వచ్చారు. మూడున్నర దశాబ్దాల కాంగ్రెస్ పార్టీని ఓడించారు. ఈ విధంగా తీసుకుంటే ఎన్టీయార్ 1984లో కేంద్రంలో 35 ఎంపీ సీట్లతో ప్రతిపక్ష పాత్ర పోషించారు. నేషనల్ ఫ్రంట్ ని స్థాపించి కాంగ్రెసేతర కూటమిని కేంద్రంలో అధికారంలోకి వచ్చేలా చూశారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రి ఏడున్నరేళ్ళ పాటు ప్రజలకు సేవలందించారు. నాలుగు సార్లు ప్రమాణం చేశారు. 1994లో అయితే మొత్తం ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ కి 26 సీట్లు మాత్రమే దక్కాయి. టీడీపీకి సొంతంగా 225 వస్తే మిత్రులకు మిగిలిన సీట్లు లభించాయి. అంతలా రాజకీయాల్లో తన ప్రభంజనం చూపించి తెలుగు వారికి నిలువెత్తు సంతకం అయ్యారు. పాలనలో కూడా సామాన్యులకు బడుగులకు ఆయన పెద్ద పీట వేసి కూడు, గూడు, గుడ్డ అన్న మూడు ప్రధాన అవసరాలను తీర్చడానికి సంక్షేమ పధకాలు ఎన్నో పెట్టారు.

ఎందరికో రాజకీయంగా అవకాశాలు ఇచ్చి వారిని ముందు వరసలోకి తెచ్చారు. ఇలా ఒకే జీవితంలో రెండు విభిన్న రంగాలలో రాణించి ఎవరికీ చెందని రికార్డులను సొంతం చేసుకున్న ఎన్టీయార్ కి భారత రత్న బిరుదు ఎందుకు రావడం లేదు అన్నది సామాన్యుడికి సైతం కలిగే బాధ. ఎన్టీయార్ శతజయంతి వేడుకలు గత ఏడాది ఎంతో ఘనంగా జరిగాయి. ఆ సందర్భంగా ఆయన బొమ్మతో ఉన్న వెండి నాణేణ్ణి భారత రాష్ట్రపతి ఆవిష్కరించారు. ప్రతీ తెలుగువారూ అది చూసి ఉప్పొంగిపోయారు. అయితే అదే సమయంలో ఆయనకు భారత రత్న కూడా ప్రకటించి ఉంటే ఎంత బాగుండేది అన్నది అందరి మాట.

ఈ ఏడాది 75 వ గణతంత్ర వేడుకలకు ముందే భారత రత్న బిరుదు బీహార్ కి చెందిన మాజీ సీఎం కర్పూర్ ఠాకూర్ కి దక్కింది. ఆయన రెండు సార్లు మాత్రమే ముఖ్యమంత్రిగా సేవలందించారు. బీహారీలు ఆయనను జన నాయక్ అని పిలుస్తారు. ఆయన వెనుకబడిన వర్గాల కోసం ఎంతో తపన తాపత్రయం పడ్డారు. నిజంగా ఆయనకు ఆ గౌరవం దక్కాల్సిందే. ఆయన శత జయంతి వేడుకల సందర్భం ఇది. ఆయనకు అలా గొప్ప గౌరవం దక్కింది. అంతా సంతోషిస్తున్నారు. కానీ తెలుగు వారి వెలుగుగా ఉన్న ఎన్టీయార్ కి కూడా ఆయన శత జయంతి వేడుకల వేళ ఇదే విధంగా భారత రత్న ప్రకటించి ఉంటే బాగుండేది కదా అన్నది అందరి భావన. ఎన్టీయార్ కి భారత రత్న అన్న నినాదానికి 25 సంవత్సరాలు పైగానే దాటిపోయింది. తప్పు ఎక్కడ జరుగుతుందో ఎవరికీ తెలియదు. ఆయన స్థాపించిన తెలుగుదేశం పార్టీ ఏపీలో కీలకంగా ఉంది. ఆయన సొంత కుమార్తె ఏపీ బీజేపీ కి ప్రెసిడెంట్ గా కూడా ఉన్నారు. పదేళ్లుగా ఆమె అదే పార్టీలో ఉన్నారు. కేంద్రంలో పదేళ్ళుగా బీజేపీ అధికారంలో ఉంది. మరి ఎన్టీయార్ కి ఎందుకు భారత రత్న రావడం లేదు అనేది ప్రతి ఒక్కరి మాది లో మొలిచే ప్రశ్న. ఎన్టీయార్ ఈ లోకంలో లేరు. ఆయనకు భారత రత్న ప్రకటిస్తే తెలుగు జాతి మొత్తం సంతోషిస్తుంది. తలెత్తుకుని తిరుగుతుంది. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోక పోయినా దక్షిణాది నుంచి ఇంతటి ప్రతిభావంతుడు మళ్లీ పుట్టరు అన్నది చరిత్ర చెప్పే సత్యం. ఇప్పటికైనా మించిపోయినది ఏమి లేదు. ఎన్టీయార్ కి భారత రత్నకు కృషి చేయాలి. అది ఆయనకు దక్కాలి. నూరు శాతం అందుకు ఆయన అర్హుడు అన్నది కూడా అంతా ముక్త కంఠంతో చెబుతున్న మాట.

RELATED NEWS
- Advertisment -spot_img

LATEST NEWS