బీఆర్ఎస్ నాయకులు చెబుతున్నవన్నీ అబద్ధాలేనని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. రాష్ట్రంలో కరెంటు కోతలంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. వేసవి నేపథ్యంలో విద్యుత్ డిమాండ్ పెరిగినా కోతలు లేకుండా చూస్తున్నామని చెప్పారు. ఇవాళ బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన మీట్ ది ప్రెస్ కార్య క్రమంలో ఆయన మాట్లాడారు. ధనిక రాష్ట్రంగా వెలుగొందిన తెలంగాణకు ఏడు లక్షల కోట్ల అప్పు ఎక్కడి నుంచి వచ్చిందని అన్నారు.
రైతుబంధు కోసం ఎన్నికలకు ముందు ఏడు వేల కోట్లు రెడీ చేశామని బిఆర్ఎస్ నాయకులు చెబుతున్నారని, ఆ డబ్బులు ఎక్కడికి పోయాయో చెప్పాలన్నారు. తాము రైతులకు పెట్టుబడి సాయం కింద ఇప్పటి వరకు 5,500 కోట్లను ఖాతాల్లో వేశామని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే శ్వేత పత్రాల ద్వారా ప్రజలకు రాష్ట్ర పరిస్థితిని వివరించామని అన్నారు. మధ్యాహ్న భోజనానికి నిధులు ఇచ్చామని అన్నారు. రాబోయే రోజుల్లో రాష్ట్రానికి గ్రీన్ ఎనర్జీ తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించామని, ఇందుకోసం రూ. 1,020 కోట్లు విడుదల చేసినట్టు భట్టి విక్రమార్క వెల్లడించారు. తాము గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీలు కడుతున్నామని చెప్పారు. ప్రతిపక్షాల ఆరోపణలను ప్రజలు నమ్మే ప్రమాదం కూడా ఉందన్నారు. ప్రజలను ఆందోళ నలోకి నెట్టే ప్రచారం కూడా మంచిది కాదన్నారు. ప్రజలకు వాస్తవాలను చెప్పేందుకు తాను మీడియాకు ముందుకు వచ్చా అన్నారు.