Wednesday, October 16, 2024
HomeతెలుగుజాతీయంElection Expenses in INDIA : దేశంలో ఎన్నికలకు ఇంత ఖర్చా..!!

Election Expenses in INDIA : దేశంలో ఎన్నికలకు ఇంత ఖర్చా..!!

‘ఇండియన్ ఎక్స్ ప్రెస్’ వెల్లడించిన సమాచారం ప్రకారం 2019లో 32 జాతీయ, రాష్ట్ర పార్టీలు ఉమ్మడిగా ఖర్చు చేసిన రూ. 2,994 కోట్లలో, రూ.529 కోట్లను నేరుగా తమ తమ అభ్యర్థులకు అందించాయి. 2009 ఎన్నికలలో ఆరు జాతీయ పార్టీలకు చెందిన 388 లోకసభ సభ్యులు రూ.14.20 కోట్లు అందుకున్నట్లు, 2014 ఎన్నికలలో ఐదు జాతీయ పార్టీల నుండి గెలుపొందిన 342 అభ్యర్థులు ఉమ్మడిగా రూ.75.60 కోట్లు అందుకున్నట్లు తమ డిక్లరేషన్ పత్రాలలో వెల్లడించినట్లు అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫారమ్స్ తెలిపింది. లోక్ సభకు ఏడు దశలలో జరుగుతున్న ఎన్నికలలో దాదాపు 49.70 కోట్ల మంది స్త్రీలు … 47.10 కోట్ల మంది పురుషులతో కలిపి మొత్తం 96.80 ఓటర్లు పాల్గొననుండడం ప్రపంచంలోనే అతిపెద్ద ఎన్నికల వేడుక అనవచ్చు.

140 కోట్ల దేశ జనాభాలో దాదాపు 69% ఓటర్లున్నారు. 44 రోజుల పాటు ఏడు దశలలో కొనసాగే ఈ ఎన్నికలలో మొదటి దశలో 102 నియోజకవర్గాలలో ఏప్రిల్ 19న ప్రారంభమై వరుసగా ఏప్రిల్ 26న 89 నియోజకవర్గాలలో, మే 7న 94 నియోజకవర్గాలలో, 13న 96 నియోజకవర్గాలలో, 20న 49 నియోజకవర్గాలలో, 25న 57, జూన్ 1న 57 నియోజకవర్గాలలో ఏడవ దశతో ముగుస్తాయి. భారీ స్థాయిలో ఎన్నికల నిర్వహణకు వ్యయప్రయాసలతో పాటు ఖచ్చితమైన ప్రణాళిక అవసరం. 2019లో రాజ్యసభలో ఒక ప్రశ్నకు సమాధానంగా, స్వాతంత్య్రానంతరం అక్టోబర్ 25, 1951 నుండి ఫిబ్రవరి 21, 1952 వరకు 68 దశల్లో దేశంలో జరిగిన మొట్టమొదటి ఎన్నికలకు రూ. 10.45 కోట్లు, 2014 ఎన్నికలకు రూ.3,870 కోట్లు ఖర్చయినట్లు ప్రభుత్వం తెలిపింది.

2019లో జరిగిన లోక్సభ ఎన్నికలకు ప్రభుత్వం రూ. 50,000 కోట్లు వెచ్చించినట్లునట్లు సెంటర్ ఫర్ మీడియా స్టడీస్ నివేదించింది. ఈ లెక్కన 2024 ఎన్నికలకు దాదాపు ఒక లక్షా ఇరవై వేల కోట్లు ఖర్చు అవుతుందని అంచనా. ఇందులో 20% ఎన్నికల నిర్వహణ కోసం భారత ఎన్నికల సంఘం, మిగతా 80 శాతం వివిధ రాజకీయ పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు ప్రచారం కోసం ఖర్చు పెడతారని ఫస్ట్ పోస్ట్ సంస్థ తెలిపింది. 1951లో ఒక్కో ఓటర్ కోసం కేవలం 6 పైసలు వ్యయమవగా 2014లో అది రూ.46కి పెరగడం.. పెరుగుతున్న ఆర్థిక భారాన్ని సూచిస్తుంది.

సెంటర్ ఫర్ మీడియా స్టడీస్ చైర్మన్ ఎన్ భాస్కరరావు బ్లూమ్బర్గ్ మాట్లాడుతూ ఎన్నికల ఖర్చులో ఎక్కువ భాగం సామాజిక మాధ్యమాల ప్రచారానికి కేటాయిస్తున్నట్లు చెప్పారు. భాస్కరరావు అభిప్రాయంతో ఏకీభవిస్తూ కొలంబియా యూనివర్సిటీ లెక్చరర్ సైమన్ చౌచర్డ్ ఓటర్లను ఆకర్షించడానికి రాజకీయ నాయకులు ఆశ్రయిస్తున్నారన్నారు. విజయమే లక్ష్యంగా అభ్యర్థులు ఓటర్లకు డబ్బులు ఎరవేయడం, బహుమతులు ఇవ్వడంతో పాటు విభిన్న రకాల వస్తువులతో ప్రచారం చేస్తుండడంతో అవి విక్రయించే వ్యాపారులు కూడా లబ్ధి పొందుతున్నారు అని అన్నారు.

దేశంలోని 28 రాష్ట్రాలు, 8 కేంద్ర పాలిత ప్రాంతాలకు ప్రాతినిథ్యం వహించే 543 మంది లోక్సభ సభ్యుల కోసం ఎన్నికలు నిర్వహించడం అత్యధిక ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. 2019లో అర్హులైన ఓటర్లు 91.20 కోట్లు కాగా, 2024లో అది 96.80 కోట్లకు చేరింది. అర్హత కలిగిన ఓటర్ల సంఖ్య పెరుగుదల, కాలానుగుణంగా సాంప్రదాయ ప్రచార పద్ధతులతో పాటు సామాజిక మాధ్యమాలను ఆశ్రయించడం ఎన్నికల నిర్వహణ ఖర్చుల పెరుగుదలకు ప్రధాన కారణాలుగా పేర్కొనవచ్చు.

అధికారులు, సాయుధ సిబ్బందిని మోహరించడం నుండి పోలింగ్ బూత్లను ఏర్పాటు చేయడం, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లు ,కొనుగోలు చేయడం, ఇండెలిబుల్ ఇంక్ వంటి ఇతర అవసరమైన పరికరాలను కొనుగోలు చేయడం, ఓటు హక్కు గురించి అవగాహనా కార్యక్రమాలను నిర్వహించడంలాంటి వాటిపై భారత ఎన్నికల సంఘం భారీగా ఖర్చు పెడుతుంది. ఇండియన్ ఎక్స్ప్రెస్ నివేదిక ప్రకారం 2019 లోక్ సభ ఎన్నికలు పూర్తయినప్పటి నుండి ఇవిఎంల సేకరణ, నిర్వహణ వ్యయం గణనీయంగా పెరిగింది.

ఎన్నికల తర్వాత తొలి బడ్జెట్లో కేంద్రం ఇందుకు గాను రూ. 25 కోట్లు కేటాయించగా ప్రస్తుత సంవత్సరపు బడ్జెట్లో, ఇవిఎంల కోసం తొలుత రూ.1,891.8 కోట్లు, తదుపరి శీతాకాల సమావేశాల్లో రూ.611.27 కోట్ల గ్రాంట్ల కోసం అదనపు డిమాండ్ ను ప్రవేశపెట్టింది. పాలనాపరంగా ఎన్నికల విధులు నిర్వర్తించే సిబ్బందికి వేతనాలతో పాటు వాలంటీర్లకు పారితోషికం, శిక్షణా తరగతులకు హాజరయ్యే వారికి కరువు భత్యం, ప్రయాణ ఖర్చులు చెల్లిస్తారు.

ఎన్నికల సంఘం ప్రింట్, ఎలక్ట్రానిక్, సామాజిక మాధ్యమాల ద్వారా ఎన్నికలకు సంబంధించిన సమాచారాన్ని ప్రచారం చేయడం, అభ్యర్థుల ఎన్నికల ప్రచార పర్యవేక్షణ, సున్నితమైన పోలింగ్ బూత్ల వద్ద అవకతవకలు జరగకుండా సజావుగా పూర్తి పారదర్శకంగా జరిగేందుకు వీడియో రికార్డింగ్ చేయడం, ఎన్నికల అనంతరం ఇవిఎంలకు పకడ్బందీగా సీళు వేసి పూర్తి బందోబస్తుతో ఎన్నికల లెక్కింపు తేదీ వరకు భద్రతా కేంద్రాలకు తరలించి అక్కడ పటిష్టమైన నిఘా ఏర్పాటు చేయడం, చివరిగా లెక్కింపు కేంద్రాలకు తరలించి అక్కడ ఓట్ల లెక్కింపు తరువాత ఫలితాలను వెల్లడించి గెలుపొందిన అభ్యర్థులకు ధృవీకరణ పత్రాలను అందచేయడానికి భారీ మొత్తంలో ఖర్చవుతుంది. భారత ఎన్నికల సంఘం మార్చి 22, 2024 న విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారం ఎన్నికల అధికారికి రోజుకు రూ. 350, పోలింగ్ అధికారులకు రోజుకు రూ. 250, సహాయసిబ్బందికి రోజుకు రూ.200 చెల్లిస్తుంది.

RELATED NEWS
- Advertisment -spot_img

LATEST NEWS