ఉద్ధృతమవుతోన్న రైతుల ఢిల్లీ చలో ఆందోళన
-By CORRESPONDENT
పంటకు కనీస మద్దతు ధర (MSP)పై చట్టం రూపకల్పన, 2020 ఆందోళనల్లో పెట్టిన కేసుల కొట్టివేత తదితర డిమాండ్లతో అన్నదాతలు ఢిల్లీ చలో పేరుతో మంగళవారం ఆందోళన చేపట్టారు. పంజాబ్ నుంచి ఢిల్లీకి ట్రాక్టర్లపై చేరుకున్న రైతులు శంభు, సింఘా బార్డర్‌లో నిరసన చేపట్టారు. కర్షకులు బారికేడ్లను ట్రాక్టర్లతో కూలకొట్టడానికి ప్రయత్నించడంతో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. నిరసనకారులను నిలువరించడానికి పోలీసులు టియర్ గ్యాస్, రబ్బర్ బుల్లెట్లు, వాటర్ కెనాన్లు ప్రయోగించారు. దీంతో పోలీసులపై అన్నదాతలు రాళ్ల దాడి చేశారు. ఈ ఘటనలో వందల సంఖ్యలో రైతులు గాయపడ్డారు. పోలీసులు, మీడియా ప్రతినిధులకు కూడా గాయలయ్యాయి.
శుక్రవారం దేశవ్యాప్తంగా గ్రామీణ బంద్ చేపడతామని ఇప్పటికే రైతు సంఘాలు ప్రకటించాయి. రైతుల డిమాండ్లను కేంద్రం సత్వరమే పరిష్కరించేలా ఈ ఉద్యమాన్ని దేశం మొత్తం తీవ్రతరం చేయనున్నారు. మరోవైపు రైతులపై లాఠీఛార్జీ చేయడంతో పోలీసుల తీరుపై పలువురు నేతలు నిరసన గళాలు లేవనెత్తుతున్నారు. కాగా రైతులపై టియర్ గ్యాస్ ప్రయోగించేందుకు వదిలిన డ్రోన్లను అన్నదాతలు గాలిపటాలతో తిప్పికొట్టారు.
ఢిల్లీ చలో పేరుతో సింఘా బార్డర్‌లో రైతులు చేపట్టిన నిరసన ఉద్రిక్తంగా మారుతోంది. నిరసనకారులను చెడగొట్టేందుకు పోలీసులు డ్రోన్లు పంపారు. డ్రోన్లతో టియర్ గ్యాస్ చల్లే ప్రయత్నం చేయగా.. రైతులు గాలిపటాలు ఎగరేసి డ్రోన్లను తిప్పికొట్టారు.#FarmerProtest #DroneVsKites #TearGas #WordOfIndia pic.twitter.com/DO0mhu8PLe
— Word of india (@wordofindia) February 15, 2024
రైతులతో కేంద్రమంత్రుల చర్చలు
మరోవైపు రైతుసంఘాలతో కేంద్రమంత్రులు చర్చలు జరుపుతున్నారు. డిమాండ్లపై పరిష్కరించి ఆందోళనలను విరమించే దిశగా ప్రయత్నం చేస్తున్నారు. ఛండీగర్‌లో కేంద్ర వ్యవసాయశాఖమంత్రి అర్జున్ ముండాతో పాటు పీయూష్ గోయల్, నిత్యానంద్ రాయ్ ఈరోజు సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతు సంఘాలతో చర్చించనున్నారు. కాగా ఇప్పటికే ఇరువర్గాల మధ్య జరిగిన చర్చలు రెండుసార్లు విఫలమయ్యాయి. అటు రక్షణశాఖమంత్రి రాజ్‌నాథ్ సింగ్ రైతులకు సహాయంగా ఉంటామని.. నిరసన విరమించాలని కోరారు.
పంజాబ్‌లో రైళ్ల రాకపోకలకు అంతరాయం
రైతుల ఢిల్లీ చలో నిరసనకు మద్దతుగా భారతీయ కిసాన్ యూనియన్ పంజాబ్‌లో రైల్ రోకోకు పిలుపునిచ్చింది. ఈరోజు సాయంత్రం 4 గంటల వరకు రైతులు రైల్వే ట్రాక్‌లపై కూర్చొని నిరసన తెలుపనున్నారు. అటు ఢిల్లీలో ఈరోజు నుంచి సీబీఎస్‌సీ పరీక్షలు ఉన్నాయి. ట్రాఫిక్ రూల్స్ అమలులో ఉండటంతో ఎగ్జామ్స్ వాయిదా వేయాలని బోర్డుకు వినతులు అందాయి. కానీ పరీక్ష టైమ్ కంటే ముందే బయల్దేరాలని అధికారులు ఆదేశించారు. ఎట్టకేలకు పరీక్షలు మొదలయ్యాయి. మొత్తానికి రైతుల నిరసన ఢిల్లీ నుంచి దేశం నలుమూలల రాజుకుంటోంది.
READ ALSO: నీళ్ళు కాదు ప్లాస్టిక్ తాగుతున్నాం