సీటు రిజర్వేషన్ చేసి.. తర్వాతి స్టేషన్‌లో ఎక్కుతామంటే కష్టమే!
– By CORRESPONDENT
నిత్యం కోట్ల మంది భారతీయులను గమ్య స్థానాలకు చేరుస్తున్న భారతీయ రైల్వేకు రవాణాశాఖల్లో ఉన్న ప్రత్యేకతే వేరు. తక్కువ ఛార్జీలతో ప్రయాణం చేయాలన్నా.. సుదూర ప్రాంతాలకు చేరుకోవాలన్నా బెస్ట్ ఆప్షన్ ట్రైన్ జర్నీ.
గమ్యస్థానాలను చేరుకునేందుకు ప్రయాణికులు IRCTC, ఆన్‌లైన్, నేరుగా రైల్వే బుకింగ్ కౌంటర్‌లో గానీ టికెట్ బుక్ చేసుకుంటారు. అయితే కొందరు టికెట్ రిజర్వేషన్ చేసుకున్న స్టేషన్‍లో రైలు ఎక్కకుండా.. తర్వాతి స్టేషన్‌లో ఎక్కుతుంటారు. పైగా తమ బెర్త్ ఇతరులకు ఎలా కేటాయించారని టీసీలను ప్రశ్నిస్తుంటారు. ఇలాంటి ముచ్చట ఇకపై కుదరదు. ఇవి పునరావృతం కాకుండా ఉండేందుకు భారతీయ రైల్వే శాఖ నిబంధనలను కఠినతరం చేసింది.
ఈ కొత్త రూల్స్ ప్రకారం టికెట్ రిజర్వేషన్ చేసుకున్న ప్రయాణికులు.. ఏ స్టేషన్ నుంచి బయల్దేరేలా సీటు రిజర్వ్ చేసుకున్నారో అదే స్టేషన్‌లోనే రైలు ఎక్కాలి. అది కూడా.. రైలు ఎక్కిన 10 నిమిషాల్లో బుక్ చేసుకున్న సీటు వద్దకు చేరుకోవాలి. అలా చేరుకోకపోతే.. మీ సీటు ఖాళీగా ఉన్నట్లు పరిగణించి వేరే ప్రయాణికుడికి మీ సీటును కేటాయించే అధికారం టికెట్ కలెక్టర్‌కు ఉంటుంది.
ఇంతకీ.. సమస్య ఎక్కడొస్తుంది?
టికెట్ బుక్ చేసుకున్న తర్వాత కొందరు వ్యక్తిగత కారణాల వల్ల తర్వాతి స్టేషన్లలో ట్రైన్ ఎక్కుతుంటారు. టికెట్ రిజర్వేషన్ చేసుకున్న తర్వాతి స్టేషన్లలో ఎక్కడం వల్ల.. ఏ సీటులో ప్రయాణికులున్నారు!.. ఏ సీటు ఖాళీగా ఉందో తెలియక టీసీలు ఇబ్బంది పడుతున్నారు. ఇంకా ముందు స్టేషన్ నుంచైతే ఈజీగా రిజర్వేషన్ అవుతుందని ఇలా చేసేవాళ్లు లేకపోలేదు. ఈ టెక్నిక్‌ను ఆసరాగా చేసుకుని ట్రావెల్ ఎజెన్సీలు ప్రయాణికుల నుంచి ఎక్కువ మొత్తంలో డబ్బులు దండుకుంటున్నాయి. ఇలాంటి అక్రమాలకు చెక్ పెట్టేందుకే రైల్వే శాఖ ఈ కొత్త నియమాలను అమలు చేయబోతుంది.
ఇక గతంలో టీటీఈలకు ప్రింటెండ్ రిజర్వేషన్ లిస్ట్ ఇచ్చేవారు. దీంతో ఒకటి.. రెండు రైల్వే స్టేషన్లలో టికెట్ బుక్ చేసుకున్న ప్రయాణికులు ఎక్కకపోయినా.. అధికారులు ఎదురుచూసేవారు. కానీ ఇప్పుడు అలాంటి అవకాశం ఉండదు. రైలు టికెట్ రిజర్వేషన్ వివరాలు పరిశీలించేందుకు ట్రావెలింగ్ టికెట్ ఎగ్జామినర్‌లు కొంత కాలంగా.. ట్యాబ్స్ వంటి గ్యాడ్జెట్స్ వినియోగిస్తున్నారు. వాటిలో ఎప్పటికప్పుడు ప్రయాణికుల డీటైల్స్ అప్‌డేట్ అవుతుంటాయి. కాబట్టి తదుపరి స్టేషన్లలో రైలు ఎక్కాలంటే.. ప్రయాణికులు కచ్చితంగా బోర్డింగ్ వివరాలను మార్చుకోవాల్సిందేనని అధికారులు అంటున్నారు. లేనిచో ఆ బెర్త్‌ను వేరే ప్రయాణికులకు కేటాయిస్తామని స్పష్టం చేశారు. అందువల్ల సీటు కోల్పోకూడదంటే.. బుక్ చేసుకున్న స్టేషన్‌లోనే ట్రైన్ ఎక్కి రైల్వే శాఖకు సహకరించాలని కోరుతున్నారు.
Read Also: లక్షద్వీప్‌లకు వెళ్లడం ఇంత ఈజీనా?