By
ఐశ్వర్య రాజ్
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయిన BRS పార్టీ వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తమ పట్టు నిలుపుకోవాలని శతవిధాలుగా ప్రయత్నిస్తోంది . మొత్తం 17 సీట్లలో ఎక్కువ సీట్లు సాధించాలని ఉవ్విళ్లూరుతోంది. ఇందులో భాగంగా BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR నేరుగా రంగంలోకి దిగారు . హైదరాబాద్ పరిసర పార్లమెంట్ స్థానాలలో ఎక్కువగా ప్రజలతో మమేకం అవుతున్నారు . చాలా బిజీ గా పర్యటిస్తున్నారు.
కాగా KTR MP గా పోటీ చేస్తున్నారని BRS పార్టీ వర్గాలలో జోరుగా ప్రచారం సాగుతోంది. ప్రస్తుత సిరిసిల్ల ఎమ్మెల్యేగా, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న కేటీఆర్ ఈ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయాలని BRS కార్యకర్తలు భావిస్తున్నారు. పార్టీ హైకమాండ్, వారికి బాగా కావాల్సిన వాళ్లు చేసిన సూచనతోనే KTR నేరుగా రంగంలోకి దిగుతున్నారని పార్టీ వర్గాలు గుసగుస లాడుతున్నాయి . కీలక నేతలు పోటీ చేస్తే ఎక్కువ సీటు కలిసి రావడంతో పాటు.. పార్టీకి అన్ని విధాలుగా మేలు జరుగుతుందని హైకమాండ్ భావిస్తుంది. అంతేకాదు రేపొద్దున కేంద్ర ప్రభుత్వానికి చేరువ కావడానికి తోడ్పడే అవకాశాలు ఉంటాయని ప్లాన్ చేస్తోంది . ఎందుకంటే… అనారోగ్యంతో ఉన్న గులాబీ బాస్, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇకపై రాష్ట్ర స్థాయిలోనే ఉంటారని.. జాతీయ స్థాయిలో కేటీఆర్ చక్రం తిప్పాలన్నదే పార్టీ ప్లాన.
అంతేకాదు.. రాష్ట్రంలో కీలక, అతిపెద్ద నియోజకవర్గమైన మల్కాజ్గిరి లేదా సికింద్రాబాద్ నుంచి పోటీ చేయాలని హైకమాండ్ ఫిక్స్ అయ్యిందని, ఇందులో భాగంగానే హైదరాబాద్, సికింద్రాబాద్‌లో కేటీఆర్ జోరుగా తిరుగుతున్నారని వీరాభిమానులు చెప్పుకుంటున్నారు. గత 2014, 2018 ఎన్నికల్లో అవలీలగా అసెంబ్లీ, పార్లమెంట్లో గెలిచిన సంగతి తెలిసిందే. అయితే.. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పరాజయం పాలైన తర్వాత మొట్టమొదటి సారిగా జరుగుతున్న ఎన్నికలు ఇవే. దీంతో ఈ ఎన్నికలను బీఆర్ఎస్ బాగా సీరియస్‌గా తీసుకున్నది.
మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలో ఏడు అసెంబ్లీ స్థానాలు ఉండగా అన్నీ బీఆర్ఎస్ కైవసం చేసుకున్నవే. ఇక సికింద్రాద్ పార్లమెంట్ పరిధిలో ఆరు స్థానాల్లో మాత్రమే గులాబీ పార్టీ గెలిచింది. దీంతో ఈ రెండు పార్లమెంట్ స్థానాల్లో కూడా గులాబీ జెండా రెపరెపలాడించాలని హైకమాండ్ భావిస్తోందని. ఈ వ్యూహంలో భాగంగా కేటీఆర్‌ను బరిలోకి దింపితే కచ్చితంగా గెలుస్తారని.. పైగా సిట్టింగ్‌ను మార్చినట్లు కూడా ఉంటుందని పార్టీ పెద్దలు భావిస్తున్నారని తెలంగాణ భావన వర్గాలు చర్చించుకుంటున్నారు . ఎందుకంటే 2018 ఎన్నికల్లో మల్కాజిగిరి నుంచి ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి ఎంపీగా ప్రాతినిథ్యం వహించారు. ఈసారి రేవంత్ పోటీచేసే ఛాన్స్ లేదు గనుక ఇది కూడా బీఆర్ఎస్కు బాగా ప్లస్ అయ్యే ఛాన్స్ ఉంది. కాగా.. పార్లమెంట్ ఎన్నికల హడావుడి మొదలైనప్పట్నుంచీ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా మెదక్ నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. ఇప్పుడేమో కేటీఆర్ పేరు కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. అయితే.. కేటీఆర్‌ను పార్లమెంట్‌కు పంపి.. జాతీయ స్థాయిలో పార్టీని బలోపేతం చేయటంపై ఫోకస్ చేసేందుకు కేసీఆర్ ఇలా చేస్తున్నారని బీఆర్ఎస్ కార్యకర్తలు, వీరాభిమానులు చెప్పుకుంటున్న పరిస్థితి. మరోవైపు.. రాష్ట్ర స్థాయిలో అదీ ప్రత్యేక రాష్ట్రాన్ని తెచ్చామని చెప్పుకుంటున్న బీఆర్ఎస్ ఓడిపోయింది.. ఇక జాతీయ స్థాయిలో చేసేదేముందనే ఆరోపణలూ లేకపోలేదు. ఫైనల్‌గా ఏం జరుగుతుందో.. కేసీఆర్, కేటీఆర్ ఇద్దరిలో ఎవరు పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తారో చూడాలి మరి.