MP Magunta : ఏపీ రాజకీయాలు రోజురోజుకూ వేడెక్కుతున్నాయి. నేతల్లో అసంతృప్తి తారాస్థాయికి చేరుకుంటోంది. ఫలితంగా వారు పార్టీని వీడుతున్నారు. తాజాగా ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి రాజీనామా చేశారు. ఈ మేరకు ఒంగోలులో జరిగిన మీడియా సమావేశంలో ఆయన ప్రకటన చేశారు.
ఎంపీ మాగుంట రాజీనామా ప్రకాశం జిల్లాలో వైసీపీ భవిష్యత్తుకు ఓ రకంగా ఎదురుదెబ్బ అనే చెప్పొచ్చు. రాజీనామా అంశంపై మాట్లాడిన ఆయన ” ప్రకాశం జిల్లాలో మాగుంట ఒక బ్రాండ్. 33 సంవత్సరాలుగా రాజకీయాల్లో తిరుగుతున్నాం. 11 సార్లు ఎన్నికల్లో పోటీ చేశాను. మాగుంట కుటుంబానికి అహంకారం లేదు. మాకు ఆత్మగౌరవమే ముఖ్యం. అనివార్య కారణాల వల్ల వైసీపీని వీడుతున్నాం. ఇది బాధకరమే అయినా తప్పడం లేదు. ఒంగోలు ఎంపీ బరిలో నా కుమారుడు మాగుంట రాఘవరెడ్డి (Magunta Raghava Reddy )ని నిలబెట్టాలని నిర్ణయం తీసుకున్నాం.” అని పేర్కొన్నారు.
అయితే వైసీపీ అధిష్ఠానం ఒంగోలులో ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డిని గతకొన్ని నెలలుగా దూరం పెడుతూ వస్తోంది. ఒంగోలు ఎంపీ స్థానానికి వైసీపీ నుంచి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని నిలబెట్టాలని భావించింది. ఈ పరిణామాలపై అసంతృప్తి వ్యక్తం చేసిన మాగుంట.. వైసీపీకి రాజీనామా చేశారు. మార్చి మొదటివారంలో ఆయన టీడీపీలో చేరనున్నట్లు సమాచారం. దీనిపై త్వరలోనే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని మాగుంట శ్రీనివాసులు రెడ్డి స్పష్టం చేశారు.
కాగా దాదాపు రెండు నెలల క్రితమే మాగుంటకు టికెట్ ఇచ్చేది లేదని వైసీపీ అధిష్ఠానం ఆయనకు క్లారిటీ ఇచ్చింది. అయితే మాగుంటకు సీటు ఇవ్వాలనీ మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసులు రెడ్డితో కలిసి నెలరోజులపాటు పార్టీ ఆఫీసుల చుట్టూ తిరిగారు. ఈ క్రమంలో సీఎం జగన్ స్వయంగా బాలినేనితో మాట్లాడి పరిస్థితిని వివరించారు. దీంతో బాలినేని మెల్లగా ఈ అంశం నుంచి తప్పుకున్నారు. అటు టీడీపీ అధినేత చంద్రబాబుకు మాగుంట టచ్‌లో ఉన్నారన్న వదంతుల నేపథ్యంలో వైసీపీ మాగుంటను దూరం పెట్టడం మొదలెట్టింది. ఇటీవల ఒంగోలులో జరిగిన సీఎం జగన్ పర్యటనకు సైతం మాగుంటకు ఆహ్వానం అందలేదు. కనీసం ప్రభుత్వం ప్రోటోకాల్ కూడా పట్టించుకోలేదని మాగుంట అసహనం వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో మనస్తాపానికి గురైన ఒంగోలు ఎంపీ వైసీపీకి రాజీనామా చేశారు.
ఇక మాగుంట రాజీనామాతో ఆరుగురు ఎంపీలు వైసీపీని వీడినట్లు అయింది. కొద్దిరోజుల్లోనే ఐదుగురు పార్లమెంటు సభ్యులు, ఒక రాజ్యసభ ఎంపీ సీఎం జగన్ పార్టీకి గుడ్ బై చెప్పారు. మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి, కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్, నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజుతో పాటు రాజ్యసభ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైసీపీని వీడారు.
READ LATEST TELUGU NEWS: దగ్గుబాటి పురందేశ్వరిని పదవి నుంచి తొలగిస్తారా?