Hyderabad : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కి రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ బహిరంగ లేఖ రాశారు. ‘రిజర్వేషన్లను వ్యతిరేకించే బీజేపీకి బీసీ, ఎస్సీ, ఎస్టీల ఓట్లు అడిగే హక్కు లేదు. మండల కమిషన్ అమలును మీ పార్టీ వ్యతిరేకించింది. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ రిజర్వేషన్ రహిత భారతదేశాన్ని చేస్తామని అనేక సందర్భాల్లో చెప్పారు? కాంగ్రెస్ కుల గణన చేయాలని భావిస్తే.. మీరు సుప్రీంకోర్టులో అఫిడవిట్ ఇచ్చింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమానత్వం కోరుకునే వాళ్లంతా నక్సలైట్లు అంటున్నరు. ఇప్పుడు ఎన్నికలు రాగానే ఊపర్ జై శ్రీరాం.. అందర్ రిజర్వేషన్ కు రాంరాం అంటున్నరు. రాష్ట్రంలో గత ఎన్నికల్లో బలహీన వర్గాల నుంచి ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పి.. కనీసం శాసనసభ పక్ష పదవిని కూడా బీసీలకు ఎందుకు ఇవ్వలేదు? మీరు రాజకీయంగా గుజరాతీలకు తొత్తులుగా, బానిసలుగా పని చేయడం తప్ప తెలంగాణ విభజన హామీలు అమలు చేశారా? ప్రజలు మీకు ఓటు ఎందుకు వేయాలో నేను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పి ఓటు అడగండి’ అని పొన్నం లేఖలో పేర్కొన్నారు.