Significance of Hanuman Jayanti: ఒక కల్పం అంటే నాలుగు వందల ముప్పయి రెండు మిలియన్ల సంవత్సరాలు జీవించే ఎనిమిది మంది చిరంజీవులలో ఒకరైన హనుమంతుని జయంతి ప్రత్యేకత కలిగి ఉంది. భారతావనిలో వివిధ ప్రాంతాలలో హనుమాన్ జయంతిని వివిధ మాసాలలో జరుపుకుంటారు. ఆంజనేయుడు, హనుమంతుడు, హనుమాన్, బజరంగబలి, మారుతి, అంజనీసుతుడు వంటి ఎన్నో పేర్లతో హనుమంతుని ఆరాధిస్తారు.
ఉత్తర భారత దేశంలో వారణాసిలో సంకట మోచన దేవాలయం, అయోధ్యలో హన్మాన్ గార్తి దేవాలయాలలో ఈ పర్వదిన వేడుకలను ఘనంగా నిర్వహిస్తారు. తమిళనాడు, కేరళ రాష్ట్రాలలో “మార్గళి” మాసం అనగా డిసెంబర్ లేదా జనవరిలలో జరుపుకుంటారు. ఒరియా క్యాలెండర్ ప్రకారం విషుభ సంక్రాంతి మొదటి రోజున వైశాఖంలో పాటించే ఆచారం ఉంది. అలాగే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్నాటకలలో వైశాఖ కృష్ణపక్షం మందు పెద్ద హనుమాన్ జయంతిగా జరుపుకునే సాంప్రదాయం ఉంది. చైత్ర పౌర్ణమితో ప్రారంభించి, హన్మాన్ దీక్షలను వైశాఖ కృష్ణ పక్ష దశమి కి ముగిసేలా 41 రోజుల మండల దీక్షలను చేపట్టడం ఆనవాయితీగా, సాంప్రదాయ సిద్ధంగా వస్తున్నది.
పిల్లలు, పెద్దలు ఆపత్సమయాలలో, భయం కలిగే వేళలలో ఆంజనేయ దండకం చదువడం చిరకాలంగా అనుసరిస్తున్న సంప్రదాయం. శివాజీ గురువైన సమర్థ రామదాసు హనుమంతుని భక్తుడు కాగా, మహారాష్ట్రుల జెండా మీద గదాపాణియైన హనుమంతుడు ఉంటారు. పాండవ మధ్యముడైన అర్జునుని జెండాపై ఉపవిష్ణుడై హనుమంతుడు మహా భారత యుద్ధంలో అర్జునునికి రక్షణగా ఉన్న గాధ.. అందరికీ తెలిసిందే.
హనుమంతుడికి స్వర్గ ప్రాప్తి లభించినా,పవనసుతుడు అందుకు అంగీకరించక, తాను భూమిపైనే రాముడి భక్తుడిగా కలకాలం ఉండి పోతానని కోరుకుంటాడు. అందుకు శ్రీరాముడు కూడా ఒప్పుకుంటాడు. ఈ కారణంగానే భూమిపై రాముడిని ఇప్పటికీ భజనలు, కీర్తనలతో కొలుస్తున్నారు. ఆజన్మ బ్రహ్మచారిగా ఉన్న ఆంజనేయుడు, అవతార పురుషుడు అయిన శ్రీ రాముడినే తన హృదయంలో బంధించి భక్తిలో ఎవరికీ సాటి లేదని చాటాడు. హనుమంతుడు సీతా రాముల దాసునిగా, రామ భక్తునిగా, విజయ ప్రదాతగా, రక్షకునిగా హిందూ మతములో అత్యంత భక్తి శ్రద్ధలతో కొలువబడే దైవంగా నిత్య పూజలు అందుకుంటున్నాడు. ప్రతి గ్రామానికీ ఆయన క్షేత్ర పాలకుడు. అంటే గ్రామ రక్షకుడు. భగవద్దాసులలో సాటిలేని ఆంజనేయుని పూజకు ఉద్దిష్టమైన చైత్ర పూర్ణిమతోపాటు, వైశాఖ బహుళ దశమి నాడు కూడా ప్రత్యేక ఆర్చనలు, పూజాదులు నిర్వహించడం సదాచార సాంప్రదాయంగా వస్తున్నది.
అసమాన భక్తాగ్రేసరుడు, ఆదర్శ పురుషుడు, నమ్మిన బంటు, సంస్కృతాధ్యనేక భాషలు, వ్యాకరణాది శాస్త్రాలు, సంగీతాది కళలలో నిష్ణాతుడు అయిన చిరంజీవి ఆంజనేయుని నమ్ముకొని, భక్తి శ్రద్ధలతో, హనుమాన్ చాలీసా రోజూ పఠిస్తే శని చెడు ప్రభావం సోకదని భక్తుల ప్రగాఢ విశ్వాసం.