సమ్మర్ హీటెక్కిస్తోంది. వేసవి ఉష్ణోగ్రతలు జనాలను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. భూమి నిప్పుల కొలిమిని తలపిస్తోంది. ఉదయం 8 గంటలు దాటితే వేసవి తాపం, ఎండ, ఉక్కపోత వెంటాడుతున్నాయి. నేడు పగటి ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలు దాటి పాదరసం ఎగబాకుతోంది. వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ హెచ్చరికలు సహితం జారీ చేసే అసాధారణ స్థాయి వరకు చేరింది. ఒక వైపు భానుడి భగభగలు, మరో వైపు ఉక్కపోతలతో జనం నీడలను వెతుక్కుంటూ పరుగిడుతున్నారు.
వేసవి తాపాన్ని తట్టుకుంటూనే జీవనోపాధి పోరాటాలు కొనసాగిస్తున్నారు. మారుతున్న వాతావరణ ప్రతికూలతల ఫలితంగా వడ గాలులు, సూర్య ప్రతాపాలు తీవ్ర ప్రజారోగ్య సమస్యలకు ఊతం ఇస్తున్నాయి. వేసవి తాపాన్ని తట్టుకుంటూ మన మన పనులను చేసుకోవడానికి కొన్ని జాగ్రత్తలు, జీవనశైలి మార్పులు చేసుకోవడమే మన ముందున్న ఏకైక మార్గమని నిపుణులు సూచిస్తున్నారు. మే మాసంలో ఎండల తీవ్రత మరింత పెరిగే ప్రమాదం ఉంది కాబట్టి పలు చిట్కాలు తెలుసుకొని తగు జాగ్రత్తలు పాటించాలి.
శరీరంపై నేరుగా మధ్యాహ్న వేళ సూర్య కాంతి పడకుండా ఉండేలా గొడుగులు, చెట్టు నీడలు, కృత్రిమ పై కప్పులు, బైకులపై పయణించే వారు చర్మాన్ని బట్టలతో కప్పుకోవడం, ముఖాన్ని కాటన్ చేతిరుమాలు లేదా టవల్ తో కప్పుకోవడం, తలపై టోపి పెట్టుకోవడం, చల్లని ప్రదేశాల్లో ఉండే ప్రయత్నాలు, గాలి ప్రవహించే గదుల్లో ఉండేలా జాగ్రత్తలు తీసుకుందాం. శరీరంపై నేరుగా అతినీలలోహిత కిరణాలు కలిగిన సూర్యరశ్మి పడితే హీట్ స్ట్రోక్, చర్మం ముడతలు, పొడిబారి పగిలి పోవడం, వేడితో అలసట లాంటి అసౌకర్యాలు కలుగుతాయి. ఎండలో నుంచి ఇండ్లలోకి రాగానే ముఖం, కాళ్ళు, చేతులు, శరీరాన్ని చల్లని నీటితో కడుక్కోవడం పాటిస్తే రక్త ప్రసరణ సక్రమంగా జరుగుతుందని తెలుసుకోవాలి. ఇంటికి రాగానే ఐస్ బ్యాగ్ ముఖం, మెడ, చేతులను రుద్దు కోవాలి.
ఎండ నేరుగా ముఖం, తలపై పడకుండా చూసుకోవాలి. మధ్యాహ్న వేళ వంట చేయడం మానేయాలి. వంటగదిలో ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఆన్లో ఉంచాలి. ఎండకు మంచి నీరే దివ్య ఔషధం అని మరువరాదు. ఎండ, వడగాలుల్లో పని చేసినపుడు చమట రూపంలో శరీరంలోని నీటి శాతం తగ్గిపోయి ప్రమాదకర డీహైడ్రేషన్ సమస్యలు ఉత్పన్నం అవుతాయి. ఎండల్లో తిరుగుతూ కఫీన్ రసాయనం అధికంగా ఉన్న టీ తాగడం మంచిది కాదు. వడ దెబ్బకు ఉత్తమ ఔషధంగా మట్టి పాత్రల్లోని చల్లని నీరు, చిటికెడు చక్కర/ఉప్పు కలిపిన నీళ్లు, నిమ్మకాయ రసం, కొబ్బరి నీళ్లు, ఇంట్లో చేసిన షర్బత్ ద్రవాలు, మజ్జిగ, తాజా పండ్ల రసాలు తీసుకోవడం ఉత్తమం. ఆల్కహాల్ సేవనంతో డీహైడ్రేషన్ పెరుగుతుందని గమనించి పూర్తిగా తగ్గించాలి.
నీటి శాతం అధికంగా ఉన్న మామిడి పండ్లు, పుచ్చకాయ, కీర దోసకాయ, పాలకూర, కర్బూజ, స్ట్రాబెర్రీ, ద్రాక్ష పండ్లు లాంటిని తీసుకోవడం మంచిది. వేసవిలో లభించే సీజనల్ ఫుడ్స్ తీసుకోవడానికి ప్రాధాన్యం ఇవ్వాలి. పండ్ల రసాల కన్న పండ్లను పూర్తిగా తినడం మంచి అలవాటు. వేసవిలో గుల్కంద్?, కొద్ది ఘాటైన పెప్పర్/చిల్లీ ఫుడ్స్ వాడడం మంచిది. దోసకాయ, గుమ్మడి కాయ, పొట్లకాయ, చికెన్ గ్రేవీ, గుడ్లు లాంటి ఆహారం తీసుకోవడం ఉత్తమమని తెలుసుకోవాలి. వేసవిలో టీ, కాఫీ, ప్రోటీన్ ఫుడ్స్ వల్ల డీహైడ్రేషన్ పెరుగుతుందని గమనించి వాటి వాడకాన్ని తగించాలి.
ఉదయం 7 గంటల లోపు సమీప గార్డెన్స్ లో వాకింగ్, వ్యాయామాలు చేయడం అలవాటు చేసుకోవాలి. ఎండలో కాకుండా ఇండోర్స్ లోనే శారీరక వ్యాయామం, వీలైతే స్విమ్మింగ్ చేయాలి. అతిగా వ్యాయామం చేసినపుడు డీహైడ్రేషన్ సమస్యలను కొని తెచ్చుకోరాదు. వ్యాయామం చేస్తున్నపుడు మధ్య మధ్య లో విశ్రాంతి లేదా బ్రేక్స్ తీసుకోవడం ఉత్తమం. వేసవిలో సరి కొత్త వ్యాయామాలు చేయడం సముచితం కాదు. తొలిసారి యోగా, జిమ్ లాంటి వ్యాయామాలు చేసే సమయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. కాళ్లకు బూట్లు, చెప్పులు లేకుండా వ్యాయామం చేయడం అలవర్చుకోవాలి.
ఏసీలు, కూలర్లు, ఫ్యాన్లు వాడి గదులు కూల్ గా ఉండే విధంగా శ్రద్ధ తీసుకోవాలి. కిటికీలకు కర్టెన్స్ అమర్చుకోవడంతో ఎండ నేరుగా ఇంట్లోకి ప్రవేశించదని తెలుసుకోవాలి. మధ్యాహ్న వేళల్లో వడగాలులు ప్రవేశించకుండా కిటికీలు మూసి వేయడం, సాయంత్రం తిరిగి తెరవడం మంచిది. అతి వేడి, అతి చల్లదనం నిద్రను భంగపరుస్తుంది. నిద్రకు ముందు స్నానం చేయడంతో శరీర వేడి తగ్గి నిద్రకు ఉపకరిస్తుంది. ప్రతి రోజు 6 8 గంటలు నిద్ర పోవాలి. నిద్రకు 2 గంటల ముందు వ్యాయామం చేయడం మంచిది కాదు. సాయంత్రం అతిగా తినడం, ఆల్కహాన్ తాగడం, పొగ తాగడం మానేయాలి. పడక గదికి టివీ, సెల్ఫోన్ తీసుకురావద్దు.
వేసవి తాపానికి చర్మం, తల వెంట్రుకలకు హాని కలుగుతుంది. ఎండ వల్ల సన్బర్న్స్, హీట్ రాషెస్, వెంట్రుకలు రాలి పోవడం లాంటి అనారోగ్యాలు పెరుగుతాయి. ఎండలోకి వెళ్లే ముందు చర్మానికి/వెంట్రుకలకు లోషన్స్, జెల్స్ వాడడం మంచిది. మన చర్మ స్వభావాన్ని బట్టి ముఖం, మెడ, ఎండ పడే శరీర ప్రాంతాలకు తగిన సస్క్రీన్ లోషన్స్ 3 గంటలకు ఒకసారి వాడడం మరువరాదు. పెదవులు పగలకుండా తగిన లిప్ స్టిక్, ఫేసియల్ వైప్స్ వాడాలి. స్ప్రే బాటిల్ తో ముఖంపై చల్లని నీరు చల్లుకోవాలి. శరీరాన్ని తుడుచుకోవడానికి తడి కాటన్ బట్టను వాడండి.
వేసవి తాపాన్ని తట్టుకొనే తేలికైన, వదులు, పలుచని, తెల్లరంగు కాటన్ లేదా లైనెన్ వస్త్రాలు, లూజ్ పైజామా, ధరించాలి. లెదర్, అక్రెలిక్, మందపు సిల్క్ వస్త్రాలు, జీన్స్ వాడరాదు. మెడకు స్కార్ఫ్, టోపీలు, జాకెట్స్ వాడడం మంచి మార్గంగా గమనించాలి. ఉతికి ఆరేసిన బట్టలు పూర్తిగా ఎండే విధంగా చూసుకోవాలి. వేసవి తాపం, వడదెబ్బ నుంచి రక్షణ పొందడానికి తగు జాగ్రత్తలు తీసుకుంటూనే ఆహారం, అసురక్షిత నీటి నుంచి సంక్రమించే వ్యాధుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. వేసవి కాలంలో పిల్లలు, వృద్ధులపట్ల తగు జాగ్రత్తలు తీసుకోవాలి. అవసరం అనిపిస్తే సాధారణ ప్రాతిపదికన డాక్టర్ చెకప్ లు చేయించుకోవాలి. మధ్యాహ్న వేళ ఇంటిలో ఉండడం అన్నింటి కన్న ఉత్తమమైన మార్గం అని తెలుసుకొని మసలుకుందాం.