Thursday, December 19, 2024
HomePawan Kalyan: పవన్ పిఠాపురంలో గెలిస్తే ఏం జరగబోతుంది?

Pawan Kalyan: పవన్ పిఠాపురంలో గెలిస్తే ఏం జరగబోతుంది?

ఏపీలో హాట్ సీటు పిఠాపురంపై వైసీపీ దృష్టిసారించింది. పవన్ కల్యాణ్(Pawan Kalyan) లక్ష్యంగా మంత్రులు, కాపు నేతలను రంగంలోకి దింపుతోంది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నట్లు ప్రకటించగానే అధికార వైసీపీ అలర్ట్ అయ్యింది.

పిఠాపురం నుంచి వంగా గీతను వైసీపీ రంగంలోకి దింపింది. పవన్ కల్యాణ్(Pawan Kalyan)కు ఈసారి గెలుపు చాలా కీలకం. గత ఎన్నికల్లో రెండు స్థానాల్లో ఓడిపోయిన పవన్… ఈసారి నియోజకవర్గం మార్చారు. కాపు సామాజికవర్గానికి పట్టున్న పిఠాపురం నియోజకవర్గాన్ని ఎంచుకున్నారు.

అయితే అధికార వైసీపీ.. పవన్ కల్యాణ్(Pawan Kalyan) ఓటమే లక్ష్యంగా పావులు కదుపుతోంది. ఇప్పటికే పిఠాపురం జనసేన మాజీ ఇన్‌ఛార్జ్ మాకినీడి శేషకుమారిని వైసీపీలో చేర్చుకుంది. పవన్ లక్ష్యంగా సీఎం జగన్ మంత్రులను రంగంలోకి దించుతున్నారు.

ఆపరేషన్ పిఠాపురంలో భాగంగా ఎంపీ మిథున్ రెడ్డి, ఎమ్మెల్యే ద్వారంపూడితో పాటు కాపునేతలైన ముద్రగడ పద్మనాభం, దాడిశెట్టి రాజా, కురసాల కన్నబాబులతో విస్తృత ప్రచారం చేయించాలని వైసీపీ వ్యూహ రచన చేస్తోంది.

వైసీపీ ప్రణాళికలో భాగంగా కీలక నేతలకు వార్డుల వారీగా బాధ్యతలు అప్పగించనున్నారు. దీంతో పాటు సీఎం జగన్ బస్సు యాత్ర పిఠాపురంలో నిర్వహించనున్నారు. పిఠాపురం టికెట్ ఆశించిన, టీడీపీ నేత వర్మ చేస్తున్న వ్యాఖ్యలను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు వైసీపీ నేతలు ప్రయత్నిస్తున్నారు.

ఇక నుంచి పిఠాపురం నియోజకవర్గాన్ని తన స్వస్థలం చేసుకుంటానని పవన్ కల్యాణ్(Pawan Kalyan) ఇటీవల వ్యాఖ్యానించారు. అక్కడి నుంచే రాష్ట్ర రాజకీయాల్లో మార్పును తీసుకువస్తామన్నారు. వైసీపీ తనను ఓడించేందుకు ఓటు లక్ష ఇచ్చేందుకు సిద్ధమైందని పవన్ ఆరోపించారు.

ఈ తరుణంలో పవన్ కల్యాణ్(Pawan Kalyan)కు ఎలాగైనా చెక్ పెట్టాలని సీఎం జగన్ వ్యూహాలు రచిస్తున్నారు. పిఠాపురంలో టీడీపీ, జనసేన అసంతృప్తులను చేరదీస్తున్నారు. కాపు సామాజిక వర్గం నేతలతో ప్రచారం చేయించి, వారిని వైసీపీ వైపు తిప్పుకోవాలని చూస్తున్నారు.

వైసీపీ నుంచి పోటీ చేస్తున్న వంగా గీత కూడా కాపు నేత కావడంతో ఆమె గట్టి పోటీ ఇస్తారని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. పిఠాపురం టికెట్ ఆశించిన టీడీపీ నేత వర్మ అసంతృప్తిలో ఉన్నారు. ఒకవేళ పవన్ కల్యాణ్ ఎంపీగా పోటీ చేస్తే పిఠాపురం నుంచి తానే పోటీ చేస్తానంటున్నారు.

అయితే ఈ ఎన్నికల్లో వర్మ జనసేనకు ఎంత వరకూ సాయపడతారో తెలియాల్సి ఉంది. ప్రజారాజ్యం సమయంలో వంగా గీత పిఠాపురం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. అనంతరం ఆమె వైసీపీలో చేరారు. ఈసారి ఆమె పవన్ కల్యాణ్‌(Pawan Kalyan)పై పోటీ చేస్తుండడంతో పిఠాపురం రాజకీయం ఆసక్తికరంగా మారింది.

ఏపీ పొత్తు రాజకీయంలో పవన్ కల్యాణ్ కీలకంగా వ్యవహరించారు. టీడీపీ, బీజేపీ పొత్తుకు ఆయన మధ్యవర్తిత్వం చేశారు. ఈ పొత్తులో జనసేన తక్కువ సీట్లకే పరిమితం కావాల్సి వచ్చింది. పొత్తుల్లో భాగంగా సీట్లు కోల్పోయినా.. వైసీపీని అధికారం నుంచి దించడమే తన లక్ష్యమని పవన్ కల్యాణ్ చెబుతున్నారు.

గత ఎన్నికల ఘోరపరాభవంతో జనసేనను అతికష్టం మీద నడుపుకొస్తున్న పవన్ కల్యాణ్‌కు 2024 ఎన్నికలు చాలా కీలకంగా మారాయి. పవన్ కల్యాణ్ ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగుపెడితే జనసేన మరింత బలం పుంజుకుంటుందని విశ్లేషకులు అంటున్నారు.

ఏపీలో బలమైన పార్టీలుగా ఉన్న టీడీపీ, వైసీపీ.. జనసేన ఎదుగుదలను కచ్చితంగా అడ్డుకుంటాయనేది వాస్తవం అంటున్నారు. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరనే మాటను రాజకీయ విశ్లేషకులు గుర్తుచేస్తున్నారు.

ప్రస్తుత ఎన్నికల్లో పవన్ కల్యాణ్‌కు గెలుపు ఎంతో ముఖ్యమో.. పవన్ ఓడించి జనసేన పునాదిపై దెబ్బకొట్టడం కూడా వైసీపీకి అంతే ముఖ్యమని విశ్లేషకుల మాట. అందుకే ఆపరేషన్ పిఠాపురానికి వైసీపీ చాలా ప్రాధాన్యత ఇస్తుందంటున్నారు.

READ LATEST TELUGU NEWS: పిఠాపురంలో కాపుల మద్దతు ఎవరికి?

RELATED NEWS
- Advertisment -spot_img

LATEST NEWS