Saturday, December 21, 2024
Homenewsచంద్రమోహన్.. సినీ సెంటిమెంట్‌కు కేరాఫ్ అడ్రస్- దివికేగిన విలక్షణ నటుడు

చంద్రమోహన్.. సినీ సెంటిమెంట్‌కు కేరాఫ్ అడ్రస్- దివికేగిన విలక్షణ నటుడు

 

నవంబర్ 11  :టాలీవుడ్‌లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నటుడు చంద్రమోహన్ శనివారం తుదిశ్వాస విడిచారు.

 

హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో హృదయ సంబంధిత సమస్యతో పోరాడుతూ ఈరోజు ఉదయం 9 గంటల 45 నిమిషాలకు చంద్రమోహన్(82) కన్నుమూశారు.

సోమవారం చంద్రమోహన్ అంత్యక్రియలు

హైదరాబాద్‌లోని ఫిల్మ్‌నగర్‌లో గల నివాసానికి చంద్రమోహన్ పార్థీవదేహన్ని తరలించారు. అమెరికాలో ఉన్న చిన్న కుమార్తె మధుర మీనాక్షి సోమవారం ఇండియాకు చేరుకోనున్నారు. ఆమె వచ్చిన అనంతరం అంత్యక్రియలు నిర్వహిస్తామని చంద్రమోహన్ మేనల్లుడు, ప్రముఖ నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ వెల్లడించారు. నాలుగేళ్ల నుంచి చంద్రమోహన్ గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్నారని.. ఆ క్రమంలో కిడ్నీలపైనా ప్రభావం పడిందని తెలిపారు. అలాంటి పరిస్థితుల్లో  శనివారం ఉదయం ఆయన సొమ్మసిల్లి పడిపోయారు. దీంతో 8 గంటల ప్రాంతంలో అపోలో ఆసుపత్రికి తరలించినట్లు ఆయన పేర్కొన్నారు. చంద్రమోహన్ భౌతికకాయానికి పలువురు సినీ ప్రముఖులు నివాళి అర్పించారు. సినీ, రాజకీయ ప్రముఖులు ట్విట్టర్ ద్వారా ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.

ప్రభుత్వ ఉద్యోగం వచ్చినా.. సినిమాల వైపే పయనం

చంద్రమోహన్ అసలు పేరు మల్లంపల్లి చంద్రశేఖర్ రావు. 1943 మే 23 కృష్ణా జిల్లాలోని పమిడిముక్కలలో ఆయన జన్మించారు. మేడూరులో పాఠశాల చదువు పూర్తయ్యాక బాపట్లలో డిగ్రీ పూర్తీ చేశారు. ఆ తర్వాత ఆయనకు అగ్రికల్చర్ ఆఫీసర్‌గా ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది. కొన్ని రోజులు జాబ్ చేసిన తర్వాత… సినిమాలపై ఆసక్తితో చెన్నై ట్రైన్ ఎక్కాడు. ఆ క్రమంలోనే బీఎన్. రెడ్డి తెరకెక్కించిన రంగులరాట్నం సినిమాతో 1966లో తెరంగేట్రం చేశారు. దివంగత దర్శకుడు కళాతపస్వీ కే. విశ్వనాథ్ ఈయనకు వరసకు అన్న అవుతారు. చంద్రమోహన్ భార్య రచయిత్రి. పేరు జలంధర్. వీరికి ఇద్దరు కుమార్తెలు.. మాధవి, మధుర మీనాక్షి ఉన్నారు. మధుర మీనాక్షి అమెరికాలో సైకాలజిస్టుగా స్థిరపడ్డారు. మాధవి చెన్నైలో నివాసం ఉంటున్నారు. ఇక చంద్రమోహన్ హీరోగానే కాకుండా కమెడియన్.. సహాయనటుడిగానూ ఆయన విభిన్న పాత్రలు పోషించారు. పదహారేళ్ల వయసు, ‘అల్లూరి సీతారామరాజు’, ‘సిరి సిరి మువ్వ’,‘తల్లిదండ్రులు’, ‘సంబరాల రాంబాబు’, ‘జీవన తరంగాలు’, పక్కింటి అమ్మాయి’, ‘రాధా కల్యాణం’, ‘ఆత్మీయులు’, ‘గంగామంగా’, ‘సీతా కల్యాణం’, ‘శుభోదయం’, ‘ఇంటి గుట్టు’, ‘సువర్ణ సుందరి’, ‘ఆఖరి పోరాటం’ ‘ఆదిత్య 369’, ‘పెద్దరికం’, ‘గులాబి’, ‘చంద్రలేఖ’, ‘ఇద్దరు మిత్రులు’, ‘7జీ బృందావన్ కాలనీ’, ‘ఢీ’, ‘కింగ్‌’, ‘లౌఖ్యం’ వంటి చిత్రాలతో ఫుల్ ఫేమస్ అయ్యారు.

 అవార్డులు
చంద్రమోహన్‌ నటనకు గానూ ఫిలింఫేర్‌, నంది అవార్డులు అందుకున్నారు. ‘పదహారేళ్ల వయసు’, ‘సిరి సిరి మువ్వ’ చిత్రాల్లో ఆయన అభినయానికి గుర్తింపుగా ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్‌ అవార్డులు దక్కాయి. 1997లో చందమామ రావే సినిమాకు గానూ ఉత్తమ హాస్యనటుడిగా.. 2005లో అతనొక్కడే సినిమాకు ఉత్తమ సహాయ నటుడిగా నంది అవార్డులు కైవసం చేసుకున్నారు. 55 ఏళ్ల సినీ కెరీర్‌లో 932 పైగా సినిమాల్లో నటించారు. 2017లో గోపిచంద్ హీరోగా వచ్చిన ఆక్సిజన్ సినిమాలో చివరగా కనిపించారు.

చంద్రమోహన్.. సినీ సెంటిమెంట్‌కు కేరాఫ్ అడ్రస్

సెంటిమెంట్స్ విపరీతంగా నమ్మే టాలీవుడ్‌లో ఓ వెలుగు వెలిగారు చంద్రమోహన్. చాలా మంది ఆయనను ఓ సెంటిమెంట్‌గా ఫీలయ్యేవారు. ముఖ్యంగా హీరోయిన్ల విషయంలో చంద్రమోహన్ సెంటిమెంట్ అందరికీ తెలిసిందే. అతిలోక సుందరిగా దేశవ్యాప్తంగా స్టార్ హోదా సంపాదించిన శ్రీదేవి ఆయన సినిమాతోనే హీరోయిన్ అయ్యారు. ఆ తర్వాత ఆమె కెరీర్ ఓ రేంజ్‌లో దూసుకుపోయింది. జయప్రద, జయసుధ, విజయశాంతి వంటి వారికి సినీకెరీర్ ప్రారంభంలో చంద్రమోహన్ సినిమాలతోనే క్రేజ్ వచ్చింది. హీరోయిన్సే కాదు.. నిర్మాతలకు, సినీ ప్రముఖులకు చంద్రమోహన్ సెంటిమెంట్. ఆయన చేతితో డబ్బు అందుకుంటే అన్నిరకాలుగా కలిసొస్తుందనే నమ్మకం చాలామందికి ఉండేది. జనవరి 1 వచ్చిందంటే చాలు.. ఆయన ఇంటిముందు జనాలు క్యూ కట్టేవారు. ఆయన చేతితో కనీసం ఒక్క రూపాయి అయినా అందుకునేందుకు తహతహలాడేవారు.

అలా అందుకుంటే ఏడాది అంతా బాగుంటుందనేది వాళ్ల నమ్మకం. నటుడిగా ఫుల్ బిజీ ఉన్న చంద్రమోహన్.. 80వ దశకంలో సినిమాల ఓపెనింగ్స్‌కు ప్రత్యేక అతిథి. చంద్రమోహన్ క్లాప్ కొడితే సినిమా పక్కా హిట్ అనే ఫీలింగ్ అందరిలోనూ ఉండేది. వాటిల్లో చాలా సినిమాలు హిట్ అయ్యాయి కూడా. ఇక చంద్రమోహన్‌కు మాత్రం డబ్బు కలిసి రాలేదు. 932 సినిమాలకు పైగా నటించిన ఆయన ఒకదశలో రెండు చేతులా సంపాదించారు. అదే  రేంజ్‌లో ఆస్తులు కూడబెట్టారు.. కానీ కాలక్రమేణా వాటిని నిలబెట్టుకోలేకపోయారు. ఆరోజుల్లో చెన్నైలో 5 ఎకరాల స్థలం కొన్నారు. అయితే దాన్ని చూసుకునే వాళ్లు లేక చాలా తక్కువ రేటుకు ఆయన దాన్ని అమ్ముకోవాల్సి వచ్చింది. ఇప్పుడు ఆ భూమి ఖరీదు దాదాపు రూ.200 కోట్లు ఉండొచ్చని అంచనా. ఇటు హైదరాబాద్‌లో ఉన్న 15 ఎకరాల ద్రాక్ష తోటను చంద్రమోహన్ అమ్ముకున్నారు.

అయితే 2006లో రాఖీ సినిమా తర్వాత చంద్రమోహన్‌కు బైపాస్ సర్జరీ జరిగింది. దువ్వాడ జగన్నాథమ్ చిత్ర సమయంలోనూ ఆరోగ్యపర సమస్యలు ఎదుర్కొన్నారు. గత కొన్నాళ్లుగా షుగర్‌తో బాధపడుతున్న ఆయనకు కిడ్నీ డయాలసిస్ జరిగింది. ఈ క్రమంలో గుండె సమస్యలతో పోరాడుతూ ఆయన శనివారం ఉదయం తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. దీంతో ఆయన సొంతూరు పమిడిముక్కలలో విషాదఛాయలు అలుముకున్నాయి.

 

 

 

 

 

RELATED NEWS
- Advertisment -spot_img

LATEST NEWS