కళ్లు మూసుకుని తెరిచే లోగా ఐదు సంవత్సరాలు పూర్తవుతాయని, ఆ తర్వాత మళ్లీ వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వమే వస్తుందని మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి చెప్పారు. తెలుగు దేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీలు గెలిచిన తర్వాత ప్రస్తుతం హనీమూన్ ఎంజాయ్ చేస్తున్నారన్నారు. ఎమ్మెల్సీలతో జగన్ తన కార్యాలయంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎన్నికల ఫలితాలు శకుని పాచికల మాదిరిగా ఉన్నాయని, ఈవీఎంలపై దేశవ్యాప్తంగా చర్చ జరగాలని అన్నారు. ప్రస్తుతం తెలుగు దేశం, జనసేన, భారతీయ జనతా పార్టీల హనీమూన్ నడుస్తోందని, వారికి మరికొంత సమయం ఇస్తామని తెలిపారు. 40 శాతం ప్రజలు వైఎస్సార్ కాంగ్రెస్ వైపే ఉన్నారని, అధికార పార్టీల ప్రలోభాలకు లొంగొద్దని సూచించారు.

