ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు గడిచిందని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఈ రోజు ఆంధ్రప్రదేశ్ విభజన జరగి పూర్తిగా పదేళ్లు అయిన సందర్భంగా ఏపీ పరిస్థితులు దశాబ్ద ఘోషగా మారిపోయాయని వ్యాఖ్యానించారు. తెలంగాణలో రాష్ట్రావిర్భావ దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నప్పటికీ, ఏపీలో పరిస్థితి మరింత దిగజారిందని విమర్శించారు. రానున్న ఎన్నికల ఫలితాలు ఎవరి వైపుకు తేలినా, ఆంధ్రప్రదేశ్ విభజన సమస్యలను పరిష్కరించడం అవసరమని ఉండవల్లి అభిప్రాయపడ్డారు. ఏపీకి రావాల్సిన రూ. 1.42 లక్షల కోట్లలో 58 శాతం ఇంకా తెలంగాణ ఇవ్వలేదని ఆరోపించారు. ఏపీకి రావాల్సింది ఇవ్వాలని జాతీయ నేతలకు సూచించారు. అయితే, గత పదేళ్లలో ఏ ప్రభుత్వం కూడా ఏపీ రాష్ట్ర ప్రయోజనాలను సరిగా కాపాడలేకపోయిందని విమర్శించారు. పోలవరం ప్రాజెక్టు పరిస్థితి ఇప్పటికీ అగమ్యగోచరంగా ఉందని అన్నారు. కొత్తగా ఎన్నికైన ప్రభుత్వం ఏపీ పరిస్థితిని మార్చేందుకు కృషి చేయాలని ఉండవల్లి ఆకాంక్షించారు.