వివేకానందరెడ్డి హత్యకేసు వెనక ఓ జంట ఉందని, దర్యాప్తు మరింత లోతుగా జరిగితే ఆ విషయం బయటకు వస్తుందని బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. హత్యకేసును సీబీఐ 90 శాతం ఛేదించిందన్న ఆయన మిగిలిన 10 శాతం పూర్తి చేయించి అసలు హంతకులను జైలుకు పంపుతామని హెచ్చరించారు. ఈ ఎన్నికల్లో జమ్మలమడుగు నుంచి బీజేపీ ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆదినారాయణరెడ్డి నిన్న విలేకరులతో మాట్లాడారు. ఇప్పటివరకు రాష్ట్రంలో భారతీరెడ్డి రాజ్యాంగం నడిచిందని, ప్రజలకు 25 శాతం డబ్బులు పంచిన జగన్, మిగతావి తన ఖాతాలో వేసుకున్నారని ఆరోపించారు. అసెంబ్లీ ప్రారంభం కాగానే వివేకా హత్య కేసుతోపాటు కోడికత్తి కేసు విషయాన్ని కూడా ప్రస్తావిస్తానని ఆదినారాయణరెడ్డి తెలిపారు.