Monday, December 23, 2024
Homenewsఎన్నికలప్పుడే ఎస్సీ వర్గీకరణ తెరపైకి.. కమిటీకి ప్రధాని ఆమోదం.. అసలేంటి దీని కథ?

ఎన్నికలప్పుడే ఎస్సీ వర్గీకరణ తెరపైకి.. కమిటీకి ప్రధాని ఆమోదం.. అసలేంటి దీని కథ?

 

కరస్పాండెంట్ 
వర్డ్ ఆఫ్ ఇండియా

షెడ్యూల్డ్ కులాలను ఏ, బీ, సీ, డీలుగా వర్గీకరించాలనే డిమాండ్‌తో 1994లో ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా ఈదుమూడిలో దండోరా పేరుతో మొదలైందే ఈ ఉద్యమం. ఎస్సీలకు వర్తించే రిజర్వేషన్ ఫలాలను మొత్తం ఒక సామాజిక వర్గమే అనుభవిస్తుందని అందువల్ల మాదిగ, వాటి ఉపకులాలు అన్ని రంగాల్లో వెనకబడిపోతున్నాయనే కారణంతోనే ఈ పోరాటం మొదలైంది. ఈ డిమాండ్‌ను ముందుకు తీసుకొస్తూ జులై 7న మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో 20 మంది యువకులు ఈ ఉద్యమాన్ని తెరపైకి తీసుకొచ్చారు. అనంతరం ఐదారేళ్లలోనే రాష్ట్రమంతటా ఉద్యమం పాకింది. రాష్ట్ర విభజన, న్యాయపరమైన, చట్టపరమైన, సాంకేతిక పరిణామాలతో ఎస్సీ వర్గీకరణ డిమాండ్ అంశంపై ఈనాటీకి ఓ క్లారిటీ రాలేదు.

ఎన్నికలప్పుడే ఎస్సీ వర్గీకరణ తెరపైకి.. కమిటీకి ప్రధాని ఆమోదం.. అసలేంటి దీని కథ?

తాజాగా తెలంగాణ సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మళ్లీ ఈ డిమాండ్‌పై ఎమ్మార్పీఎస్ గళం గట్టిగా వినిపించింది. ఎస్సీ వర్గీకరణకు మద్దతిచ్చిన పార్టీకే తమ మద్ధతుంటుందని మందకృష్ణ మాదిగ ప్రకటించారు. ఇలాంటి తరుణంలో మాదిగలకు తమ మద్దతుంటుందని బీజేపీ ముందుకొచ్చింది. ఈ క్రమంలో శనివారం సికింద్రాబాద్‌లోని పరేడ్‌గ్రౌండ్స్‌లో నిర్వహించిన మాదిగ విశ్వరూప సభలో.. ఎస్సీ వర్గీకరణపై కమిటీ వేస్తామని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించడం చర్చానీయాంశమైంది. మూడు దశాబ్దాల ఈ పోరాటం తమను కదిలించిందని ప్రధాని పేర్కొనడం మాదిగలకు ఎస్సీ వర్గీకరణపై మళ్లీ ఆశలు రేపుతున్నాయి.

 

ఎందుకు ఈ అసమానతలు?

ఎస్సీలకు మొత్తంగా 15శాతం రిజర్వేషన్ కోటా ఉంది. ఇందులో ఎక్కువ మొత్తంలో మాలలే లబ్ధి పొందుతున్నారనే చర్చ 1970వ దశకంలోనే మొదలైందని మానవహక్కుల కార్యకర్త బాలగోపాల్ 2000 సంవత్సరంలో రాసిన ఓ వ్యాసంలో పేర్కొన్నారు. ఈ వివాదం 1972 నుంచి మొదలైంది. ముఖ్యమంత్రులు మారిన ప్రతిసారీ మాదిగ నాయకులు వారిని కలవడం.. ఈ అంశంపై విజ్ఞప్తులు అందజేయడం జరిగేదని అందులో రాసుకొచ్చారు. జనాభాపరంగా కూడా మాలలకన్నా మాదిగల సంఖ్య ఎక్కువే.

ఎన్నికలప్పుడే ఎస్సీ వర్గీకరణ తెరపైకి.. కమిటీకి ప్రధాని ఆమోదం.. అసలేంటి దీని కథ?అయినప్పటికీ విద్యా ఉద్యోగావకాశాల్లో మాదిగలు తక్కువ స్థాయిలో ఉన్నారని జస్టిస్ రామచంద్రరాజు కమిషన్ 1996లో స్పష్టం చేసింది. దాదాపు రిజర్వేషన్ ద్వారా ఎస్సీలకు లభించిన ఉద్యోగాల్లో ఆనాటికి 80శాతం మాలలకు, దాని ఉపకులాలకు దక్కాయి. మాదిగ, దాని ఉపకులాలకు దక్కింది కేవలం 20 శాతమేనని ఆనాడే మందకృష్ణ గళం విప్పారు. రాజకీయాల్లోనూ అంతే. 1996 నాటికి 39 సీట్లు ఎస్సీలకు కేటాయించగా.. వాటికి ఎన్నికైన వారిలో 30 మంది మాలలే ఉన్నారు. మిగతా 9 మంది మాత్రమే మాదిగలు. ఆరు ఎంపీ స్థానాలు ఎస్సీలకు రిజర్వ్ అయితే.. అందులో ఒకే స్థానం మాదిగలకు దక్కిందని.. మిగిలిన ఎంపీలందరూ మాలలే అని ఆయన ఆవేదన చెందారు. అటు సమాజంలోనూ అన్ని కులాల్లో ఉన్నట్లే ఎస్సీ వర్గాల్లోనూ అసమానతలున్నాయి.

అంటరానితనాన్ని, వివక్షను అనుభవించిన ఈ సామాజికవర్గాల్లోనూ ఎక్కువ తక్కువలున్నాయి. మాదిగలను మాలలు తక్కువగా చూస్తారు. అలాగే.. మాదిగలు కొన్ని ఉపకులాల వారిని తక్కువగా చూస్తుంటారు. ఈ నేపథ్యంలో ఎస్సీ కులాలను ఏ, బీ, సీ, డీ గ్రూపులుగా విభజించి.. ఆయా కులాల జనాభా నిష్పత్తి ప్రకారం 15శాతం రిజర్వేషన్ కోటాలను పంచాలని ఎమ్మార్పీఎస్ 1994 నుంచి డిమాండ్ చేస్తూ వస్తోంది.

ఎన్నో.. అభ్యంతరాలు

ఎస్సీల వర్గీకరణ డిమాండ్‌ను పీవీ. రావు ఆధ్వర్యంలో ఏర్పాటైన మాల మహానాడు వ్యతిరేకిస్తోంది. ఇది ప్రాంతీయ వ్యత్యాసమే తప్ప.. మాదిగలకు అన్యాయం జరగలేదని వాదిస్తోంది. మాదిగలకు చర్మకార వృత్తి ఉందని.. ప్రభుత్వాలు ఆదుకునే ఛాన్స్ ఉందని వివరించింది. కానీ.. మాలలకు ఆ అలాంటి అవకాశమే లేదని గట్టిగా మాట్లాడుతూ వస్తోంది. ఇది ఎస్సీల ఐక్యతను దెబ్బ తీసే కుట్రగా తమ వాణి వినిపిస్తోంది.

వర్గీకరణ అమలైంది.. ఆగిపోయింది.. సుప్రీం కోర్టులో కేసు

ఎట్టకేలకు 2000 సంవత్సరంలో ఏపీ ప్రభుత్వం ఎస్సీలను వర్గీకరిస్తూ రిజర్వేషన్ల హేతుబద్ధీకరణకు చట్టం చేసింది. ఈ చట్టాన్ని అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది. రాష్ట్రపతి కే.ఆర్. నారాయణ్ ఆమోదంతో ఎస్సీలను ఏ, బీ, సీ, డీ గ్రూపులుగా విభజించారు. వెనుకబాటుతనం, జనాభా నిష్పత్తి ప్రకారం ఆయా కులాలకు రిజర్వేషన్ కోటాలను కేటాయించారు. కానీ.. 2004 నవంబర్‌లో సుప్రీం కోర్టు ఈ చట్టాన్ని కొట్టి వేసింది. ఈ అంశంలో రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం లేదని స్పష్టం చేయడంతో ఎస్సీ వర్గీకరణకు చుక్కెదురైంది. దీంతో లొల్లి మళ్లీ మొదటికి వచ్చింది.

ఎన్నికలప్పుడే ఎస్సీ వర్గీకరణ తెరపైకి.. కమిటీకి ప్రధాని ఆమోదం.. అసలేంటి దీని కథ?అప్పుడు.. ఇప్పుడు.. అలాగే మిగిలిపోయింది

మాదిగల ఒత్తిళ్లతో 2004లో వైయస్. రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం రాజ్యంగ సవరణ కోరుతూ అసెంబ్లీలో తీర్మానం చేసింది. దీంతో సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ ఉషా మెహ్రా కమిషన్ ఏర్పాటు చేసింది. 2008లో ఆ కమిషన్ మంత్రి మీరాకుమార్‌కు నివేదిక సమర్పించింది. రాజ్యాంగంలోని 314కు సవరణ చేయాలని సూచించింది. ఆ ఆర్టికల్‌లో 3వ క్లాజ్‌ను చేర్చడం ద్వారా.. రాష్ట్ర అసెంబ్లీలు ఏకగ్రీవ తీర్మానం చేసిన సందర్భంలో కుల వర్గీకరణను పార్లమెంట్ ఆమోదించవచ్చని సిఫార్సు చేసింది. అయితే దీన్ని కేంద్రం ఎప్పుడూ అంత సీరియస్‌గా తీసుకోలేదు.

అయితే.. 2014లో తాము అధికారంలోకి వస్తే.. 100 రోజుల్లోనే ఎస్సీ వర్గీకరణ చేస్తామని హామీ ఇచ్చిన బీజేపీ.. ఇప్పటి వరకూ ఆ ఊసే ఎత్తలేదు. తాజాగా మళ్లీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రధాని మోదీ వచ్చి స్వయంగా ఎస్సీ వర్గీకరణపై కమిటీ వేస్తామని ప్రకటించడం గమనించదగిన విషయం. అయితే ఈ సమస్యకు పరిష్కరం లేకుండా ఎల్లకాలం కొనసాగిస్తేనే రాజకీయ పార్టీలకు లాభమనే వాదన కూడా విశ్లేషకుల నుంచి బలంగా వినిపిస్తోంది.

కాగా.. అవమానానికి సూచికగా లేదా తిట్టుగా మాత్రమే వినిపించే మాదిగ అనే పదాన్ని ఆ కులస్థుల పేరులో సగర్వంగా నిలుపుకునే ధైర్యాన్ని ఈ ఉద్యమం సాధించింది. తమ కులం పేరు చెప్పుకోవడానకి కూడా ఇబ్బంది పడేవాళ్లు దాన్ని బాహాటంగా చెప్పుకునే స్థాయికి ఈ ముప్పై ఏళ్ల ఉద్యమం సహకరించిదనటంలో ఎలాంటి సందేహం లేదని చెప్పొచ్చు. మొత్తానికి వర్గీకరణ అమలైన నాలుగేళ్ల కాలానికే.. మాదిగల జీవితాల్లో వచ్చిన మార్పులు అనేకం. అలాంటిది పూర్తిగా వర్గీకరణ అమలైతే తమ జీవన విధానమే మారిపోతుందని ఎదురుచూస్తున్న మాదిగలకు తాజాగా బీజేపీ ఇచ్చిన హామీ మళ్లీ వర్గీకరణపై ఊపిరిపోస్తోంది.

RELATED NEWS
- Advertisment -spot_img

LATEST NEWS