Friday, November 22, 2024
HomeAP Elections: ఈ ఐదు అంశాలు.. అడ్డుప‌డ‌తాయా? ఆదుకుంటాయా?

AP Elections: ఈ ఐదు అంశాలు.. అడ్డుప‌డ‌తాయా? ఆదుకుంటాయా?

లోక్ స‌భ ఎన్నిక‌ల్లో(AP Elections) అటు ఎన్డీఏ (NDA) కూట‌మిని కానీ.. ఇటు వైస్సార్సీపీ (YSRCP) కానీ గెలవాలంటే ప్ర‌జ‌ల మ‌ద్ద‌తుతో పాటు అదృష్టం కూడా ఉండాలి. అందులోనూ ఇప్పుడు ఇరు వ‌ర్గాల నుంచి ఉన్న కేసులు, స‌మ‌స్య‌లు వారికి కీల‌కం కాబోతున్నాయి.

ఈసారి ఎన్నిక‌ల్లో కీల‌కపాత్ర పోషించే 5 అంశాలివే..

ప్రస్తుతం ఆంధ్ర‌ప్ర‌దేశ్ విష‌యంలో ఏద‌న్నా కీల‌క విష‌యం ఉందంటే అది ప్ర‌త్యేక హోదా. పోయిన సారి ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ తాను అధికారంలోకి వ‌స్తే ప‌దేళ్ల పాటు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు ప్ర‌త్యేక హోదా ఇస్తాన‌ని మాటిచ్చారు.

ప్రస్తుతం ఆ మాట‌ను మ‌ర‌వ‌డ‌మే కాదు.. మొన్న కేంద్ర‌మంత్రి నిర్మ‌లా సీతారామన్ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు ప్ర‌త్యేక హోదా అవ‌స‌ర‌మే లేద‌ని అన్నారు. దాంతో ఆంధ్రావాసుల ఆశ‌లు అడియాస‌ల‌య్యాయి.

ఇక రెండో విషయం.. అమ‌రావ‌తిని రాజ‌ధానిని చేస్తారా లేదా జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చెప్పిన‌ట్లు వైజాగ్ రాజ‌ధాని అవుతుందా? మూడో విష‌యం.. జ‌గ‌న్‌కు సొంత బాబాయి అయిన వైఎస్. వివేకానంద రెడ్డి హ‌త్యోదంతం.

నాలుగో విష‌యం సీఎం జ‌గ‌న్ విష‌యంలో జ‌రిగిన కోడి క‌త్తి కేసు. ఇక ఐదో అంశం చంద్ర‌బాబు నాయుడు మాస్ట‌ర్ మైండ్‌గా వ్య‌వ‌హ‌రించిన ప‌లు స్కాంలు.

ఇప్పుడు ఎన్నికల(AP Elections) వేళ ప్ర‌జ‌లు ఈ ఐదు అంశాల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుని ఓటు ఎవ‌రికి వేయాలో నిర్ణ‌యించుకుంటారు. 2014లో మన్మోహ‌న్ సింగ్ ప్ర‌ధానిగా ఉన్న‌ప్పుడు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు ప్ర‌త్యేక హోదా ఇస్తాన‌న్నారు.

అప్పుడు వెంక‌య్య నాయుడు ఐదేళ్లు కాదు ప‌దేళ్లు ప్ర‌త్యేక హోదా ఇవ్వాల‌ని సూచించారు. 14వ ఆర్ధిక క‌మిష‌న్ అంశాన్ని చూపించి తాము ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు ప్ర‌త్యేక హోదా ఇవ్వ‌లేమ‌ని NDA ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక వెల్ల‌డించింది.

ప్ర‌త్యేక హోదాకు బదులు ప్ర‌త్యేక ఆర్ధిక సాయం ప్ర‌క‌టించింది. ప్ర‌త్యేక హోదా నువ్వు తీసుకురాలేదంటే నువ్వు తీసుకురాలేద‌ని వైస్సార్సీపీ (YSRCP).. తెలుగుదేశం పార్టీ ఒక‌రిపై ఒక‌రు నిందలు వేసుకున్నారు.

ఇక రాజ‌ధాని విష‌యంలో అమ‌రావ‌తిని కాకుండా వైజాగ్‌ను ప్ర‌క‌టించాల‌ని సీఎం జ‌గ‌న్ అంటున్నారు. పైగా ఈసారి ఎన్నిక‌ల్లో గెలిచాక వైజాగ్‌లోనే త‌న ప్ర‌మాణ స్వీకారం ఉంటుంద‌ని ప్ర‌క‌టించారు.

రాజ‌ధాని మార్పును కేంద్రం ఒప్పుకోలేదు. అయితే.. అమ‌రావ‌తిలో ఉన్న హైకోర్టును మాత్రం క‌ర్నూలు మార్చేందుకు అంగీక‌రించ‌డం గ‌మ‌నార్హం.

ఇక జ‌గ‌న్ విష‌యంలో కీల‌కంగా ఉన్న అంశం వైఎస్ వివేకానంద రెడ్డి హ‌త్యోదంతం. ఈ అంశంలో ఆయ‌న సొంత చెల్లెలు వైఎస్ ష‌ర్మిళ‌, వివేకా కూతురు సునీత రెడ్డి క‌లిసి గ‌ట్టిగా పోరాడుతున్నారు.

త‌న అన్నకు ఈసారి ఎన్నికల్లో(AP Elections) ఓటు వెయ్యొద్ద‌ని సునీత మీడియా ముందు చెప్ప‌డం సంచ‌న‌లంగా మారింది. ఈ కేసు విష‌యంలో జ‌గ‌న్ ప్ర‌ధాన నిందితుడైన అవినాష్ రెడ్డిని కాపాడుతున్నాడ‌ని క‌డ‌ప నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌లు కూడా న‌మ్ముతున్నారు.

ఇక చంద్ర‌బాబు నాయుడు విషయంలో స్కిల్ డెవ‌ల‌ప్‌మెంట్ కేసు, అమ‌రావ‌తి భూముల అలైన్‌మెంట్ కేసులు ఉన్నాయి.

స్కిల్ డెవ‌ల‌ప్‌మెంట్ కేసులో చంద్ర‌బాబు నాయుడు దాదాపు రెండు నెల‌ల పాటు రాజ‌మండ్రి సెంట్ర‌ల్ జైల్లో ఉన్నారు. ఇప్పుడు ఆయ‌న బెయిల్‌పై బ‌య‌ట తిరుగుతున్నారు.

కాబట్టి.. ఈసారి ఎలక్షన్లలో(AP Elections) ఈ ఐదు కీల‌క అంశాల‌ను ప్ర‌జ‌లు కచ్చితంగా ప‌రిగ‌ణించే అవ‌కాశం ఉంది. అందుకే జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి బ‌స్సు యాత్ర‌.. చంద్ర‌బాబు నాయుడు ప్ర‌జాగ‌ళం యాత్ర‌ల‌తో ప్ర‌జ‌ల‌ను త‌మ‌వైపుకు తిప్పుకోవాల‌ని చూస్తున్నారు. మ‌రి ప్ర‌జ‌లు ఎవ‌రిని న‌మ్మి ఓటేస్తారో వేచి చూడాల్సిందే.

READ LATEST TELUGU NEWS: సామాన్యులకే ఛాన్స్.. జగన్ వ్యూహం ఫలిస్తుందా?

RELATED NEWS
- Advertisment -spot_img

LATEST NEWS