ఏపీలో ఆర్టీసీ బస్సు బీభత్సం
By CORRESPONDENT
RTC Bus Accident : ఆంధ్రప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కాకినాడ జిల్లాలోని ప్రత్తిపాడు హైవేపై ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. లారీ టైర్‌కు పంక్చర్ వేస్తున్న వారిపైకి ఓ సూపర్ లగ్జరీ బస్సు దూసుకెళ్లింది. ఈ ఘటనలో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందారు.
ప్రత్తిపాడు మండలంలోని పాదాలమ్మ గుడి వద్ద సోమవారం తెల్లవారుజూమున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. 16వ నెంబర్ జాతీయ రహదారిపై ఓ లారీ టైరు పంక్చర్ అయింది. దీంతో టైరు మార్చడం కోసం డ్రైవర్, క్లీనర్ వాహనాన్ని రోడ్డు పక్కకు ఆపారు. వీరికి సహయంగా మరో లారీకి చెందిన డ్రైవర్, క్లీనర్‌లు కూడా వచ్చారు. వీరు నలుగురు కలిసి లారీ టైర్ పంక్చర్ వేస్తున్నారు. ఈ క్రమంలో విశాఖ నుంచి విజయవాడ వెళ్తున్న ఓ ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు వేగంతో అదుపుతప్పింది. డ్రైవర్ నియంత్రించ లేకపోవడంతో వీరిపైకి దూసుకెళ్లింది. దీంతో ఆ నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు.
ప్రమాదం జరిగిన అనంతరం బస్సు డ్రైవర్ వాహనాన్ని ఆపకుండా జారుకున్నాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో రాజమండ్రి సమీపంలోని మొమ్మూరు వద్ద బస్సును ఆపి డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ యాక్సిడెంట్‌లో చనిపోయినవారిలో ముగ్గురు బాపట్ల జిల్లా నక్కబొక్కలపాలెంకు.. ఒకరు ప్రత్తిపాడుకు చెందినవారని తెలిపారు. మృతులను దాసరి ప్రసాద్, దాసరి కిషోర్, బండి నాగయ్య, దిమ్మిరి రాజులుగా గుర్తించామని వెల్లడించారు. మృతదేహాలను ప్రత్తిపాడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.ే ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
READ ALSO: రోడ్డు ప్రమాదంలో ఎమ్మెల్సీ మృతి