ఇప్పుడు దేశంలోనే పవర్ ఫుల్ ‘ఎన్నికల కోడ్’ !!(Election Code) ఈ టైంలో సీఎంలు కూడా ఆపద్ధర్మ సీఎంలాగే వ్యవహరించాల్సి ఉంటుంది. ఇక ఓటర్లను ప్రభావితం చేసే నిర్ణయాలను తీసుకోకూడదు. పాలన అంతా అంతర్గతంగా జరగాలే కానీ పబ్లిసిటీ చేసుకోకూడదు.
ఏపీ అయినా.. తెలంగాణ అయినా.. సీఎంల విషయంలో ఇదే రూల్ !! ఎన్నికల సమయంలో పోలింగ్, కౌంటింగ్‌ను పారదర్శకంగా, సక్రమంగా, శాంతియుతంగా నిర్వహించేందుకు భారత ఎన్నికల సంఘం కొన్ని నిబంధనలను రూపొందించింది. వీటినే ఎలక్షన్ కోడ్ అంటారు.
రాజకీయ పార్టీల అధికార, ఆర్థిక దుర్వినియోగాన్ని అరికట్టడమే ఎన్నికల కోడ్(Election Code) ప్రధాన లక్ష్యం. ఇతర నిబంధనలు ఎలా ఉన్నా అధికారంలో ఉన్న వారు ఓటర్లను ప్రభావితం చేయకుండా.. దుర్వినియోగం చేయకుండా కోడ్ ను పటిష్ఠంగా అమలు చేస్తారు.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 324 ప్రకారం.. ఎన్నికల షెడ్యూల్ విడుదలైనప్పటి నుంచి ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు ఎన్నికల కోడ్ అమలులో ఉంటుంది. అప్పటి వరకూ రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు ఎన్నికల ప్రవర్తనా నియమావళిని తప్పక పాటించాల్సి ఉంటుంది.
> ఎన్నికల కోడ్(Election Code) ఉన్న టైంలో ప్రధానమంత్రి మినహా ఎవరికీ సెక్యూరిటీ, ప్రోటోకాల్ ఉండేందుకు వీల్లేదు
> ముఖ్యమంత్రులుగా ఉన్న రేవంత్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డిలకు కూడా ప్రోటోకాల్ ఉండదు. వారు సాంకేతికంగా ఆ పదవిలో ఉంటారు. ఆ పదవితో పెత్తనం చేయడానికి అవకాశం ఉండదు. ప్రజల డబ్బులు ఖర్చు పెట్టి ప్రచారం చేసుకోకూడదు.
> ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి కానీ జగన్మోహన్ రెడ్డి కానీ నిర్ణయాలు తీసుకోలేరు.
> ఎన్నికల కోడ్ టైంలో సీఎంగా ఉన్నవారు కీలక శాఖలవారీగా సమీక్షలు కూడా చేయకూడదు. ఏదైనా సరే ఎన్నికల తర్వాతే!!
> ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యాక అభ్యర్థులు ఆర్థిక గ్రాంట్లు ప్రకటించడం కోడ్ ఉల్లంఘన అవుతుంది.
> ఓటర్లను ప్రభావితం చేసే విధంగా ప్రభుత్వ, ప్రభుత్వ అనుబంధ సంస్థలలో తాత్కాలిక నియామకాలు చేపట్టకూడదు.
> ఎన్నికల్లో పోటీ చేసే మంత్రులు లేదా అభ్యర్థులు తమ పరిధిలోని నిధులను మంజూరు చేయకూడదు.
> రవాణా, యంత్రాలు, భద్రతా సిబ్బందితో సహా దేనిని ఉపయోగించకూడదు.
> ప్రభుత్వ గెస్ట్ హౌస్‌లు, భవనాలు, ఇతర ప్రభుత్వ వసతులను ఏ రాజకీయ పార్టీ లేదా అభ్యర్థులు ఎన్నికల్లో తమ ప్రయోజనం కోసం ఉపయోగించుకోవడానికి వీలుండదు.
> ప్రభుత్వం నుంచి వ్యక్తులు, సంస్థలకు భూ కేటాయంపులపై ఈసీ అనుమతి కావాల్సిందే.
> సీఎంఆర్ఎఫ్ నిధులు కూడా ఇచ్చేందుకు వీల్లేదు.
> ఎంపీ గానీ, మంత్రి గానీ అధికారిక పర్యటనను, పార్టీ పర్యటనను వేర్వేరుగా ఉండేలా చూసుకోవాలి. రెండింటినీ కలపకూడదు.
> ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు వాటిని ఉల్లంఘించిన రాజకీయ పార్టీలు, నేతలపై దర్యాప్తు చేయడానికి, వారికి శిక్ష విధించేందుకు ఎన్నికల కమిషన్‌కు అధికారం ఉంటుంది..