CM Revanth With PM: కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వైరం కలిగించే పరిస్థితులు ఉంటే రాష్ట్రాభివృద్ధికి ఆటంకమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ (PM Narendra Modi) ఆదిలాబాద్ పర్యటనలో ముఖ్యమంత్రి చేసిన ఈ వ్యాఖ్యలు అందరి దృష్టిని ఆకర్షించాయి.
లోక్‌సభ ఎన్నికలు (Lok Sabha Elections) సమీపిస్తున్న తరుణంలో తెలంగాణలో రాజకీయ సమీకరణాలు ఆసక్తి రేపుతున్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రధాని రాష్ట్రానికి వచ్చినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకున్న ఊసే లేదు. ప్రధాని హోదాలో మోడీకి సరైన స్వాగతం కూడా పలికేది కాదు. కానీ.. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ప్రోటోకాల్ పాటిస్తూ వస్తోంది. ఆదిలాబాద్ విజయ సంకల్ప సభ అందుకు ఉదాహరణగా నిలిచింది. జిల్లాలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించేందుకు వచ్చిన ప్రధాని మోడీకి సీఎం రేవంత్ రెడ్డి సాదర స్వాగతం పలికారు. వీరిద్దరూ ఒకేసభలో పక్కపక్కన కూర్చోని మాట్లాడుకునే దృశ్యాలు అందర్నీ ఆకట్టుకుంటున్నాయి.
ప్రధాని మోడీ ఆదిలాబాద్ జిల్లాలో పలు అభివృద్ధి పనులకు సోమవారం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన రేవంత్ రెడ్డి ఆసక్తికర కామెంట్లు చేశారు. అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం, ప్రాజెక్టులను జాతికి అంకితమిచ్చేందుకు విచ్చేసిన ప్రధానికి అఖండ స్వాగతం పలుకుతున్నామని తెలిపారు.
LIVE: PM Modi inaugurates, dedicates & lays foundation stone of projects in Adilabad, Telangana https://t.co/UIYWqzEI7v
— G Kishan Reddy (Modi Ka Parivar) (@kishanreddybjp) March 4, 2024
రాజకీయాలు ఎన్నికల సమయంలోనేనని.. అభివృద్ధి విషయంలో కాదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సహృద్భావ వాతావరణం ఉండాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. అందుకే ఎలాంటి భేషాజాలకు పోకుండా ప్రధాని, కేంద్రమంత్రులను సైతం కలిశామని వెల్లడించారు. కంటోన్మెంట్ స్థలంపై హక్కులు, టెక్స్‌టైల్స్, స్కై వేల ఏర్పాట్లపై ప్రధాని మోడీ సానుకూలంగా స్పందించినందుకు ధన్యవాదాలు తెలిపారు.
ఇంకా రాజ్యంగబద్ధ పదవుల్లో ఉన్నవారి పట్ల తమ సర్కార్ గౌరవప్రదంగా వ్యవరిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్ మెట్రో, మూసీ పరివాహక ప్రాంత అభివృద్ధికి కేంద్రం సహకరించాలని ప్రధానిని ఈ సందర్భంగా కోరారు. విభజన హామీల మేరకు ఎన్టీపీసీ (NTPC) 4 వేల మెగావాట్ల కరెంట్ ఉత్పత్తి చేయాల్సి ఉందని గుర్తుచేశారు. అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం 1600 మెగావాట్లు మాత్రమే ఉత్పత్తి చేయగలిగిందన్నారు. మిగతా 2400 మెగావాట్లను ఉత్పత్తి చేసేందుకు అన్ని అనుమతులిస్తామని హామీ ఇచ్చారు. ఈ ప్రాజెక్టు వలన తెలంగాణలో వెలుగులు నిండనున్నాయని సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు.
మొత్తానికి సీఎం రేవంత్ రెడ్డి తీరుపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. రాజకీయాలు పక్కనబెట్టి రాష్ట్రాభివృద్ధి కోసం తాపత్రయ పడుతున్నారంటూ పలువురు సోషల్ మీడియా వేదికగా అభిప్రాయపడుతున్నారు.
READ LATEST TELUGU NEWS: వారికి మాత్రమే రూ.500కే గ్యాస్ సిలిండర్!