Tuesday, April 22, 2025
HomeVaranasi Book Review : 'వారణాసి' చుట్టేసి వచ్చినట్టుంది

Varanasi Book Review : ‘వారణాసి’ చుట్టేసి వచ్చినట్టుంది

భక్తి, దేశభక్తి.. విజ్ఞానం కలగలిసిన కాశీ దర్శనం
లలిత, అనపర్తి, తూర్పుగోదావరి జిల్లా.

“వారణాసి” ( Varanasi ) వినోద్ మామిడాల రాసిన చక్కటి యాత్రా విశేషాల ఊహాలతో మనం కాశీని చూసి రావొచ్చు. చిన్నప్పటి నుంచీ నాకు కాశీ వెళ్ళాలనే కోరిక ఉండేది. ఇంట్లో పెద్దవాళ్లను తప్ప మమ్మల్ని తీసుకెళ్ళేవారు కాదు. దానికీ ఓ కారణం ఉంది. వయసు మీరిన తర్వాత వెళ్ళే యాత్ర కాశీగానీ వయసులో ఉండగా వెళ్ళడం దేనికీ? డబ్బులు దండగ అనేవారు. డబ్బులే వృథా మాత్రమే కాకుండా అక్కడ కిక్కిరిసిన జనంలో మేమెక్కడ తప్పిపోతామో అనే భయమూ వాళ్ళను అలా అనేలా చేసేది. ఇక ఆ విషయాన్ని పక్కన పెడితే… శనివారం మధ్యాహ్నం పోస్ట్ మ్యాన్ కాల్ చేయగానే స్కూల్ అవతలికి వెళ్ళి పోస్ట్ తీసుకున్నాను. చాలా రోజుల తర్వాత నా కోసం వచ్చిన బహుమానం కదా చాలా సంతోషంగా అనిపించింది.తెరిచాను.

రెండు పుస్తకాలూ ఇవే… యాత్రా కథనమా? చదవగలనా? బోరింగ్‌గా ఉంటుందేమో..?. ఇలాంటి కొన్ని నెగిటివ్ ఆలోచనల షేడ్స్ నాలో ఉద్భవించాయో… లేదో పఠనాతత్వాన్ని తగ్గించుకోకూడదనే ఉద్దేశమో కానీ సాయంత్రం ఇంటికి చేరగానే చదవడం మొదలెట్టాను.

Varanasi Book Review by writer Lalitha
Varanasi Book Review by writer Lalitha

అసలు భలే అద్భుతంగా రాశారు వినోద్ గారు. సహజంగా నేను నవల తప్పితే.. పెద్దగా కథల పుస్తకాలను కూడా ఆసక్తిగా చదవను. దానికి కారణం కథల పుస్తకాలలో కథ కథకీ మధ్యలో ముగింపు ఉంటుంది. ఇలాగే ఈ వారణాసి యాత్రా పుస్తకంలో కూడా కొన్ని భాగాలున్నాయి. కానీ.. ఏ భాగం దగ్గరా కూడా అస్సలు బోరింగ్ అనిపించలేదు. చదివే కొలదీ కొత్త విషయాలు తెలుస్తున్నాయనే భావన కలిగింది.

వారణాసి వెళ్ళినా కూడా ఇందులో చదివి తెలుసుకున్నన్ని చోట్లకు నేను వెళ్ళలేనేమో… కానీ, రచయిత చెప్పినట్లు “చంద్రశేఖర్ తివారి ఆజాద్ చంద్రశేఖర్‌గా మారి స్వాతంత్ర ఉద్యమంలో తన పాత్ర ప్రారంభించింది వారణాసి నుంచే. బ్రిటిషర్లకు తొత్తులుగా ఉండి మోసం చేస్తున్న పోలీసులపై మన వాళ్ళు రాళ్లు విసిరారు. భక్తి వెల్లివిరిసిన ఈ వారణాసిలోనే ఉద్యమాలూ జరిగాయి. తులసీదాసు రామచరిత మానస్‌ను ఇక్కడే ఎక్కువ భాగం రాశాడు. ఇట్లా కాంతి దీపాలతో వెలిగే కాశీలో ఆధ్యాత్మికతతో పాటు విద్య ఉంది. విద్వత్తు ఉంది. వైవిద్యమూ సంస్కృతీ సంప్రదాయాలూ ఉన్నాయి. చరిత్ర ఉంది. చరిత్రకు సాక్ష్యాలున్నాయి. మతాలున్నాయి మతసామరస్యతా ఉంది.

రాజకీయాలున్నాయి మతకలహాలున్నాయి. శ్రమ ఉంది శ్రమైక జీవనమూ ఉంది
కాశీ కేవలం ఆధ్యాత్మిక క్షేత్రమే కాదు విజ్ఞాన నగరి కూడా. భక్తులకు దైవ భూమి. విద్యార్థులకు ఔత్సాహికులకు పరిశోధనా కేంద్రం. టూరిస్టులకు పర్యాటక ప్రాంతం. అందుకే “తీరిక లేకుండా తిరిగిన తీరని దాహం కాశీ ప్రయాణం”.

ప్రయాణాలు చాలామందికి సాధ్యమే కానీ వాటిని అందరితో పంచుకునే అవకాశం కొంతమందికే దొరుకుతుంది ఆ కొంతమందిలో నేను ఉన్నందుకు సంతోషిస్తున్నాను… అని వినోద్ గారు తొలుత రాసిన మాటల్ని పుస్తకం మొత్తం అయిపోయాక చదువుతూ ఉంటే… ఏదో తెలియని అనుభూతి. ఇప్పటి వరకూ నాకు పరిచయం లేని వ్యక్తి కొత్తగా చాలా వింతగా అనిపించారు. మన మధ్య కొందరుంటారు. వాళ్ళలో ప్రత్యేకత మనం గుర్తించడమే.. ఆలస్యం అవుతూ ఉంటుంది.

మనం చూసిన ఊరు గురించో ప్రదేశాల గురించో… అక్కడి ప్రాంత ప్రాముఖ్యత గురించి సాధారణంగా కూడా గుర్తుపెట్టుకుని చెప్పడం కష్టమే… అలాంటిది.. వారణాసి నుండి కుషీనగర్ వరకూ మొత్తం కళ్ళకు కట్టినట్లు చూపించారు వినోద్ గారు. ఈ వారణాసి పఠనం ముగిసేవరకూ దీన్ని పక్కన పెట్టాలనిపించలేదు. అలా చదివించిన వినోద్ గారిని మెచ్చుకోక తప్పదు మరి. నాకు తెలియని ఎన్నో విషయాలు తెలుసుకున్నాను.

నిజంగానే వారణాసి పఠనం వారణాసి దర్శనంతో సమానమయ్యింది. అక్కడ రుచులు తిన్నంత అభిరుచిగా ఉందిప్పుడు. అక్కడ గాలినీ నేలనూ గంగనూ తాకినంత తృప్తిగా ఉంది. అన్నపూర్ణ దర్శనం కాశీ విశ్వేశ్వరుని దర్శనం చాలా అమోఘంగా అనిపించింది. ఇకపోతే మా ఆడాళ్ళ ముచ్చటైన బనారస్ పట్టుచీరల మీద మక్కువ పెరిగింది… అలాగే బుద్ధుడు తిరిగిన చోటు గురించి తెలిసిన ఆనందమూ నాలుగు సింహాల్లో నాలుగో సింహాన్ని చూసిన ఆశ్చర్యమూ… ఇవన్నీ నాకో కొత్త అనుభూతిని కలిగించాయి.

అలాగే భారత యాత్రా సాహిత్య పితామహుడు రాహుల్ సాకృత్యాయన్ గురించి తెలిసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ యాత్రా ప్రయాణం మొత్తంలో ఇషానీ పరిచయం కూడా చిరస్మరణీయం. పుస్తకం తొలుత అవసరమా అనుకున్న నేను.. ఆఖరులో విజ్ఞానం కోసం ఇలాంటి పుస్తకాలు చదవడం ఎంతో ముఖ్యమని అనుకున్నాను. మనసులోనే రచయితను ఎన్నో సార్లు మెచ్చుకున్నాను. చాలా అభిమానంతో బహుకరించిన వినోద్ గారికి అభినందనలు.

READ LATEST TELUGU NEWS: లక్ష్యదీప్ వెళ్లొద్దాం రండి

RELATED NEWS
- Advertisment -spot_img

LATEST NEWS