బిగ్ బాస్ రియాలిటీ షోతో మరోసారి తెలుగు ప్రేక్షకులకు దగ్గరమైన నటుడు శివాజీ. తాజాగా శివాజీ ఈటీవీలో ప్రసారమయ్యే ‘అలీతో సరదాగా’ టాక్ షోకు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి హోస్ట్ గా వ్యవహరిస్తున్న ప్రముఖ కమెడియన్ అలీని ఉద్దేశించి. నువ్వు ఎన్నికల్లో పోటీ చేస్తున్నావా? అని శివాజీ ప్రశ్నించారు. అయితే అలీ సూటిగా జవాబు చెప్పకుండా… అందరూ బాగానే ఉన్నారు కదా… ఇంకేటి విశేషాలు? అంటూ తనదైన శైలిలో నవ్వుతూ సమాధానం దాటవేసే ప్రయత్నం చేశారు…… అందుకు శివాజీ బదులిస్తూ… నువ్వు ఎన్నికల్లో పోటీ చేయొద్దు అని సలహా ఇచ్చారు…… “రాజకీయ రంగంలో నాకు క్షేత్రస్థాయి అనుభవం ఉంది… పదేళ్ల పాటు సినిమాలకు దూరమయ్యాక ఈ అవగాహన వచ్చింది. రాజకీయాల్లోకి వెళ్లిన వారు డబ్బు ఖర్చు పెట్టాల్సిందే. పెట్టిన డబ్బులు తిరిగి లాక్కొనే సత్తా మనకుండాలి. ఆ తిరిగి తీసుకోవడం కూడా దుర్మార్గంతో కూడుకున్నది. ఆఖరికి ఇసుక, మట్టి వంటి ప్రకృతి వనరులను కూడా దోచుకోవాలి. వివిధ పథకాల్లో వచ్చే డబ్బును ప్రజలకు అందకుండా చేయాలి. అలా నువ్వు చేయగలవా? ఒకరికి పెట్టడం మాత్రమే నీకు తెలుసు… నువ్వు ఎవర్నించీ తీసుకోలేవు. అందుకు దయచేసి ఎన్నికల్లో పోటీ చేయొద్దు. నువ్వు ఉన్న పార్టీ కోసం మాత్రం పనిచేయ్… అంతవరకే. నీ మేలు కోరేవాడ్ని కాబట్టి ఈ మాట చెబుతున్నా” అని శివాజీ హితవు పలికారు.