సీఎం చంద్రబాబు ఇవాళ బాధ్యతలు చేపడుతూ, ఎన్నికల హామీలపై సంతకాలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై జనసేనాని, రాష్ట్ర మంత్రి పవన్ కల్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. ఎన్డీయే కూటమి ఇచ్చిన హామీల అమలు మొదలైందని తెలిపారు.16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించి మెగా డీఎస్సీ ఫైల్‌పై తొలి సంతకం చేశారని, ప్రజల ఆస్తులకు రక్షణ కల్పిస్తూ ఏపీ ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దుపై రెండో సంతకం చేశారని చెప్పారు. సామాజిక పింఛన్లు రూ. 4,000కి పెంచుతూ మూడో సంతకం, ఆకలి తీర్చేందుకు అన్న క్యాంటీన్లు పునరుద్ధరిస్తూ నాలుగో సంతకం, యువతకు నైపుణ్యాలను అందించేందుకు నైపుణ్య గణన ఫైలుపై అయిదో సంతకం చేశారని పవన్ కల్యాణ్ వివరించారు. సంక్షేమం-అభివృద్ధి రెండు కళ్లుగా రాష్ట్రంలో ఎన్డీయే కూటమి పాలన సాగుతుందని, ఆంధ్రప్రదేశ్‌కు పునర్ వైభవం తీసుకువచ్చేందుకు తొలి అడుగులు పడ్డాయని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.