జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్టీఆర్ పేరు తీసేసి వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీగా మార్చారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ గెలిచాక, మళ్లీ వైఎస్సార్ పేరు తీసేసి ఎన్టీఆర్ పేరును పెట్టించారు. గత ప్రభుత్వంలో జగన్ పేరుతో ఉన్న పథకాల పేర్లను తీసేయాలని, ఎక్కడా జగన్ పేరు వినిపించకూడదని చంద్రబాబు నాయుడు చర్యలు తీసుకుంటున్నారు. ప్రభుత్వ కార్యాలయాలకు జగన్ పార్టీ రంగులు వేయడం, ప్రతి పథకంపై జగన్ పేరు అచ్చు వేయించడం వల్ల ప్రజలు మండిపడ్డారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఆ పేర్లన్నీ తీయించేశారు. జగన్ అన్న విద్యా దీవెనకు వసతి దీవెనల పేరును పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్‌గా మార్చారు. వైఎస్సార్ కళ్యాణమస్తు పథకానికి చంద్రన్న పెళ్లి కానుక, వైఎస్సార్ విద్యోన్నతి పథకానికి ఎన్టీఆర్ విద్యోన్నతి అని పేరు పెట్టారు. జగన్ అన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహ పథకంలోనూ జగన్ పేరును తొలగించారు. ఈ కొత్త పథకాల పేర్లు వెంటనే అమల్లోకి వస్తాయని ప్రభుత్వం జీవో విడుదల చేసింది.

