తెలంగాణ రాష్ట్రం మూడు జోన్లుగా విభజనకు సిద్ధమవుతున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పరేడ్ గ్రౌండ్‌లో జరిగిన వేడుకలో సీఎం రేవంత్ ఈ ప్రణాళికను ప్రకటించారు. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలోని ప్రాంతాలను అర్బన్ తెలంగాణగా, ఔటర్ రింగ్ రోడ్డు నుండి రీజినల్ రింగ్ రోడ్డు మధ్య ప్రాంతాలను సబ్ అర్బన్ తెలంగాణగా, రీజినల్ రింగ్ రోడ్డు నుండి తెలంగాణ రాష్ట్ర సరిహద్దుల వరకు ఉన్న ప్రాంతాలను గ్రామీణ తెలంగాణగా విభజించారు. మూడు జోన్లలో ప్రతి ప్రాంతంలో అభివృద్ధి చేయాల్సిన విధానం, మౌలిక సదుపాయాల కల్పన వంటి అంశాలను ‘గ్రీన్ తెలంగాణ 2050 మాస్టర్ ప్లాన్’లో స్పష్టంగా పేర్కొంటామని సీఎం రేవంత్ వెల్లడించారు. ఈ ప్రణాళిక రాష్ట్ర భవిష్యత్‌కు పునాదులు వేస్తుందని, దీర్ఘకాలిక ప్రణాళికలతో ముందుకు వెళ్తామని ఆయన తెలిపారు.