ప్రసూతి సమయంలో గర్భిణీ స్త్రీలకు సహాయం చేయడం గురించి ఆచరణాత్మక జ్ఞానం ఉన్న మహిళలను మంత్రసానులు అంటారు. ప్రాచీన కాలంలో ప్రపంచంలో ఆస్పత్రులు మరియు గర్భిణీ స్త్రీలకు తగిన ఆరోగ్య సదుపాయాలు లేనప్పుడు, తల్లులు ఇంట్లోనే శిశువులకు జన్మనివ్వడంలో మంత్రసానులు సహాయం చేసేవారు. మానవ మనుగడలో వారి సేవలకు తరతరాల చరిత్రే ఉంది. తొలుత పోర్చుగీస్ దేశీయులు నర్సుల వ్యవస్థను ఇండియాకు తెచ్చారు. ‘ఈస్ట్ ఇండియా కంపెనీ’ ఆధ్వర్యంలో మొదటి సర్సింగ్ స్కూలును 1871లో చెన్నైలో స్థాపించారు. కాలక్రమంలో వైద్యవృత్తిలో నర్సులు అంతర్భాగమయ్యారు.
సర్సింగ్ వృత్తి స్థాపకురాలుగా, సర్సింగ్ వ్యవస్థకే మూలపుటమ్మగా బ్రిటిష్ సంఘ సంస్కర్త ఫ్లోరెన్స్ నైటింగేల్ ను పరిగణిస్తారు. మంత్రసానులను గుర్తించడానికి మరియు అభినందించడానికి ఒక రోజును గుర్తించాలనే ఆలోచన 1987 లో నెదర్లాండ్స్ లో జరిగిన ఇంటర్నేషనల్ కాన్ఫెడరేషన్ ఆఫ్ మిడ్వైవ్స్ సమావేశం నుండి వచ్చింది. 1992 నుంచి ప్రతి సంవత్సరం మే 05 వ తేదీన అంతర్జాతీయ మంత్రసాని దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ప్రస్తుతం ఈ వేడుకలో సుమారు 50 దేశాలు భాగంగా ఉన్నాయి. మంత్రసానుల పనిని గౌరవించటానికి రోజును ఆచరిస్తారు.
శిశువులు సురక్షితంగా ప్రసవించడంలో సహాయపడే మంత్రసానుల సహకారంపై దృష్టి
పెట్టడం, వారి స్థితిగతులపై అవగాహన పెంచడం మరియు మంత్రసానుల వృత్తిని
గౌరవించడం అంతర్జాతీయ మంత్రసాని దినోత్సవం ముఖ్య ఉద్దేశ్యం, నైపుణ్యం కలిగిన
మంత్రసానిలు శతాబ్దాలుగా మహిళలకు, శిశువులకు అందిస్తున్న సేవలు
అమూల్యాలు. స్వాతంత్య్రానికి పూర్వమే దేశంలో ‘మంత్రసానుల’ వ్యవస్థ ప్రాచుర్యంలో ఉండేది.
ఆధునిక ఆరోగ్య సదుపాయాలు లేని ఆ రోజుల్లో తల్లీబిడ్డల యోగక్షేమాలను మంత్రసానులే
చూసేవారు. నేటికీ ఆదివాసీ, గ్రామీణ సమూహాల్లో పురుడు పోయడం, బాలింతల ఆరోగ్య
సంరక్షణలో మంత్రసానుల పాత్ర అమోఘం. మంత్రసాని గర్భిణీ తల్లులకు సరైన సంరక్షణ ఇస్తూ, ప్రసవ సమయంలో సహాయం చేస్తూ, ఒక్కోసారి తమ అనుభవాలతో పునర్జన్మ ప్రసాదిస్తున్న సంఘటనలు చర్విత చర్వణం అవుతున్నాయి. మంత్రసానిలు ఎంతో నైపుణ్యాలు కలిగిన వారు. గర్భం, శ్రమ, ప్రసవ సమయంలో, అలాగే ప్రసవానంతర కాలంలో బాలింతలకు, నవజాత శిశువులకు ప్రధాన సంరక్షకులు.
మంత్రసానులను గ్రామీణ ప్రాంతాలలో అపర దేవతా మూర్తులుగా భావించడం చూస్తున్నాం. ఆ వృత్తికి దక్కిన ఎనలేని గౌరవమది. ఇదంత సులువైన పని కాదు. వృత్తిపరమైన నైపుణ్యాలు అవసరం. చెదరని చిరునవ్వుతో ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొంటూ రకరకాల పరిస్థితులలో సేవలు అందజేయాలి. తోబుట్టువులు, రక్త సంబంధీకులు, చేయలేని పసులను సైతం వీరు సహనంతో చేస్తూ వృత్తిధర్మాన్ని పాటిస్తున్నారు. మానవత్వానికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్నారు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం, “ప్రపంచవ్యాప్తంగా, అన్ని సెట్టింగులలో, సంరక్షణ నాణ్యతను అందించడానికి మంత్రసానులు చాలా అవసరం.” ఒక మంత్రసాని శిక్షణ పొందిన ప్రొఫెషనల్, గర్భిణీ తల్లులకు సరైన సంరక్షణ ఇస్తుంది. ప్రసవ సమయంలో వారికి సహాయం చేస్తుంది. అంతర్జాతీయ మంత్రసాని దినోత్సవం సందర్భంగా, మంత్రసానిల పనిని గురించి ప్రముఖుల అభిప్రాయాల గురించి మననం చేసుకోవాలి.
మంత్రసానుల వ్యవస్థ ప్రాతిపదికగా, ఇటీవలి కాలంలో, ప్రభుత్వ పర శిక్షణలు
ఇప్పించి, శిక్షణ పొందిన వారి సేవలను పూర్తి స్థాయిలో వినియోగిస్తున్నారు. శిక్షణ పొందిన ఏ ఎన్ ఎంలు వైద్య సేవలు అందుబాటులో లేని గ్రామాలలో ఎనలేని సేవలు అందిస్తున్నారు. వీరు తల్లులకు సురక్షితమైన, సానుకూల ప్రసవ అనుభవాన్ని, నాణ్యమైన సంరక్షణను అందిస్తున్నారు. ప్రసవాలకు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లేలా అవగాహన కల్పిస్తూ, కుటుంబ నియంత్రణ, ముందస్తు ఆలో చన, శిశు మరణాల నివారణ, శిశు సంరక్షణ, గర్భిణుల సంక్షేమం, ఆరోగ్యం, పుట్టిన ప్రణాళికలను రూపొందించడంలో కూడా సహాయ పడుతున్నారు. ఇంతటి సేవలు అందించే ఏ ఎన్ ఎం, ఆశా వర్కర్ల పట్ల ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ద వహించాల్సిన అవసరం అనివార్యంగా ఉంది. అలాగే శిక్షణ పొంది, ప్రవేటు ఆసుపత్రులలో ఎనలేని సేవలు అందిస్తున్న వారి బాగోగులు చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది.