ఓ ముస్లిం మహిళ తనకు జన్మించిన బిడ్డకు ‘మహాలక్ష్మి’ అని రైలు పేరు పెట్టి అందరినీ ఆశ్చర్యపరిచింది. కల్హాపూర్-ముంబై మహాలక్ష్మి ఎక్స్ ప్రెస్ ట్రైన్‌లో జూన్ 6న ఫాతిమా ఖాతూన్ (31) తన భర్త తయ్యబ్‌తో కలిసి ప్రయాణిస్తోంది. ట్రైన్ లోనావాలా స్టేషన్ చేరుకుంటున్న సమయంలో ఫాతిమాకు వాంతులు అవుతుండటంతో ఆమె రైలులోని టాయిలెట్‌కు వెళ్లింది. ఎంత సేపటికి తిరిగి రాకపోవడంతో ఆమె భర్త వెళ్లి చూడగా ఫాతిమా అక్కడే ఆడబిడ్డకు జన్మనిచ్చిందని గుర్తించాడు. తోటి ప్రయాణికులు ఫాతిమాకు సహాయం చేశారు. రైలు స్టేషన్‌కు చేరుకోగానే వైద్య సిబ్బందిని ఏర్పాటు చేసి ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. తల్లిబిడ్డ క్షేమంగా ఉండటంతో వారిని డిశ్చార్జ్ చేశారు. ఫాతిమా భర్త మీడియాతో మాట్లాడుతూ, తన భార్య తమ బిడ్డకు ‘మహాలక్ష్మి’ పేరుతోనే పిలుచుకోవాలని నిర్ణయించుకుందన్నారు.