ఆక్సిజన్ అంటే తెలుగు లో ఓటు అని అర్థం కాబట్టి ఆక్సిజన్ టవర్స్ లో ఉన్నవారందరూ తమ ఓటు హక్కును వినియోగించుకుని సమర్థులను ఎన్నుకోవాలని.. విద్యావంతులందరూ ఎలక్షన్ రోజున అశ్రద్ధ చేయకుండా ఓటింగ్ లో పాల్గొని ఓటింగ్ శాతం పెంచాలని జై భారత్ పార్టీ అధ్యక్షుడు విశాఖ ఉత్తర నియోజకవర్గం అసెంబ్లీ అభ్యర్థి జేడీ లక్ష్మీనారాయణ పిలుపు ఇచ్చారు. స్థానిక రైతు బజార్ దగ్గర ఉన్న ఆక్సిజన్ టవర్స్ లో తమ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తూ విద్యావంతులు ఎక్కువగా ఓటింగ్ కు దూరంగా ఉంటున్నారు. పట్టణాల్లో ఓటింగ్ శాతం గ్రామాల కంటే చాలా తక్కువగా ఉంటుంది. ఇది ఆందోళన కలిగించే విషయం.. పట్టణాలలో ఉద్యోగస్తులు ఎలక్షన్ రోజున సెలవు ఉంటుందని కాబట్టి బద్దకించి బయటకు రాకపోవడం లేదా సొంత పనులు చూసుకుంటూ ఓటు వేయడం లేదు, అందువల్ల అసమర్థులు అందలం ఎక్కుతున్నారు. వారికి రాజ్యాంగం పైన కానీ, అభివృద్ధి పైన కానీ, అవగాహన లేకపోవడం వలన అభివృద్ధి కుంటుపడి రాష్ట్రం అప్పులపాలయ్యింది. కాబట్టి విద్యావంత లందరూ ఓటింగ్ లో పాల్గొని సమర్ధులైన వారిని ఎన్నుకుని చట్టసభలకు పంపించాలని ఆయన పిలుపునిచ్చారు.
తాను జై భారత్ పార్టీ తరఫున విశాఖఉత్తర నియోజకవర్గం అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని తన గుర్తు అయిన ‘టార్చ్ లైట్’ గుర్తుపై ఓటు వేసి తనను గెలిపిస్తే విశాఖ నార్త్ నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసి అన్ని సమస్యలు పరిష్కరించి రాష్ట్రంలోనే ఉత్తమ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని ఆయన హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆక్సిజన్ టవర్స్ లో నివాసం ఉంటున్న అపార్ట్మెంట్ వాసులందరూ మిమ్మల్ని అసెంబ్లీకి పంపే బాధ్యత మాది నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయవలసిన బాధ్యత మీది అంటూ తమ సమస్యలు ఆయనకు వివరిస్తూ రైతు బజార్ లో మిగిలిపోయిన కూరగాయల వ్యర్థాలను ప్రక్క సందులో రోడ్డుమీద వేయడం వలన తమ రాకపోకలకు చాలా ఇబ్బంది కలుగుతుందని వాసన భరాయించలేకపోతున్నాం. మున్సిపాలిటీ వాళ్లకు ఎన్ని సార్లు చెప్పినా పట్టించుకొనే నాథుడే లేరు మీరు గెలిచిన వెంటనే తమ సమస్య పరిష్కరించాలని వారు కోరారు. అందుకు జేడీ స్పందిస్తూ మీ సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొని దానిని అమలు చేస్తానని హామీ ఇచ్చారు.