ఎన్నికలు ముగియడంతో బీజేపీ నుంచి నలుగురు ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ నుంచి 20 మంది కాంగ్రెస్ లోకి వస్తారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. ఇవాళ గాంధీభవన్ లో మీడియాతో మాట్లాడారు. ఆ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి వస్తే తమకు 90 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంటుందన్నారు. బీజేపీ ఎంపీ లక్ష్మణ్ కాంగ్రెస్ పార్టీపై అసత్యాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
లక్ష్మణ్ పండితుడిలా జాతకాలు చెబుతున్నారని ఎద్దేవా చేశారు. ఆగస్టులో కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షోభంలో పడుతుందని లక్ష్మణ్ ఎలా అన్నారని నిలదీశారు. లక్ష్మణికి పొలిటికల్ చిప్ ఖరాబ్ అయినట్టు ఉందని ఎద్దేవా చేశారు. కొత్త చిప్ వేసుకొని రావాలని, లేదంటే దానికి అయ్యే ఖర్చునూ కూడా కాంగ్రెస్ పార్టీనే ఇస్తుందని ఆయన సెటైర్లు వేశారు. బీజేపీ నేతలు మోసగాళ్లకు మోసగాళ్లు అని మండిపడ్డారు.
నమ్మించి మోసం చేసే నైజం బీజేపీలో ఉందని తెలిపారు. వేరే రాష్ట్రాల్లో చేసినట్లు జిమ్మిక్కులు ఎన్ని చేసినా ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఐదేళ్లు పక్కాగా ఉంటుందన్నారు. 68 సీట్లు ఉన్న కాంగ్రెస్ ఎందుకు కూలిపోతుందన్నారు. బీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తారు అనటంలో అర్థం ఏంటని ప్రశ్నించారు.
మోసం అంటే ఎలా ఉంటుందో కూడా కాంగ్రెస్ కు తెలియదన్నారు. చెప్పిన పనిని, ఇచ్చిన మాటను అమలు చేయటం మాత్రమే కాంగ్రెస్ పార్టీకి తెలుసునని అన్నారు.