తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేరవుతోన్న నిరుద్యోగులకు టీఎస్‌పీఎస్సీ కీలక అప్‌డేట్ ఇచ్చింది. విద్యార్థులంతా ఎంతో ఉత్కంఠతో వేచిచూస్తోన్న గ్రూప్-1, 2, 3 పరీక్షల షెడ్యూల్ రిలీజ్ చేసింది. గ్రూప్ సర్వీసుల (TSPSC Groups) అన్నీరకాల అర్హత పరీక్షలను 2024 చివరికల్లా పూర్తిచేసేలా ప్రణాళికను ప్రకటించింది.
ఏ పరీక్ష ఎప్పుడంటే..?
ఇటీవల గ్రూప్-1 కేటగిరీలో 563 పోస్టుల భర్తీకి టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. జూన్ 9న గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష నిర్వహిస్తామని ప్రకటించింది. తాజాగా అక్టోబర్ 21 నుంచి గ్రూప్-1 మెయిన్స్ నిర్వహిస్తామని వెబ్ నోట్‌లో పేర్కొంది.

ఇక 783 గ్రూప్-2 పోస్టుల భర్తీకి ఆగస్టు 7, 8 తేదీల్లో ఎగ్జామ్స్ జరుగుతాయని టీఎస్‌పీఎస్సీ ప్రకటించింది. అటు 1,388 గ్రూప్-3 ఉద్యోగాల భర్తీకి నవంబర్ 17, 18 తారీఖుల్లో పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొంది. అటు గ్రూప్-1 కోసం మార్చి 14 వరకు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ కొనసాగనుంది. గ్రూప్-2 పోస్టులకు ఇప్పటికే 5.51 లక్షల మంది అభ్యర్థులు అప్లై చేసుకోగా.. గ్రూప్-3 పోస్టులకు 5 లక్షలకు పైగా దరఖాస్తు చేసుకున్నారు.
ప్రిపరేషన్‌కు సమయం సరిపోతుందా?
గ్రూప్ సర్వీసులకు ముందస్తుగానే అర్హత పరీక్షల షెడ్యూల్ ప్రకటించడంపై నిరుద్యోగుల్లో మిశ్రమ స్పందన వస్తోంది. కొందరు ప్రిపేరేషన్‌కు ప్రణాళిక వేసుకునేందుకు వెసులుబాటు కల్పించారని హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరికొందరేమో గ్రూప్-2, 3 సర్వీసుల్లో పోస్టులు పెంచి షెడ్యూల్ ఇస్తారనుకుంటే.. పాత పోస్టులకే పరీక్ష తేదీలు ప్రకటించారని ఆందోళన చేస్తున్నారు.
ఇప్పటికే గ్రూప్స్ పరీక్షల కోసం అభ్యర్థులు పలుమార్లు ప్రిపేర్ కావాల్సి వచ్చింది. చెప్పిన సమయానికి పరీక్షలు నిర్వహించకపోవడంతో వారిలో ఆందోళన మొదలైంది. కానీ ఈసారి 3, 4 నెలల సమయం ప్రిపేరేషన్‌కు దొరికినట్లైంది. ఆ తర్వాత గ్రూప్-2 పరీక్షలకు మరో 2 నెలలు, గ్రూప్-1 మెయిన్స్ ఎగ్జామ్స్‌కు 2 నెలలు ఉంది. ఇంకా గ్రూప్-1 మెయిన్స్ తర్వాత నెల రోజుల పరిధిలో గ్రూప్-3 పరీక్షలు నిర్వహించనున్నారు. దీంతో ప్రిపరేషన్‌కు సంతృప్తికర స్థాయిలో సమయం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
READ LATEST TELUGU NEWS : మెగా డీఎస్సీకి నోటిఫికేషన్ రిలీజ్.. ఇవి పరిశీలించారా?