రోడ్డు ప్రమాదంలో సీఎం మమతా బెనర్జీ తలకు గాయం
By CORRESPONDENT
పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. ఆమె ప్రయాణిస్తున్న కారు.. యాక్సిడెంట్‌కు గురైనట్లు అధికారులు వెల్లడించారు. బర్ధమాన్ నుంచి కోల్‌కతా తిరిగివస్తుండగా దీదీ కారుకు ప్రమాదం జరిగినట్లు తెలిపారు.
అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించేందుకు సీఎం మమతా బెనర్జీ బుధవారం మధ్యాహ్నం బర్ధమాన్ వెళ్లారు. సమీక్ష అనంతరం అక్కడి నుంచి విమానంలో కోల్‌కతా చేరుకోవాల్సి ఉంది. అయితే వర్షం కారణంగా వాతావరణం అనుకూలించకపోవడంతో.. దీదీ రోడ్డు మార్గంలో కోల్‌కతాకు బయల్దేరారు. ఈ క్రమంలో ఆమె కాన్వాయ్‌కు ఎదురుగా మరో వాహనం వచ్చింది. అది గమనించి అప్రమత్తమైన డ్రైవర్ సడెన్‌గా బ్రేకులు వేశాడు. దీంతో ముందు సీట్లో కూర్చున్న సీఎం.. విండ్ షీల్డ్‌కు ఢీకొట్టడంతో ఆమె తలకు గాయమైనట్లు అధికారులు వెల్లడించారు. స్వల్ప గాయాలతో బాధపడుతున్న ఆమెను వెంటనే మరో వాహనంలో కోల్‌కతాకు తరలించినట్లు పేర్కొన్నారు. వర్షంతో పాటు దట్టమైన పొగమంచు రోడ్డును కమ్మేయడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు.
కాగా రానున్న పార్లమెంట్ ఎలక్షన్లలో .. తృణమూల్ కాంగ్రెస్ ఒంటరిగానే పోటీ చేస్తుందని.. కాంగ్రెస్‌తో తమకు ఎలాంటి సంబంధం లేదని దీదీ ఈరోజు మధ్యాహ్నమే ప్రకటించారు. ఇలా చెప్పి ప్రతిపక్ష ఇండియా కూటమికి షాక్ ఇచ్చిన కొద్దిసేపటికే మమతా బెనర్జీ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఏదిఏమైనప్పటికీ.. ఈ రోడ్డు ప్రమాదంలో తమ పార్టీ అధినేత్రి స్వల్పగాయాలతో బయటపడటంతో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఊపిరిపీల్చుకున్నారు.