తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల ఫలితాల్లో అనూహ్య ఫలితాలు వెలువడ్డాయి. బీజేపీ-కాంగ్రెస్ పార్టీల మధ్య టఫ్ ఫైట్ నడిచింది. మొత్తం 17 స్థానాల్లో చెరో 8 స్థానాల్లో ఆ పార్టీల అభ్యర్థులు విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో పలువురు సిట్టింగ్ ఎంపీలు ఓడిపోగా, కొత్త అభ్యర్థులు విజయం సాధించారు. సోషల్ మీడియా సెన్సేషన్‌గా రాజకీయాల్లోకి వచ్చిన కర్నె శిరీష అలియాస్ బర్రెలక్క ఈసారి కూడా పోటీ చేసి ఓడిపోయారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కొల్లాపూర్ నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన ఆమె, ఈసారి పార్లమెంట్ ఎన్నికల బరిలో నిలిచి నాగర్ కర్నూల్ ఎంపీ స్థానానికి పోటీ చేశారు. విస్తృతంగా ప్రచారం చేసినప్పటికీ, ఆమెకు కేవలం 3,087 ఓట్లు మాత్రమే వచ్చాయి. కాంగ్రెస్ అభ్యర్థి మల్లు రవి 94,414 ఓట్ల మెజారిటీతో బీజేపీ అభ్యర్థి పోతుగంటి భరత్‌ను ఓడించారు.ఈ ఫలితాలతో బర్రెలక్క రాజకీయాల నుంచి విరమించుకుంటారో లేక మరోసారి పోటీ చేస్తారో వేచి చూడాలి. ఇటీవల ఆమె సమీప బంధువును పెళ్లి చేసుకొని కొత్త జీవితం ప్రారంభించారు.