ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు విడుదలైన తర్వాత తొలిసారి రాజకీయ విశ్లేషకుడు ప్రశాంత్ కిశోర్ తన ఎక్స్ అకౌంట్ ద్వారా స్పందించారు. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు దాదాపుగా తన అంచనాలనే ప్రతిబింబిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఎక్స్‌లో ఓ పోస్టును షేర్ చేసిన ప్రశాంత్ కిశోర్.. ‘‘వచ్చే సారి రాజకీయాలు, ఎన్నికలకు సంబంధించిన చర్చ వచ్చినప్పుడు పనికిమాలిన చర్చలు, ఫేక్ జర్నలిస్టులు, పెద్ద నోరేసుకుని పడిపోయే రాజకీయ నాయకులు, స్వయం ప్రకటిత సోషల్ మీడియా నిపుణుల విశ్లేషణల్లో దూరి మీ విలువైన సమయాన్ని వృథా చేసుకోవద్దు’’ అని సూచించారు. దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి విజయం సాధిస్తుందని అంచనా వేశాయి. ఇండియా టుడే-మై యాక్సిస్ ఇండియా ఎగ్జిట్ పోల్స్ ప్రకారం ఎన్డీయేకు 361 నుంచి 401 సీట్ల వరకు వచ్చే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే, ఇండియా కూటమి 131 నుంచి 166 స్థానాలకు పరిమితమవుతుందని తేల్చి చెప్పింది. ప్రశాంత్ కిశోర్ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. 2019 ఫలితాలు రిపీట్ అవుతాయని, అయితే 400 మార్క్ దాటడం కష్టమని తేల్చి చెప్పారు. అయితే, బీజేపీకి 270 సీట్లు కూడా రావని అనుకుంటున్నప్పటికీ, 370 సీట్లకు పైనే గెలుచుకుంటుందని అంచనా వేశారు. ఈ నేపథ్యంలో తాజాగా పీకే ఇలా స్పందించారు.