ఇజ్రాయేల్ యాదవ్, కరస్పాండెంట్.
హైదరాబాద్, అక్టోబర్ 31 (వర్డ్ ఆఫ్ ఇండియా):
దేశంలో ఐదు రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికల నగారా మోగినవేల డబ్బు ప్రవాహం ఏరులై పారుతుంది. తెలంగాణలో కేవలం 22 రోజులలో అక్రమంగా దొరికిన డబ్బు విలువ దాదాపుగా 400 కోట్ల పైమాటే. ఇప్పుడే పరిస్థితి ఇలా ఉందంటే పోలింగ్ తేదీ వరకు దోపుడు సొమ్ము వేలకోట్లలో పట్టుబడుతుందనడంలో అతిశయోక్తి లేదు. ఇలా రాజకీయ నాయకులు డబ్బు, మద్యం, బంగారం, వెండి, కార్లు, ఫోన్లు ఇలా ఎన్నో ఎరగా వేసి ఓటర్లను ప్రభావితం చేస్తూ, చూస్తుండగానే వారి కళ్ళకు గంతులు కట్టినట్లుగా వోటర్లను మాయ చేసే సమయం రానే వచ్చింది. ఓటు వేయడమే తరువాయి.
ఒకసారి ఓటు వేయడం అయిపోయిందంటే ఖతం…ఓటర్ల నాడి నాయకుల చేతుల్లోనే. ఏమున్నా ఓటర్ల విలువ నవంబర్ 30 వరకే. ఆ తర్వాత నువ్వు రమ్మన్నా… నీ బాధ వినమన్నా, ఏ నాధుడూ లేక్కచేయడనేది చేదు నిజం. అందుకే ఓ ఓటరు మహాశయా… ఇప్పుడే నువ్వు ఒక్కసారి ఆలోచించు. అసలు నీ అక్కర ఏది! సమాజ హితానికి నువ్వు కోరుకున్నదేంది! నీ ఇంటికి ఏమి కావాలని అడిగేది దానికన్నా…నీ వాడకేమి కావాలి! నీ ఊరికి ఏమి కావాలో ప్రశ్నించు. అప్పుడు నీ గొంతుకకు బలం చేకూరుతుంది. నలుగురు కలిసి నిలదీసిననాడే నువ్వు అన్నది ఏందో ఈ సమాజానికి తెలుస్తది.
ఇంకెన్నాళ్లని చూస్తవ్ ఈ నాయకుల దోబూచిలాట! నీ ముందడుగు నీ మంచి కొరకు, నీ భవిష్యత్తు కొరకు, నీ పిల్లలతో నవ సమాజాన్ని నిర్మించే రేపటి భావి తరాల కొరకు అని ఆలోచించి ముందడుగెయ్. నువ్ మౌనం వహిస్తూ… నోరుండి మాటరాని మూగ పక్షి వైతవా, బంగారు సమాజాన్ని నిర్మించడానికి ప్రశ్నించే ఓటరువైతవా! ఓటరుగా నీకున్న హక్కుతో ప్రశ్నించు. పది అడిగితే ఒక్కటన్నా తీరదా నీ హామీ.
కానీ వోటు కొరకు నోటుకి చేయి చాస్తే రేపు ఏ ముఖం పెట్టుకొని నిలదీసి అడుగుతవ్ ఈ ఫలానా పని చేయమని. ఓ యువత ఆలోచించు…….నీవు ఓటుకు అమ్ముడుపోయే బిక్షగాడి వైతవా? ఆ భిక్షగాడినే నిర్మూలించే యువ కిరీటమైతవా! ఓ యువతరమా మేలుకో….. స్ఫూర్తినియ్యి నీవు చదువుకున్న నీ చదువులమ్మకి! న్యాయం చెయ్యి నీపై ఆశలెట్టుకున్న నిన్ను కన్న తల్లికి! సార్ధకం చెయ్యి దేవుడు నీకు ఇచ్చిన ఈ గొప్ప జన్మకి!